
విజయనగరం మున్సిపాలిటీ: మిషన్ ఎవరెస్ట్ పథకం–2018 కింద ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు ఆసక్తి గల యువతీ, యువకుల నుంచి స్పెషల్ కమిషనర్, యువజన సర్వీసుల శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్విజ్ సీఈఓ ఎం.సత్యనారాయణ సోమవారం తెలిపారు. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల డిగ్రీ విద్యనభ్యసించిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. గ్రామీణ అభ్యర్థుల ఆదాయం రూ.81వేలు, పట్టణ ప్రాంత అభ్యర్థుల ఆదాయం రూ.1.03 లక్షల లోపు ఉండి తెల్ల రేషన్ కార్డుదారులై ఉండాలన్నారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడే వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
మెడికల్ ఫిట్‌నెస్ దరఖాస్తును ప్రభుత్వ వైద్యునిచే ధృవీకరించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉండి, పురుషులు 100 మీటర్ల పరుగు పోటీని 16 సెకండ్ల వ్యవధిలో, 2.4 కిలోమీటర్ల పరుగు పోటీనీ 10 నిమిషాల్లో చేరుకోవాలన్నారు. 3.65 మీటర్ల లాంగ్‌జంప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా స్త్రీలు 100 మీటర్ల పరుగు పోటీని 18 సెకండ్లలో, 2.4 కిలోమీటర్ల పరుగు పోటీనీ 13 నిమిషాల్లో చేరుకోవటంతో పాటు 2.7 మీటర్ల లాంగ్‌జంప్ పరీక్షలో అర్హత సాధించాలన్నారు. అభ్యర్థులు తల్లిదండ్రులు, సంబంధిత విద్యా సంస్థల నుంచి అనుమతి పొందిన లేఖను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెట్విజ్ కార్యాలయం 08922– 273768, 98499 13080 నెంబర్‌లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment