విశ్లేషణ
హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన కొండలని అందరికీ తెలుసు. అందులోని ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనదని అందరూ అనుకుంటారు. అది నిజమా, కాదా అన్న చర్చ ఇప్పుడు మనకు అప్రస్తుతం. ఇంతకు హిమాలయాలు అంత ఎత్తుకు ఏ రకంగా ఎదిగాయి అన్న ప్రశ్నకు కూడా చాలా రోజులుగా ఒక జవాబు ఉంది. అదీ నిజమా, కాదా అన్న సంగతి మామూలు మనుషులకే కాదు పరిశోధకులకు కూడా తెలియదు. అయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంగతి ఏమిటంటే ఇప్పటివరకు హిమాలయాలు అంత ఎత్తుకు చేరడానికి గల కారణం గురించి తెలిసిన సంగతులు అంతగా నిజం కాదని!
భూమి ఉపరితలం టెక్టానిక్ ప్లేట్స్ అనే విడిభాగాల రూపంలో ఉంది. ఆ భాగాలు కదులుతూ ఉంటాయి. అలా కదిలే ఒక భాగం వచ్చి తగిలినందుకు హిమాలయాలు అంత ఎత్తుకు ఎగిశాయని అందరూ అనుకుంటున్నారు. హిమాలయాలలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ప్రస్తుతం 8,849 మీటర్ల ఎత్తు ఉన్నది.
కొత్తగా జరిగిన పరిశోధనల ప్రకారం, హిమాలయాలు కానీ, అందులోని ఎవరెస్టు కానీ అంత ఎత్తుకు చేరడానికి టెక్టానిక్ ప్లేట్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం కారణం కానే కాదనీ, అంతకుముందే అవి దాదాపు అంత ఎత్తుగా ఉన్నాయనీ తెలిసింది.
ప్లేట్‌లు గుద్దుకున్నందుకు హిమాలయాల ఎత్తు పెరగడం నిజమే, కానీ అప్పటికే అవి ఎంతో ఎత్తుగా ఉన్నాయి, అందుకు కారణం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదంటున్నారు పరిశోధకులు. ఒక ఖండం ముక్క వచ్చి ఇంకొక ఖండం ముక్కకు తగిలితేనే ఇటువంటి మార్పులు కలుగుతాయని చాలాకాలం వరకు పరిశోధకులు అనుకున్నారు. అప్పుడు మాత్రమే రెండు ముక్కలు తగిలిన ప్రాంతం మరీ ఎత్తుకు చేరుకుంటుందని కూడా అనుకున్నారు.
యూఎస్‌లోని ‘బ్రౌన్ విశ్వవిద్యాలయం’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డేనియల్ ఇబారా బృందం వారు ఈ మధ్యన ఈ అంశాన్ని గురించి ఒక వైజ్ఞానిక పత్రాన్ని వెలువరించారు. ‘నేచర్ జియోసైన్సెస్’ అనే ప్రఖ్యాత వైజ్ఞానిక పత్రికలో ఆ పత్రం ప్రచురించబడింది. ఈ పత్రం కారణంగా ఆ రంగంలోనే కొత్త మలుపులు వచ్చాయనీ, పరిశోధన మరొక మార్గంలో సాగుతుందనీ ప్రపంచమంతటా నిపుణులు అంటున్నారు.
అమెరికా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందానికి చైనాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్’ వారు కూడా ఈ పరిశోధనలో సహకరించారు. ‘సెడిమెంటరీ శిలల’ నిర్మాణాల ఎత్తు గతంలో ఉండిన తీరు గురించి పరీక్షించడానికి వీరంతా కలిసి ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. అంగారక శిలలను పరిశీలించడంలో వాడుతున్న ఒక పద్ధతిని ఈ పరిశోధకులు ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు. హిమాలయాలలోని శిలల్లో ఉన్న ఐసోటోపుల కొలతలు తీసి వాటి ప్రకారం శిలల కాలం ఎప్పటిది అని వారు నిర్ణయించారు. ఐసోటోపులు అంటే ఒకే రసాయనం తాలూకు వేరువేరు రకాలు.
ఈ పద్ధతి గురించి మరింత చెబితే అది చాలా సాంకేతికంగా ఉండవచ్చు. కొండకు వెచ్చని గాలి తగిలి అది పైకి లేచి కొండకు ఆవలి భాగంలోకి ప్రవేశించి చల్లబడుతుంది. అప్పుడది వర్షం గానూ, మంచు గానూ కిందకు రాలుతుంది. గాలి పైకి వెళ్ళిన కొద్దీ అందులోని రసాయనాల తీరు మారుతుంది. ఎక్కువ న్యూట్రాన్లు గల ఆక్సిజన్ వంటి రసాయనాలు, అంటే ఐసోటోపులు బరువుగా ఉండి, మేఘాల నుంచి ముందే కిందకు జారుతాయి.
ఇక తేలిక ఐసోటోపులు కొండపై కొమ్ము మీద ఆ తరువాత వచ్చి రాలుతాయి. మూడు సంవత్సరాల పాటు ఈ ఐసోటోపులను పరిశీలించిన తరువాత టెక్టానిక్ ప్లేట్ అంచులో ఉన్న హిమాలయ పర్వతాలు అప్పటికే 3,500 మీటర్ల కన్నా ఎత్తు లేదా ఇంచుమించు అంత ఎత్తులో ఉన్నాయని గమనించారు. అంటే ప్రస్తుతం ఉన్న ఎత్తులో ఇది 60 శాతం కన్నా ఎక్కువన్నమాట.
ఈ రకంగా చూస్తే హిమాలయాల చుట్టుపక్కల గల పాతకాలపు వాతావరణ వివరాలు మరొకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ టిబెట్‌లోని ప్రాచీన కాలపు శీతోష్ణస్థితి గురించి కొత్త సిద్ధాంతాలు ఈ రకంగా అందుబాటులోకి రానున్నాయి.
ఇదే పద్ధతిలో ఆండీస్, సియెరా నెవాడా పర్వతశ్రేణులనూ, అక్కడి ప్రాచీన వాతావరణ పరిస్థితులనూ మరొకసారి విశ్లేషించే అవకాశం కూడా ఉంది. గతంలోని శీతోష్ణస్థితులను గురించి ఉన్న సిద్ధాంతాల తీరు మారనుందనీ, ఆయా ప్రాంతాలలోని గత కాలపు శీతోష్ణస్థితులను గురించిన సిద్ధాంతాలూ, ఆలోచనలూ కొత్తదారి పట్టే పద్ధతి కనబడుతున్నదనీ, అక్కడి జీవవైవిధ్యం గురించి కూడా అవగాహనలు మారుతాయనీ అంటారు ఇబారా.
కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు తక్షణం ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ప్రపంచం, దాని గురించి అవగాహన కలిగించే సైన్సు క్రమంగా మారుతున్నాయని అర్థం కావడం మాత్రం అసలైన నిజం!
కె.బి. గోపాలం
వ్యాసకర్త సైన్స్ రచయిత
Comments
Please login to add a commentAdd a comment