ప్రపంచ అన్వేషకులు
వివరం: ప్రవరుడిలాగా వారు ఆకాశంలో ఎగరలేదు. వారి పాదాలకు లేపనం పూసిన సిద్ధులు లేరు. పూర్తి భౌతిక శ్రమే! గుర్రాల మీదా, ఓడల మీదా, కాలినడకనా ప్రపంచాన్ని అన్వేషించారు. ‘ప్రపంచం’ అనేది ఈ రూపులో ఉన్నట్టు తెలియని రోజుల్లో జగతి మూలల్ని, మూలాల్ని అందుకునే సాహసం చేశారు. భారతాన్వేషణలో భాగంగా ఇటలీ యాత్రికుడు క్రిస్టఫర్ కొలంబస్ తను ‘ఇండియా’గా పొరపడిన నేల మీద పాదం మోపింది సరిగ్గా అక్టోబర్ 12(1492)నే! ఈ సందర్భంగా కొందరు అన్వేషకుల గురించిన ‘వివరం’.
బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ రాసిన ‘చంద్రగిరి శిఖరం’లో కథానాయకుడు శంకర్ రాయ్, పోర్చుగీసు యాత్రికుడు డిగో అల్వరేజ్తో కలిసి ఆఫ్రికా అడవుల్లో వజ్రాల వేటకు బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో వారు దట్టమైన అడవుల్నీ, పక్షుల్నీ, మృగాల్నీ, సెలయేళ్లనీ, వరదల్నీ, గుహల్నీ, బద్ధలవుతున్న అగ్నిపర్వతాల్నీ చూస్తారు. ఒళ్లు గగుర్పొడిచే ఆ యాత్ర గురించి రచయిత ఈ అర్థంలో ఒక మాటంటారు: ఇలాంటి వీరులు తమ ప్రాణాలకు తెగించి కేవలం సంపద కోసమే అంతటి సాహసాలకు ఒడిగడతారనుకోలేం; సంపదకు మించిన కారణమేదో వారిని పురిగొల్పుతుంది. కొందరు మినహాయింపుగా ప్రపంచాన్వేషకులు కూడా ఏదోరకంగా మరింత సంపదను కూడబెట్టే లక్ష్యంతోనే ప్రయాణాలకు సిద్ధపడినట్టు అర్థమవుతుంది. కానీ, ఉరిమే ఉత్సాహం, నర్తించే సంతోషం లాంటివేవో కూడా వారికి ప్రేరేపకాలు అయివుంటాయి.
మూలగ్రంథాల్లో ఏముంది?
ఈ వరుసలో మనం చెప్పుకునే మొదటి పేరు హ్యూయన్ త్సాంగ్ (క్రీ.శ. 602-664). మతగ్రంథాల మీద ఆయనకు బాల్యంనుంచే ఆసక్తి. సంస్కృతం నేర్చుకున్నాడు. యౌవనంలోకి రాకముందే హంగ్చోలోని బౌద్ధాలయంలో పూజారిగా కుదురుకున్నాడు. చైనాలో చలామణీలో ఉన్న బౌద్ధ గ్రంథాల్లో ‘స్థానిక పైత్యం’ చేరిందేమోనన్న అనుమానంతో, మూలగ్రంథాలకోసం వేల కిలోమీటర్ల దూరంలోని భారత్ వెళ్లాలన్న ఆలోచన కలిగింది. 627-43 మధ్యకాలంలో ఆయన పర్యటన సాగింది. గుర్రం మీద ఇప్పటి సిల్క్‌రూట్ గుండా ప్రయాణించాడు. ఎడారుల్ని, పర్వత శ్రేణుల్ని దాటడానికి ఇబ్బందిపడ్డాడు. టక్లమాకెన్ ఎడారి అంచున చైనా సైన్యానికి చిక్కాడు. ఏ విధమైన అధికారిక పత్రం లేనందున వాళ్లు నిర్బంధించి, తున్ హువాంగ్ బౌద్ధారామానికి పంపాలనుకున్నారు.
‘మీరు గనక నన్ను నిర్బంధిస్తే, నా ప్రాణం తీసుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తాను. కానీ చైనా దిశగా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను’ అని బదులిచ్చానని రాశాడు త్సాంగ్. గోబి ఎడారి, తియన్ షాన్ పర్వతాలు, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, సమర్కండ్ మీదుగా కైబర్ కనుమలు దాటుకొని భారత్‌లోకి ప్రవేశించాడు. వారణాసి, జలంధర్, పాటలీపుత్రం, నలందలాంటి ప్రశస్తమైన నగరాలన్నీ తిరిగాడు. మన అమరావతి, నాగార్జునకొండకు కూడా వచ్చాడు. అమరావతిలో అభిదమ్మపిటకం అధ్యయనం చేశాడు. హ్యూయన్ త్సాంగ్ రాతల వల్లనే ఈ దారిలోని దేశాల సంస్కృతుల గురించిన సాధికారమైన అవగాహన కలగడానికి వీలు కలిగింది.
కోటి నిజాలు
ఇటలీలో జన్మించిన మార్కోపోలో(క్రీ.శ.1254-1324) నాన్న నికోలో, మామ మాథ్యూ ఇద్దరూ సముద్ర వర్తకులే. మధ్య ప్రాచ్యంతో వాళ్లకు సంబంధాలుండేవి. నాన్నను తన పదిహేనో యేట మొదటిసారి చూశాడు మార్కో. అలాంటి దిమ్మరుల కుటుంబంలో పుట్టిన మార్కో కూడా 1271లో తొలుత చైనాకు ప్రయాణం కట్టాడు. అర్మేనియా, పర్షియా, అఫ్గానిస్తాన్, పామీర్ పర్వతాలు, గోబి ఎడారి మీదుగా బీజింగ్ చేరుకున్నాడు మూడేళ్ల తర్వాత. చెంగీజ్ఖాన్ మనవడు, అప్పటి రాజు కుబ్లైఖాన్ ఆస్థానంలో పదిహేడేళ్లు ఉద్యోగం చేశాడు. మంగోల్ భాష నేర్చుకున్నాడు. తర్వాత, 1292లో ఓడల మీద, 300 మంది సిబ్బందితో కోరమాండల తీరంలో భారత్‌లో అడుగుపెట్టాడు. తంజావూరు పాండ్యరాజులను కలిశాడు. హిందుస్తాన్‌లో ఏడాది గడిపాడు.
ఇటలీ తిరిగి వెళ్లాక, తన యాత్రానుభవాలను మరో రచయిత సాయంతో గ్రంథస్తం చేశాడు. తను చూసినవాటిల్లో సగమే రాశానని పేర్కొన్నాడు. చమత్కారంగా ‘పదిలక్షల అబద్ధాలు’గా ఆ పుస్తకం ప్రాచుర్యం పొందింది. కొత్తగా దేశాల పటాలు గీయడం ప్రారంభమవుతున్న ఆ కాలానికి మార్కో పోలో ప్రేరణగా నిలిచాడు. మనదేశం గురించి ఆయన, ఇక్కడి వాతావరణం వేడిగా ఉందనీ, వస్త్రాలు అతి తక్కువ ధరిస్తారనీ రాశాడు. ప్రజలు ఏ దొంగల భయమూ లేకుండా అర్ధరాత్రులు కూడా సంచరిస్తారనీ, ప్రపంచలోనే ఇది వైభవోపేతమైన నేలనీ పేర్కొన్నాడు. ఇంకా, ఏదైనా తాగేప్పుడు పెదాలతో ఎంగిలి చేయకుండా పాత్రను ఎత్తి తాగుతారు. శకునాలు చూస్తారు. ఇళ్లను ఆవుపేడతో అలుకుతారు. పసిపిల్లలకు నువ్వులనూనెతో మర్దనం చేస్తారు.
