సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి సోమవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరో హించారు. స్థానికంగా ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్న 25 ఏళ్ల పడమటి అన్వితారెడ్డి నేపాల్‌లోని లుక్లా నుంచి మే 9న ఎవరెస్ట్ అధిరోహణ మొదలు పెట్టారు. మే 12న బేస్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించి, మే 16న ఉదయం 9.30కు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
అన్వితా రెడ్డి విజయం పట్ల కోచ్ శేఖర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మద్దతు ఇచ్చిన ఆమె తల్లిదండ్రులు, స్పాన్సర్లు, సహోద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కాగా, అన్వితారెడ్డి ఇప్పటికే ఫిబ్రవరి 2021లో ఖాడే పర్వతాన్ని (భారతీయ హిమాలయాలు–సో–మోరిరి, లదాఖ్), జనవరి 2021లో ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. డిసెంబర్ 2021లో యూరప్‌లోని ఎత్తయిన శిఖరం ఎల్‌బ్రస్ పర్వతాన్ని ఎక్కిన తొలిమహిళగా రికార్డు సృష్టించారు. అన్వితారెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment