ఎస్‌ఐ కొలువు కోసం ‘ఎత్తు’
Published Wed, Jan 11 2017 12:31 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
– పోలీసులకు చిక్కిన అనంతపురం జిల్లా యువకుడు
కర్నూలు : ఎస్‌ఐ కొలువు కోసం అడ్డదారి తొక్కిన అనంతపురం జిల్లా యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. ఈనెల 3 నుంచి స్థానిక ఏపీఎస్‌పీ మైదానంలో ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్ నియామకాల కోసం దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ‘సీమ’ ప్రాంతానికి చెందిన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల యువకులు ఎస్‌ఐ పరుగు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో జరుగుతున్న స్క్రీనింగ్ టెస్టుకు అనంతపురం జిల్లా గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన హరీష్ హాజరయ్యాడు. ఎత్తు తక్కువగా ఉన్నందున తలపై ఎంసిల్ అతికించుకొని వచ్చాడు. కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రానిక్ మెజర్‌మెంటు సిస్టంపై నిలుచోగా ఎత్తు పరిశీలించే కానిస్టేబుళ్లు అతని తలను తడిమి చూడగా తేడా కనిపించింది. అనుమానం వచ్చి పరిశీలించగా వెంట్రుకలకు ఎంసీల్ అంటించినట్లు గుర్తించారు. డీఐజీ తీవ్రంగా పరిగణించి కేసు నమోదుకు ఆదేశించారు. కొలతలు పరిశీలించే సిబ్బందితో ఫిర్యాదు తీసుకొని 4వ పట్టణ సీఐ నాగరాజు రావు కేసు నమోదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Advertisement