రుణమాఫీ జాబితా సిద్ధం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ :
జిల్లాలో రుణమాఫీకి అర్హులైన రైతుల డేటా ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కేవీ రమణ బ్యాంకు అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం బ్యాంకర్లతో ఆయన సమావేశమయ్యారు. రుణమాఫీ డేటా ఎంట్రీ ఆఫ్‌లైన్‌లో వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు ఎస్‌బీఐకి ఇచ్చిన 1,89,000కు గాను 45 వేలు, ఏపీజీబీకి 1,21,000కు గాను లక్ష, డీసీసీబీకి 78 వేలకుగాను 57 వేలు ఆఫ్‌లైన్ డేటా ఎంట్రీ చేశారని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రాబ్యాంకు 22 వేలకుగాను 16 వేలు,కార్పొరేషన్ బ్యాంకు 7 వేలకు 5 వేలు ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేశారని, మిగతా వివరాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఖాతాలు ప్రారంభించడానికి జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొని ఖాతాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్, రేషన్‌కార్డు, రెండు ఫోటోలు ఇస్తే ఖాతాలను ప్రారంభించాలని ఆదేశించారు. వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. బ్యాంకు ఖాతాలు లేని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, ఎల్‌డీఎం రఘునాథరెడ్డి, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ సుబ్రమణ్యం, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.