నిరాశ అనేది పరాజయాలకు ‘సుస్వాగతం’ బోర్డ్‌లాంటిది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది అన్వీష్ వర్మ కల. అయితే వివిధ కారణాల వల్ల రెండు సార్లు తన కలను నెరవేర్చుకోవడంలో విఫలం అయ్యాడు. అయినా సరే...పట్టువదలని అన్వీష్ వర్మ మూడో ప్రయత్నంలో తన కల నెరవేర్చుకున్నాడు. ఆ తరువాత ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు....
తాజాగా ప్రపంచంలో కొందరికి మాత్రమే సాధ్యం అయ్యే ప్రపంచంలో ఎత్తైన పర్వతాల అథిరోహణలో సత్తా చాటుతున్నాడు మధురవాడకు చెందిన అన్వీష్‌వర్మ(Anmish Varma). ట్రెక్కింగ్ తన జీవితాశయంగా గత పదేళ్ల నుంచి దేశ, విదేశాల్లో ప్రయాణం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచే పర్వతారోహణ, సాహస క్రీడలు అంటే అన్వీష్‌కు ఇష్టం. స్నేహితులతో కలిసి సింహాచలం కొండ ఎక్కేవాడు. ఆ సమయంలోనే భూమి మీద ఎత్తైన శిఖరాలను ఎక్కాలనే లక్ష్యానికి బీజం పడింది.
మార్షల్ ఆర్ట్స్ టు మౌంట్ ఎవరెస్ట్
మార్షల్ ఆర్టిస్ట్ అయిన అన్వీష్ వరల్డ్ బాక్సింగ్, కరాటే అసోసియేషన్ గ్రీస్, ఆస్ట్రేలియాలో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచాడు. మార్షల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే పర్వతారోహణపై దృష్టి సారించాడు. ఎవరెస్ట్ ఎంత ఎత్తు, ఎలా ఎక్కాలి, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది ఎంతో కష్టం, ఖర్చుతో కూడుకున్నదనే విషయం అర్థమైంది.
ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకునే వారి కోసం వెలువడిన నోటిఫికేషన్ పర్వతారోహణ వైపు తొలి అడుగు వేసేలా చేసింది. విజయవాడ బీఆర్ ఆకాడమీలో సెలక్షన్స్ జరగగా నలభై మంది ఎంపికయ్యారు. అందులో అన్వీష్ ఒకరు. డార్జిలింగ్‌లో ఉన్న హిమాలయ మౌంటెనరీ ఇనిస్టిట్యూట్‌లో బేసిక్ మౌంటెనరీ ట్రైనింగ్ తీసుకున్నాడు.
మూడో ప్రయత్నంలో కల నిజమైంది!
2018లో అయిదు మంది ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో రాంబాబు అనే వ్యక్తికి తలలో బ్లడ్ క్లాట్ అవడంతో కుప్ప కూలిపోయాడు. అతడిని రక్షించడం కోసం వెనక్కి వచ్చేశారు. 2021లో రెండోసారి 8,500 మీటర్లు డెత్ జోన్‌కి చేరుకునేసరికి తనకి సహాయంగా వచ్చిన షెర్ప్ అనారోగ్యానికి గురికావడంతో రెండో సారి కూడా వెనక్కి రావాల్సి వచ్చింది.
రెండు సార్లు విఫలం కావడంతో నిరాశకు గురవుతారు. అయితే వివిధ కారణాల వల్ల ఎవరెస్ట్‌ను అధిరోహించకపోయినా నిరాశను దరి చేరనివ్వకుండా మూడో ప్రయత్నంలో తన కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో తన మీద తనకు నమ్మకం రెట్టింపు అయ్యింది. అలా తన జైత్రయాత్ర మొదలైంది.
నాకు ఏమీ తెలియదు...నేనేం చేయగలను అనుకుంటే ఉన్నచోటే ఉండిపోతాం. తెలుసుకోవాలనే తపన ఉంటే ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు. ఎవరెస్ట్‌కు ముందు పర్వతారోహణ గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నా కలను నిజం చేసుకున్నాను.
– అన్వీష్ వర్మ
ఆఫ్రికాలోని కిలిమంజారో నుంచి యూరప్‌లోని మౌంట్ ఎల్‌బ్రస్ వరకు మొదటి ప్రయత్నంలోనే ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాల అధిరోహణను మూడేళ్లలోనే ఆ పని పూర్తి చేశాడు. తాజాగా ప్రపంచంలో ఎత్తైన అగ్నిపర్వతం మౌంట్ ఓజోస్ డెల్స్ సలెడో(చిలీ) అధిరోహించాడు. అన్వీష్ వర్మ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.
– రామునాయుడు,
సాక్షి, మధురవాడ, విశాఖపట్నం
(చదవండి: సక్సెస్‌ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment