తాజాగా బ్రిటిష్ పర్వతారోహకుడు శాండీ ఇరి్వన్ ఆనవాళ్లు లభ్యం
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్‌బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది.
ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్‌దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment