పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో అవకాశం
Published Sat, Dec 24 2016 10:56 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– పీఎంటీలో అర్హత పొంది అప్పీల్ చేసుకోని వారికి దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు: పీఎంటీలో అర్హత పొంది అప్పీల్ చేసుకోకుండా వెళ్లిపోయిన వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు పటాలంలోని బళ్లారి చౌరస్తాలో ఉన్న ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో అప్పీల్ చేసుకుని, హాజరైన వారికి రెండవ అవకాశం ఉండదు. పీఎంటీలో అర్హత పొంది అప్పీల్ చేసుకోని వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల అభ్యర్థులకు కర్నూలులోనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలపై గజిటెడ్ సంతకం తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్ లేని వారిని అనుమతించరు.
Advertisement