ఇలా కనిపెట్టండి.. దాని పని పట్టండి
మీరేం మాట్లాడుతున్నారు? ఏం చేయాలని అనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ మీ స్మార్ట్ ఫోన్ ఇవన్నీ వినేస్తోంది. మనపై మన ఫోన్ ఉంచుతున్న నిఘా గుట్టును తేల్చేయడానికి నిపుణులు 4 సూచనలు చేస్తున్నారు.
మన సంభాషణలను రహస్యంగా వినేస్తున్న స్మార్ట్ ఫోన్లు మనం దేని గురించి మాట్లాడితే.. ఆ అంశంపై యాడ్స్ వెబ్‌సైట్ల నుంచి సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా అవే ప్రకటనల గోల
మీరేం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. ఇంట్లో మీ గదిలో కూర్చుని మీ భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో ఇవన్నీ మాట్లాడుకున్నారు.
వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ ఒకరు మాత్రం రహస్యంగా అన్నీ వినేస్తున్నారు.. వినడమే కాదు, మీ మాటలన్నీ విశ్లేషించి... మీ అవసరానికి సూటయ్యేలా సూచనలు చేస్తున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతోంది. ఇంతకీ అన్నీ వింటున్న ఆ ఒక్కరు ఎవరు?.. మీ స్మార్ట్ ఫోనే! నిఘా పెట్టేదెలాగో, అది మనకు తెలిసేదెలాగో తెలుసుకుందామా..
ఇంటర్నెట్ సెర్చింగ్ నుంచి మైక్రోఫోన్‌తో నిఘా దాకా..
మీరు ఏదైనా ప్రదేశం గురించో, మరేదైనా సమాచారం కోసమో ఇంటర్నెట్‌లో సెర్చింగ్ చేస్తే.. ఆ తర్వాత మీ ఫోన్‌లో, కంప్యూటర్‌లో ఆ ప్రదేశం, సమాచారానికి సంబంధించిన ప్రకటనలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఢిల్లీలో మంచి హోటళ్లు ఏమేం ఉన్నాయని సెర్చ్ చేశామనుకోండి. ఆ తర్వాత కొన్నిరోజుల వరకు మనం ఏ వెబ్‌సైట్లు ఓపెన్ చేసినా.. వాటిలో ఢిల్లీలోని హోటళ్ల సరీ్వసులు, ట్రావెల్ ఏజెన్సీల ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ మన ఫోన్ మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నామనేదీ తెలుసుకుంటోంది. ఫోన్‌లోని మైక్రోఫోన్ ద్వారా నిఘాపెడుతోంది. మరి మన ఫోన్ ఇలా మనపై నిఘా పెట్టిందా లేదా అనేది చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చని ‘నార్డ్ వీపీఎన్’ సంస్థ టెక్ నిపుణులు చెబుతున్నారు.
మనపై ఫోన్ నిఘా గుట్టు తేల్చేద్దాం ఇలా..
1. మీరు ఇప్పటివరకు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయని, సోషల్ మీడియాలో పెట్టని, ఎప్పుడూ మాట్లాడని ఒక కొత్త టాపిక్‌ను ఎంచుకోండి.
2. మీ ఫోన్‌ను మీకు దగ్గరలో పెట్టుకుని ఈ టాపిక్‌పై నాలుగైదు రోజులు తరచూ మాట్లాడండి. ఎవరితోనైనా చర్చించండి. ఉదాహరణకు ఏదైనా దేశం, అక్కడి నగరాలు, టూరిస్టు ప్లేసులు, రెస్టారెంట్లు వంటి అంశాలను మాట్లాడండి.
3. అయితే ఈ టాపిక్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడా సెర్చింగ్, పోస్టింగ్ వంటివి చేయకూడదు. కేవలం ఫోన్‌ను మీకు సమీపంలో పెట్టుకుని సదరు టాపిక్‌పై మాట్లాడాలి. మిగతా విషయాల్లో మీ ఫోన్‌ను మామూలుగానే వాడుతూ ఉండాలి.
4. 4,5 రోజుల తర్వాతి నుంచి మీ ఫోన్‌లో, మీ ఈ–మెయిల్‌తో లింక్ అయి ఉన్న స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, కంప్యూ టర్లలో.. మీరు చూసే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే యాడ్స్‌ను కాస్త గమనిస్తూ ఉండండి.
5, ఒకవేళ మీరు మాట్లాడిన అంశానికి సంబంధించి యాడ్స్ తరచూ కనిపిస్తూ ఉంటే.. ఫోన్ మీపై నిఘా పెట్టి, మీ సంభాషణలలోని టాపిక్స్‌ను యాడ్స్ కోసం వాడుతున్నట్టే.
ఈ నిఘా నుంచి బయటపడేదెలా?
⇒ ఫోన్‌లో సోషల్ మీడియా, ఈ–కామర్స్, బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన యాప్స్ నుంచి.. గేమ్స్, యుటిలిటీస్ యాప్స్ వరకు ఉంటా యి. వాటిని ఇన్‌స్టాల్ చేసినప్పుడు స్టోరేజీ, మైక్రోఫోన్, కెమెరా వంటి పరి్మషన్లు ఇస్తుంటాం. ఇక్కడే సమస్య మొదలవుతుంది.
⇒ పెద్ద కంపెనీల యాప్‌లతో సమస్య ఉండకపోవచ్చుగానీ.. గేమ్స్, యుటిలిటీస్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌లు, యాడ్స్‌పై లింకులను క్లిక్‌చేయడం ద్వారా డౌన్‌లోడ్ అయ్యే యాప్‌లతో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి యాప్‌లకు ఇచ్చే పరి్మషన్లు దుర్వినియోగమై.. మీ ఫోన్‌తోనే మీపై నిఘా మొదలవుతుంది. అందువల్ల ముఖ్యమైన యాప్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
⇒ యాప్స్‌కు అవసరమైన పరి్మషన్లు మాత్రమే ఇవ్వాలి. అప్పుడప్పుడూ ఏయే యాప్స్‌కు ఏ పరి్మషన్లు ఇచ్చినదీ, సెట్టింగ్స్‌లోకి వెళ్లి పరిశీలించాలి. అనవసర యాప్స్‌కు ఇచ్చిన పరి్మషన్లను తొలగించాలి. వీలైతే అవసరం లేని యాప్స్‌ను తొలగించేయడం మంచిది.
⇒ ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్ యాప్ సెట్టింగ్స్‌లో ‘ఆలో వెన్ లాక్‌డ్’ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి. దీనితో ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు మైక్రోఫోన్ వాడకుండా ఉంటుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment