Padamati Anvitha Reddy
-
Anvitha Reddy: ‘మనాస్లు’ పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి మరో రికార్డ్ సృష్టించారు. నేపాల్‌లోని ఎత్తయిన మనాస్లు పర్వతాన్ని అధిరోహించారు. పర్వతారోహణ కోసం ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ నుంచి నేపాల్ బయలుదేరి వెళ్లిన అన్వితారెడ్డి... సెప్టెంబర్ 11న మనాస్లూ బేస్ క్యాంప్ చేరుకున్నారు. సముద్రమట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత పైభాగానికి 28వ తేదీ రాత్రి చేరుకొని భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా అన్వితారెడ్డి చరిత్ర సృస్టించారు. మనాస్లు... ప్రపంచంలోనే ఎనిమిదో ఎత్తయిన పర్వతం కావడం విశేషం. ఇప్పటికే పలు పర్వతాలను అధిరోహించిన అన్వితారెడ్డి.. మేలో ఎవరెస్టును, 2021 జనవరిలో ఆఫ్రికాలోని కిలిమంజారోను, ఫిబ్రవరిలో ఖడే, డిసెంబర్లో యూరప్‌లోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో అన్వితారెడ్డి పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. పట్టణంలోని పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళ దంపతుల కుమార్తె అయిన అన్విత... ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు. -
Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న ఎవరెస్టును అధిరోహించి హైదరాబాద్‌కు చేరుకున్న పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డిని బుధవారం ఘనంగా సన్మానించారు. ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె స్పాన్సర్, అన్వితా గ్రూప్ అధినేత అచ్యుతరావు, కోచ్ శేఖర్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భువనగిరిలో తాను చూసిన కోటనే తనకు ప్రేరణ అయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కని నేపాల్‌లోని ఎవరెస్టు పర్వతం దక్షిణం వైపు నుండి శిఖరాన్ని అధిరోహించినట్లు తెలిపారు. మే 16న ఉదయం 9:30కి ఎవరెస్టు శిఖరం (8848.86 మీటర్లు) చేరుకోవడం ద్వారా తన కలను సాకారం చేసుకున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన అన్వితారెడ్డి.. స్థానికంగా ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. (క్లిక్: ఎవరెస్ట్‌పై నుంచి చూస్తే ప్రపంచం చిన్నగా కనిపించింది) -
ఎవరెస్ట్ మిన్నగా.. ప్రపంచం చిన్నగా.. నా కల నెరవేరింది: అన్వితా రెడ్డి
సాక్షి, యాదాద్రి: ‘ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరిన తర్వాత చూస్తే.. ప్రపంచం చాలా చిన్నగా కనిపించింది. ఎప్పటినుంచో ఉన్న ఆశ ఈ సంవత్సరం తీరింది. నా కల నెరవేరింది. వివిధ పర్వతాలు అధిరోహించిన అనుభవంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎవరెస్ట్ ఎక్కగలిగాను. మరో శిఖరాన్ని ఎక్కడానికి ఉత్సా హంగా ఉన్నాను’అంటూ సంతో షం వ్యక్తం చేశారు ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన పడమటి అన్వితారెడ్డి. ఈ నెల 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆమె బుధవారం ఉదయం 10.30కి నేపాల్‌లోని బేస్‌క్యాంపునకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఫోన్లో ‘సాక్షి’తో చెప్పిన అంశాలు ఆమె మాటల్లోనే.. అధైర్యపడలేదు... ‘‘మొదట ఎంత ఆత్మస్థైర్యం, నమ్మకంతో ప్రారంభమయ్యానో... చివరి వరకు అలాగే ఉన్నా. ఎక్కడా అధైర్యపడలేదు. అంతా సవ్యంగా జరిగింది. బేస్ క్యాంపు నుంచి సమ్మిట్ వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చేరుకోగలిగా. డిసెంబర్లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతం ఎక్కినప్పుడు చిన్న ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నింటినీ అధిగమించి ఆ పర్వతం అధిరోహించాను. అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించడంలో తోడ్పడ్డాయి. వాతావరణం అనుకూలించనప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. కానీ, వాతావరణం అనుకూలించగానే ఎక్కడా ఆగకుండా సాగర్మాత (ఎవరెస్ట్ శిఖరాన్ని సాగర్మాత అంటారు) వరకు చేరుకున్నాను. సంతోషంతో కేరింతలు.. మే 16న ఉదయం 9.30 గంటలకు ఎవరెస్టును అధిరోహించాను. అక్కడినుంచి చూస్తే ప్రపంచమంతా చిన్నగా కనిపించింది. చుట్టు పక్కల దేశాలు చిన్నగా అనిపించాయి. నా లక్ష్యం నెరవేరిందన్న సంతోషంతో ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత కేరింతలు కొట్టాను. నా వద్ద ఉన్న కెమెరాతో వీడియో తీశాను. ఫొటోలు తీసుకున్నాను. 15 నుంచి 20 నిమిషాలపాటు శిఖరాగ్రంపై ఉన్నాను. ఆ సమయంలో నా వెంట తెచ్చిన పూజా జెండాలు కట్టడంతోనే సరిపోయింది. భూమి మీదికి వచ్చిన తర్వాత అన్ని పెద్దగా కనిపిస్తున్నాయి. మరెన్నో లక్ష్యాలు... నాకింకా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న పర్వతాలన్నింటినీ అధిరోహించాలి. ఒక్కొక్కటిగా నెరవేర్చకుంటా. నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులు, కోచ్‌లు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు’’ అంటూ అన్విత ఉద్వేగాన్ని పంచుకున్నారు. -
ఎవరెస్ట్‌పై అన్వితారెడ్డి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి సోమవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరో హించారు. స్థానికంగా ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్న 25 ఏళ్ల పడమటి అన్వితారెడ్డి నేపాల్‌లోని లుక్లా నుంచి మే 9న ఎవరెస్ట్ అధిరోహణ మొదలు పెట్టారు. మే 12న బేస్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించి, మే 16న ఉదయం 9.30కు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అన్వితా రెడ్డి విజయం పట్ల కోచ్ శేఖర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మద్దతు ఇచ్చిన ఆమె తల్లిదండ్రులు, స్పాన్సర్లు, సహోద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, అన్వితారెడ్డి ఇప్పటికే ఫిబ్రవరి 2021లో ఖాడే పర్వతాన్ని (భారతీయ హిమాలయాలు–సో–మోరిరి, లదాఖ్), జనవరి 2021లో ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. డిసెంబర్ 2021లో యూరప్‌లోని ఎత్తయిన శిఖరం ఎల్బ్రస్ పర్వతాన్ని ఎక్కిన తొలిమహిళగా రికార్డు సృష్టించారు. అన్వితారెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. -
20 మంది టీంలో ఐదుగురు చనిపోయారు.. అయినా..
సాక్షి, హైదరాబాద్: శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల చలిలో, గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళగా భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి నిలిచింది. పర్వతారోహణ పూర్తిచేసి నగరానికి చేరుకున్న ఆమెను గూడూరి నారాయణరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గూడూరు నారాయణరెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మాట్లాడుతూ... 5 సంవత్సరాలుగా పర్వతారోహణ చేస్తున్నానని, ఇప్పటివరకు కిలిమంజారోతో పాటు మరో నాలుగు పర్వతాలు అధిరోహించానని తెలిపింది. నవంబర్‌లో యూకే నుంచి వచ్చిన 20 మంది ఉన్న టీంలో ఐదుగురు చనిపోయారని అయినా పట్టుదల వీడక తాను, తన గైడ్ చతుర్ ముందుకు వెళ్లామన్నారు. తనతో పాటు వచ్చిన చాలామంది వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానన్నారు. (చదవండి: జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన)