పోలీసు కొలువులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్ష
పోలీసు కొలువులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్ష
Published Tue, Dec 20 2016 9:17 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– చివరి రోజు 2,090 మంది హాజరు
– రాత పరీక్ష జనవరి 22
కర్నూలు : పోలీసు శాఖలో సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. నవంబర్ మాసంలో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 11,762 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిని రోజుకు వెయ్యి మంది చొప్పున ఆహ్వానించి స్థానిక ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో ఈనెల 8వ తేదీ నుంచి రెండు వారాల పాటు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగాయి.
భర్తీ కానున్న 221 పోస్టులు
జిల్లా పోలీసు శాఖలో మరో 221 సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కానున్నాయి. కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈనెల 4వ తేదీతో దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. 494 మహిళా, పురుష కానిస్టేబుళ్ల పోస్టులను రాత పరీక్ష అనంతరం భర్తీ చేయనున్నారు.
మూడు అంశాల్లో శారీరక పరీక్షలు
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మూడు అంశాల్లో శారీరక పరీక్షలు నిర్వహించారు. లాంగ్‌జంప్, 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు అంశాల్లో శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ మూడు అంశాల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ప్రధాన పరీక్ష(మెయిన్)కు ఎంపిక చేశారు. గతంలో పురుష అభ్యర్థులకు 5 కిలోమీటర్ల పరుగు, మహిళలకు 3 కిలోమీటర్ల పరుగు ఉండేది. దాన్ని ప్రభుత్వం రద్దు చేసి ప్రాథమిక పరీక్ష, మెయిన్ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చింది. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టులు కేటాయిస్తారు.
పొద్దుపోయేదాకా సాగిన స్క్రీనింగ్ టెస్టు...
ఛాతీ, ఎత్తు కొలతలతో పాటు పరుగు పందెం పోటీలను అధికారుల ప్రమేయం లేకుండానే సాంకేతిక పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 17వ తేదీన వర్షం కారణంగా పరుగు పోటీలకు అంతరాయం ఏర్పడింది. వారితో పాటు గైర్హాజరైన వారందరికీ చివరిరోజు మంగళవారం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,090 మంది పురుష, మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి పరుగు పోటీలు నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారికి జనవరి 22న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ విజయవాడలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశానికి హాజరైనందున ముగింపు రోజు డీఐజీ రమణకుమార్ దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. రెండు వారాల పాటు దేహదారుఢ్య పరీక్షల వద్ద సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఓఎస్‌డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్‌తో పాటు డీపీఓ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement