రాజీలేని హైదరాబాద్ సాహసి..!! | raji tammineni adventure journey to mission everest | Sakshi
Sakshi News home page

రాజీలేని హైదరాబాద్ సాహసి..!!

Published Sun, Jan 22 2017 2:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

రాజీలేని హైదరాబాద్ సాహసి..!!

రాజీలేని హైదరాబాద్ సాహసి..!!

హైదరాబాద్‌: ‘ఎవరెస్టంత’ ఆత్మవిశ్వాసమే పునాదిగా... వనితా లోకానికే వన్నె తెచ్చేలా సాహసయాత్రకు సిద్ధమవుతోంది సిటీకి చెందిన ఓ మహిళ. ఆరంతస్తుల మేడ ఎక్కేందుకు ఆపసోపాలు పడే ఈ రోజుల్లో.. ప్రపంచంలోని ఎత్తైన సప్త శిఖరాలపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పానికి పూనుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికా టాంజానియాలోని కిలిమంజారో (19,341 అడుగులు)ను అధిరోహించి మువ్వన్నెల పతాకను రెపరెపలాడించింది. అదే స్ఫూర్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్‌ ఎవరెస్ట్‌ (29,029 అడుగులు) అధిరోహణకు అంతులేని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. భార్యగా.. మాతృమూర్తిగా... సామాజిక కార్యకర్తగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూనే చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్నే ఊపిరిగా చేసుకుని మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరాగ్రాన్ని ముద్దాడేందుకు ముందుడుగు వేస్తోంది రాజీ తమ్మినేని.

ఇదీ నేపథ్యం...
కర్నూలుకు చెందిన నాగరాజు, సుశీల దంపతులకు కుమార్తె రాజీ తమ్మినేని. 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. నగరంలోని ఎంఎన్‌సీ కంపెనీలో సీనియర్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆమెకు సీహెచ్‌.వెంకటకృష్ణతో వివాహం జరగ్గా తమ ఐదేళ్ళ కుమారుడితో కలిసి నాగారంలో నివాసం ఉంటున్నారు.  చిన్నతనంలో చెట్లు, పుట్టలు, కొండలు ఎక్కడం అంటే రాజీకి ఎంతో సరదా. అదే ఇప్పుడు ఆమె జీవితాశయంగా మారింది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరి, కుటుంబ బాధ్యతలను స్వీకరించినప్పటికీ చిన్నప్పటి నుంచి తనలో దాగిఉన్న పర్వతారోహణ ఆశయాన్ని చంపుకోలేకపోయింది. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ..లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగం, ఇటు కుటుంబం చూస్తూనే తరుచూ పర్వతారోహణ టూర్లకు వెళ్తుండేది. పూర్తిస్థాయిలో మౌంటెనింగ్‌కు సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్‌లోని హిమాలయ మౌంటెనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.

ఎన్నో విజయాలు...
2015 ఆగస్టు 23న సౌతాఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారోను రాజీ అధిరోహించారు.
2015 మే 25న వెస్ట్‌ సిక్కింలోని రినోక్‌ శిఖరాగ్రానికి చేరుకుని తెలుగువారి కీర్తిని చాటారు.
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులకు పర్వతారోహణలో  మెలకువలు నేర్పించి 2016 ఆగస్టు 15న వారితో కలిసి మరోసారి కిలిమంజారో శిఖరానికి చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
హిమాలయ ప్రాంతంతో పాటు వెస్ట్రన్‌ ఘాట్స్‌ ప్రాంతాల్లోని మరెన్నో పర్వతాలను అధిరోహించి తనలోని అభిలాషను చాటడమే కాకుండా సాహసానికి మరోపేరుగా నిలిచారు.

సప్త శిఖరాగ్రాలకు చేరడమే లక్ష్యంగా...
ప్రపంచంలో ఏడు ఖండాల్లో విస్తరించిన ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనే దృఢమైన కోరికను మది నిండా నింపుకుంది రాజీ. ఇప్పటికే కిలిమంజారో శిఖర లక్ష్యాన్ని పూర్తి చేయగా...ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరెస్ట్‌ శిఖరాగ్రాన్ని అందుకునేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటోంది. పర్వతారోహణ నిపుణుడు శేఖర్‌బాబు వద్ద మెళకువలను నేర్చుకుంటూ ఫిట్‌నెస్‌పరంగా చక్రిపురంలోని సాయీస్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌లో తర్ఫీదు పొందుతున్నారు. ఏడు శిఖరాలను చేరుకునే వరకు తన లక్ష్యాన్ని వీడబోనని ఈ సందర్భంగా రాజీ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఆమెలోని పట్టుదల, తపన,విజయ ‘శిఖరా’లకు చేరుస్తోందని మెంటర్‌ గా వ్యవహరిస్తోన్న బాలచంద్ర పేర్కొన్నారు.

అభయ ఫౌండేషన్‌ సహకారం...
మౌంటెనీరింగ్‌లో రాజీ అభిరుచిని గమనించి అభయ ఫౌండేషన్‌ ఆమెకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అభయ ఫౌండేషన్‌లోనే వాలంటీర్‌గా పనిచేస్తోన్న రాజీకి... శిక్షణ ఇప్పించడంతో పాటు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించేందుకు ఇప్పటివరకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. అయితే ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కి రావాలంటే దాదాపు 25 లక్షల పైగా ఖర్చువుతోంది. అభయ ఫౌండేషన్‌ తరుపున ఐదు లక్షల మేర సమకూరుస్తుండగా మిగిలిన మొత్తం సమకూర్చుకునే విషయంపై రాజీ తర్జనభర్జన పడుతున్నారు. దాతలు ఎవరైనా ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందిస్తారేమోనని ఎదురుచూస్తోంది. ప్రభుత్వమైనా స్పందించి తనకు ఆర్థిక సహాయం చేస్తే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహిస్తానని రాజీ పేర్కొంటోంది.

అభయ ఫౌండేషన్‌ తరుపున రూ.5 లక్షలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా,  మరో  పది లక్షల వరకు సమకూర్చుకున్నా...మిగిలిన మొత్తాన్ని శిక్షకుడు శేఖర్‌బాబు చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు రాజీ చెప్పారు. దాతలు ఎవరైనా స్పందించాలనుకుంటే 9963002727, 9032818284 నెంబర్లలో సంప్రదించవచ్చు. కాగా ఏప్రిల్‌లో జరిగే మిషన్‌ ఎవరెస్ట్‌–17కు ఈ నెలాఖరు లోగానే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement