బోల్ట్ కూడా పోలీస్ కాలేడు!
‘కానిస్టేబుల్’ పరుగు పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వ విపరీత పోకడ
నాలుగు నిమిషాల్లో 1,600 మీటర్లు.. 100 మీటర్లను 10.50 సెకన్లలో పూర్తి చేయాలని నిబంధన
పురుషులతో సమానంగా మహిళలకూ పరుగు ‘పరీక్ష’
అంతర్జాతీయ పరుగు పోటీల టైమింగ్‌ను నిర్దేశించడంపై విస్తుపోతున్న క్రీడాపండితులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
విజయవాడ స్పోర్ట్స్: ఏపీ ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్ సెలెక్షన్స్ కు నిర్వహించనున్న పరుగు పరీక్షలో ఏ ఒక్కరైనా నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని చేరుకుంటే ఆ అభ్యర్థి కచ్చితంగా ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అంతటి ఫాస్టెస్ట్ రన్నర్ అయ్యి ఉంటారు. ఎవరైనా ఈ ఫీట్ సాధిస్తే మన దేశం అంతర్జాతీయ పోటీల్లో పతకం చేజార్చుకుందనుకోవాలి. ఏపీ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులకు నిర్దేశించిన ఫిజికల్ టెస్ట్(స్పోర్ట్స్)లో ప్రస్తావించిన నిబంధనలు కంగుతినేలా చేస్తున్నాయి.
డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరగనున్న కానిస్టేబుల్ పోస్టుల ఎంపికలో పరుగు పరీక్షకు ఒలింపిక్స్ టైమింగ్ నిర్దేశించడం చూసిన అభ్యర్థులు విస్తుపోతున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందా లేదా అవగాహన లేక నోటిఫికేషన్ విడుదల చేసిందా? అనే అనుమానాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ల టైమింగ్‌లతో పోటీగా.. ఆర్మ్‌రిజర్వు, ఏపీఎస్‌పీ విభాగంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ పోస్టులకు సెప్టెంబరు 17న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పోర్ట్స్ ఈవెంట్ల టైమింగ్‌లను రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించింది. అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలో భాగంగా లాంగ్ జంప్‌తో పాటు 100 మీటర్లు, 1,600 మీటర్ల రన్నింగ్‌లో క్వాలిఫై కావాలి.
ఇందులో నిర్దేశించిన టైమింగ్ లేదా అంతకంటే అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఫుల్ స్కోర్(30 మార్కులు) ఇస్తారు. లేదంటే మార్కులు తగ్గుతూ పోతాయి. 100 మీటర్ల రన్నింగ్‌లో ఫుల్ స్కోర్ సాధించాలంటే ఆ దూరాన్ని పురుషులైతే 10.50 సెకన్లు లేదా ఆ లోపు, మహిళలైతే 13 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. అప్పుడే 30 మార్కులు ఇస్తారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు దేశ అథ్లెట్ల ఎంపిక కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో ఢిల్లీకి చెందిన ఎండీ అబ్దుల్ నజీబ్ 10.574 సెకన్లలో 100 మీటర్లు పూర్తి చేశాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా మెరుగైన(10.50 సెకన్ల) టైమింగ్‌ని నిర్దేశించడంపై అభ్యర్థులే కాదు.. క్రీడా పండితులు కూడా విస్తుపోతున్నారు.
1,600 మీటర్లు పూర్తి చేస్తే.. ఒలింపిక్స్ స్వర్ణమే
అలాగే గతంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ సెలెక్షన్స్ లో పురుషులకు 5 కిలోమీటర్లు, మహిళలకు 2.5 కిలోమీటర్ల రన్ నిర్వహించేవారు. ఈ ఏడాది అలా కాకుండా పురుషులకు, మహిళలకు ఒకే రన్నింగ్ ఈవెంట్‌గా 5కేఎం బదులు 1,600 మీటర్ల పరుగు పరీక్ష ఏర్పాటు చేశారు. దీంట్లోనైతే ఏకంగా రియో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్‌ను తలదన్నేలా లక్ష్యాన్ని 4 నిమిషాలు, అంతకన్నా తక్కువ సమయంలో పూర్తి చేయాలని నిర్దేశించారు. అప్పుడే ఫుల్ స్కోర్(40 మార్కులు) ఇస్తారు. గతంలో పురుషులకు 5కేఎం రన్, మహిళలకు 2.5కేఎం నిర్దేశించినట్లుగానే.. ఇప్పుడు కూడా పురుషులకు 1,600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహించాలి. ఇలా అయితేనే మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించినట్లు అయ్యేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదు.
అయితే ఈ ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో 1,500 మీటర్ల దూరాన్ని అమెరికాకు చెందిన మ్యాథ్యూ సెంట్రోవిట్జ్ 3.50 నిమిషాల్లో చేరుకొని స్వర్ణపతకం సాధించాడు. దీని ప్రకారం మ్యాథ్యూ 1,600 మీటర్ల దూరాన్నైతే 4.2 నిమిషాల్లో చేరుకుంటాడు. అది కూడా సింథటిక్ ట్రాక్‌పై, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన షూస్‌తో ఆ టైమింగ్‌లో లక్ష్యాన్ని చేరుకుంటారు. మట్టి ట్రాక్‌లో పరిగెడితే ఈ టైమింగ్‌కు ఎంత మంది చేరుకుంటారనేది ప్రభుత్వానికి, అధికారులకే తెలియాలి. సుమారు లక్షన్నర మంది అభ్యర్థులు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వారంతా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.