కుడిచేత్తో భోంచేస్తారు, ఎడమచేతిని ఇంకోరకంగా వాడతారు. సముద్రయాత్రకు వెళ్లినవాడు నిస్పృహలో ఉండివుంటాడని నమ్ముతారు. గుర్రాల పెంపకం లేదు. ఐడెన్ (యెమెన్ రేవు పట్నం), ఇంకా దూరప్రాంతాలనుంచి ఓడల్లో వస్తాయి. గుర్రాల్ని మాలిమి చేసే సామర్థ్యం లేకపోవడం వల్ల ఏడాదిలోగా వంద తప్ప మిగతావన్నీ చనిపోతాయి. విదేశీ వ్యాపారులు అశ్వాలతోపాటు ఏ వైద్యుణ్నీ పంపరు, వాళ్లకు కావాల్సింది ఇలా చనిపోవడమే! ఇక్కణ్నుంచి పత్తి, తోలు ఉత్పత్తులు ఓడలకొలదీ ఎగుమతి అవుతాయి. పక్షులు, లతలు తీర్చి, బంగారు, వెండి పోగుల్ని అల్లే ఎరుపు తివాచీల్లో అద్భుతమైన పనితనం ఉంటుంది. ఈ సరుకంతా ఐడెన్లో దిగి, అక్కణ్నుంచి చిన్న పడవల్లోనూ, ఒంటెల మీదా అలెగ్జాండ్రియా(ఈజిప్ట్) దాటిపోతుంది. మన సంగతులు ఏడువందల ఏళ్ల కిందటి ఒక విదేశీ యాత్రికుడి నోట వినడం ముచ్చటగా లేదూ!
ఛలో ఇండియా- హలో అమెరికా
లేతప్రాయం నుంచే క్రిస్టఫర్ కొలంబస్ (క్రీ.శ.1451-1506) సముద్రం మీద బతికాడు. తొలినుంచీ సాహసి. ‘ఎవరైనా ఎక్కడైనా సముద్రయానం చేసివుంటే, నేను కూడా అక్కడ చేసివున్నాను,’ అని గొప్పగా చెప్పుకున్నాడు. మార్కోపోలోలాగా కొలంబస్ కూడా ఇటలీవాడే! పోలోనే ప్రేరణ కూడా! పాతికేళ్ల వయసులో అట్లాంటిక్ మీద చేసిన ప్రయాణంలో ఫ్రెంచ్ సముద్రదొంగల బారినపడి, తన ఓడను నష్టపరుచుకున్నాడు. పోర్చుగీసు తీరానికి ఈదుతూ వెళ్లి, ప్రాణాలు దక్కించుకున్నాడు. అక్కడే స్థిరపడి ఫెలిపాను వివాహం చేసుకున్నాడు. ఒక కొడుకును కన్నాడు. కానీ అసలైన గమ్యం చేరాల్సేవుంది! అది తక్కువ దూరంలో భారత్‌కు సముద్రమార్గాన్ని కనిపెట్టడం! పశ్చిమ దిశగా ప్రయాణిస్తే, భారతానికి వేగంగా చేరగలనని విశ్వసించాడు. స్పెయిన్ రాజదంపతుల అండదండలతో 1492లో అక్కడినుంచే ప్రయాణం ప్రారంభించాడు. వెంట, మూడు ఓడలు పింటా, నైనా, శాంతా మరియా; వాటికి తగిన సిబ్బంది; మార్కోపోలో పుస్తకం!
క్యానరీ ఐలండ్స్ నుంచి జపాన్‌కు 2300 మైళ్ల దూరమని వేసుకున్న అంచనా ప్రకారం, 33 రోజుల ప్రయాణం తర్వాత, బహమాస్ దీవుల్లో అడుగుపెట్టాడు. ఇప్పటి లెక్కల ప్రకారం ఆరింతలు తక్కువగా లెక్క గట్టడంతో కొలంబస్ తను చూసిందే ఇండియా అని భ్రమించాడు. తర్వాత, క్యూబా, హైతీ, డొమినికన్ రిపబ్లిక్ చుట్టాడు. పోయేప్పుడు కొందరిని బానిసలుగా పట్టుకెళ్లాడు. ఆసియాకు దగ్గరి దారి కనుక్కున్నానన్న సంతృప్తితోనే కన్నుమూశాడు. కొలంబస్ యాత్ర వల్ల యూరప్ ఖండానికి అమెరికా ద్వారాలు తెరుచుకున్నాయి. ‘కాలనీలు’ వెలిశాయి. ఐరోపా గుర్రాలు, గోధుమ అమెరికాకు వెళ్లాయి. అమెరికా ఆలుగడ్డలు, టొమాటోలు, మొక్కజొన్నలు ఐరోపీయులకు తెలిశాయి. ఐరోపా నుంచి వెళ్లిన చికెన్ ఫాక్స్ అమెరికాలోని కొన్ని తెగల్ని తుడిచిపెట్టినంత పనిచేసింది. ఈ అన్నిరకాల మార్పిడికే ‘కొలంబియన్ ఎక్స్ఛేంజ్’ అనే పదబంధం పుట్టింది!
కాస్కో నా వాస్కో!
భారత్ నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలకు ఐరోపాలో విపరీతమైన ఆదరణ ఉంది. అవి రావడానికి భూమార్గం తప్ప దారిలేదు. ఇది ఖరీదైనదీ, దీర్ఘమైనదీ కూడా. ఈ సమయంలో పోర్చుగల్ రాజు సముద్రయానం గురించి యోచించాడు. దానికి నావికుడు వాస్కోడ గామా(సి.1460-1524) నేతృత్వం వహించాడు. ఆఫ్రికా అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ తీరాన్ని అప్పటికే బార్తొలేము డయాస్ కనుక్కొనివున్నాడు.
కానీ తర్వాతేమిటో తెలియదు. ఎందుకంటే, అట్లాంటిక్ మహాసముద్రంతో హిందూ మహాసముద్రానికి లింకు ఉందా? అదిగానీ ఛేదిస్తే భారతదేశానికి దగ్గరి దారి దొరికినట్టే! ఈ అనుమానాలతోనే వాస్కో ప్రయాణం 1497లో లిస్బన్ నుంచి మొదలైంది. సావో గాబ్రియేల్, సావో రఫెల్, బెరియోలతోపాటు సామాన్ల నిల్వకోసం మరో పేరులేని ఓడ! 170 మంది బలగం! వాళ్లు గుడ్ హోప్ చుట్టూ తిరుక్కోని, మొజాంబిక్, మొంబాసా(కెన్యా), మాలింది(కెన్యా) రేవుల్లో ఆగుతూ, వర్తక అవకాశాల్ని పరిశీలించుకుంటూ, అక్కణ్నుంచి కేరళలోని కోజికోడ్ చేరారు.
అయితే, వాళ్ల దగ్గర తగిన మొత్తం లేకపోవడంతో భారత వర్తకులు అనుమానంగా చూశారు. దాంతో పెద్దగా ఏమీ కొనుగోలు చేయకుండానే తిరుగుముఖం పట్టారు. దారిమధ్యలో స్కర్వీ సోకి సగం మంది చనిపోయారు. అయినప్పటికీ అసలైన కుంభస్థలాన్నే కొట్టాడు కాబట్టి స్వదేశంలో వాస్కోకు ఘనస్వాగతం లభించింది. మరో యాత్రలో మళ్లీ వాస్కో భారత్ వచ్చాడుగానీ మలేరియా సోకి చనిపోయాడు. తదుపరి పరిణామాల్లో ఆయన రెండో కొడుకు ఎస్తేవో డ గామా 1540లో ‘పోర్చుగీసు ఇండియా’కు గవర్నర్ అయ్యాడు.
భూమి గుండ్రంగానే ఉంది!
‘భూమి బల్లపరుపుగా ఉంటుందని చర్చి అంటోంది, కానీ నాకు తెలుసు అది గుండ్రంగా ఉందని. ఎందుకంటే భూమి నీడను నేను చంద్రుడి మీద చూశాను. నాకు చర్చి మీద కంటే నీడ మీద ఎక్కువ విశ్వాసం ఉంది,’ అన్నాడు ఫెర్డినాండ్ ముజెల్లన్ (1480-1521). ఈయనదీ పోర్చుగలే! మ్యాపులన్నా, ఓడ ప్రయాణాలన్నా ఆసక్తి. భూమి గుండ్రంగా ఉందని నిరూపించడానికి సముద్రయానం చేపట్టాడు. పనిలోపనిగా ‘సుగంధ ద్రవ్యాల దీవి’ బోర్నియో మీద స్పెయిన్‌కు పెత్తనం కట్టబెట్టే బాధ్యతా తీసుకున్నాడు. 5 ఓడలు(ట్రినిడాడ్, శాన్ ఆంటోనియో, కాన్సెప్షియన్, విక్టోరియా, శాంటియాగో), 270 మంది బలగంతో 1519లో స్పెయిన్‌లోని సువిల్నుంచి ముజెల్లన్ యాత్ర ప్రారంభమైంది. బ్రెజిల్ చేరుకుని, దక్షిణ అమెరికా తీరం గుండా పటగోనియా వచ్చారు.
అక్కణ్నించి ఒడిదుడుకుల మధ్య గువామ్ చేరారు. ఫిలిప్పీన్స్‌లో స్థానిక పాలకుడితో జరిగిన పోరులో ముజెల్లన్ మరణించాడు. దాంతో సెబాస్టియన్ ఎల్కానో యాత్రకు బాధ్యత తీసుకున్నాడు. వాళ్లు బోర్నియో నుండి హిందూ మహాసముద్రం మీదుగా ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ చుట్టుకొని స్పెయిన్ వచ్చేశారు, మూడేళ్ల తర్వాత, 1522లో. ఈ ప్రయాణంలో విక్టోరియా తప్ప వారి ఓడలన్నీ ధ్వంసమైనాయి. ఎల్కానో కాక మరో 18 మందే బతికారు. అయినప్పటికీ వాళ్లున్న చోటికే తిరిగివచ్చారు కాబట్టి, భూమి గుండ్రంగా ఉందని రుజువైంది. దీన్నే ముజెల్లన్-ఎల్కానో భూప్రదక్షిణగా పేర్కొంటారు. మానవచరిత్రలో ఇలాంటి తొలియాత్ర ఇదే!
మహా సముద్రాల్ని కలిపాడు
రొవాల్ ఆమున్సెన్ (1872-1928) నార్వే ఓడల యజమానుల ఇంట్లో జన్మించాడు. వాళ్లమ్మకు వైద్యుణ్నవుతానని మాటిచ్చినా, ఆమె మరణానంతరం కుటుంబ వ్యాపారంలో స్థిరపడ్డాడు. లేదు, స్థిరపడగలడా? ఒక తహతహ.
‘ద నార్త్‌వెస్ట్ ప్యాసేజ్’ కనుక్కోవాలని! ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి మొదలై, ఉత్తర అమెరికా ఉత్తర తీరం మీదుగా, కెనడా ఆర్కిపెలాగో గుండా ప్రయాణించి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రంతో కలిపే దారి ఇది! ఎంతోమంది దీన్ని అన్వేషించాలని ప్రయత్నించి విఫలమై ఉన్నారు. అలాంటి సమయంలో 1903లో ఆమున్సెన్ ఆరుగురు సిబ్బందితో ‘జో’ మీద బయలుదేరాడు. మధ్యలో నాత్లిక్ ప్రజల నుంచి స్లెడ్ బళ్లను నడపడం, జంతుచర్మాలను తొడుక్కోవడం లాంటి అత్యవసర లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. 1905 చివరికల్లా విజయసంకేతం పంపాడు. అదే ఊపులో దక్షిణ ధృవం మీద పాదం మోపిన మొదటి వ్యక్తి, ఉత్తర ధృవం మీద ‘ఎగిరిన’ మొదటివ్యక్తి అయ్యాడు.
ముగింపు
వీరి యాత్రా కథనాల్లో మనుషుల్ని బానిసలుగా చేసుకోవడం ఉంటుంది, యుద్ధాలుంటాయి. వారు అప్పటి ప్రపంచ సూత్రాల ప్రకారమే నడుచుకున్నారని భావించడం తప్ప మరో దారిలేదు. పరస్పర గౌరవాన్ని మనిషి నెమ్మదిగా నేర్చుకుంటూ వస్తున్నాడు. తమ స్వీయలాభాల కోసమే ఈ యాత్రలు జరిగివుండొచ్చు. అన్వేషకులు రాకముందు కూడా ఒక దేశం తన మానాన అది బతుకుతూనే ఉంటుంది. అయినా ప్రపంచం ఇప్పుడున్న రీతిలో అనుసంధానం కావడానికి ఇవన్నీ తోడ్పడ్డాయి.
బ్రిటనీయుడు చార్లెస్ డార్విన్ (1809-1882) కూడా ‘హెచ్ఎంఎస్’ బీగిల్ (హిస్ మెజెస్టీస్ షిప్; బ్రిటన్ రాజు ఓడకు కూడా బ్రిటన్ రాజుకిచ్చినంత గౌరవమే ఇవ్వాలి కదా!) అనే ఓడలో దక్షిణ అమెరికా తీరం వెంబడి ప్రయాణించాడు. ఆ యాత్రలో సేకరించిన వేలాది నమూనాల ఆధారంగానే జీవపరిణామం, జాతుల ఆవిర్భావం గురించిన తన సిద్ధాంతాల్ని వెల్లడించాడు.
హ్యూయన్ త్సాంగ్కంటే 300 ఏళ్ల క్రితమే పాహియాన్ కాలినడకన భారత్ వచ్చాడు. కృష్ణ దేవరాయల కాలంలో న్యూనిజ్(పోర్చుగల్) పర్యటించాడు. ఇస్లాం దేశాల్ని ఇబిన్ బటూటా(మొరాకో) చుట్టివచ్చాడు. కొలంబస్కంటే 500 ఏళ్ల క్రితమే ఉత్తర అమెరికా మీద (ఐస్లాండ్) లీఫ్ ఎరిక్సన్ అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఐరోపాకు కెప్టెన్ జేమ్స్ కుక్(ఇంగ్లండ్) పరిచేయం చేశాడు. మొదటిసారి అంతరిక్షంలోకి ప్రయాణించిన యూరీ గగారిన్(రష్యా), చంద్రుణ్ని తాకిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్(అమెరికా), ఎవరెస్టు అధిరోహించిన ఎడ్మండ్ హిల్లరీ(న్యూజిలాండ్), భారత మ్యాపుల్ని గీయడానికి ఆంగ్లేయులకోసం దేశాన్ని చుట్టిన కిషన్ సింగ్, నైన్ సింగ్ సోదరులు... ఇలా చరిత్ర పొడవునా ఎందరో అన్వేషకులు! రేపెప్పుడో కుజగ్రహం మీద పాదంమోపే తొలి మనిషి ఆవిర్భవిస్తాడు. ఒక మనిషి విజయం ఆ ఒక్కడిదే కాదు. అతడి వెనుక ఇంకెందరిదో కృషి కూడా దాగివుంటుంది. అయితే, ఆ ప్రత్యేక విజయానికి సంకేతంగా నిలుస్తారు కాబట్టి వారినే మనం తలుచుకుంటాం!
- రాజ్