పింఛన్...టెన్షన్
సాక్షి, కడప :
65 ఏళ్లు... ఈ వయసు రాగానే సాధారణంగా మనిషిలో మార్పు ఉంటుంది. ఎన్నో ఏళ్లు శ్రమకోర్చి వృద్ధాప్యంలోకి వచ్చిన వృద్ధులకు అంతో ఇంతో ఆసరాగా నిలవాలని పింఛన్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం టీడీపీకి సానుభూతిపరులు, కార్యకర్తలుగా ఉన్న కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. కొంతమంది వృద్ధులైతే రూ. వెయ్యి సంగతి ఠమొదటిపేజీ తరువాయి
పక్కన పెడితే ఇచ్చే రూ. 200 చాలు దేవుడా అంటూ మొక్కుతున్నారు. గతంలో చంద్రబాబు పరిపాలనలో రూ.75గా ఉన్న పింఛన్‌ను దివంగత సీఎం వైఎస్‌ఆర్ అధికారంలోకి రాగానే రూ. 200కు పెంచడంతోపాటు నెలనెలా ఠంచనుగా ఇచ్చేలా అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులకు పింఛన్లను ఇచ్చేలా పథకాన్ని అమలు చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కూడా మంజూరు చేసి పింఛన్‌ను అందిస్తూ వచ్చారు. ప్రస్తుత టీడీపీ సర్కార్ పింఛన్ పెంచుతామని మేనిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించి తీరా అమలులోకి వచ్చేసరికి అర్హుల పేరుతో కోతకు సిద్ధమైంది. మేనిఫెస్టోలో రూ. 500 పింఛన్ రూ.1000కి, వికలాంగులకు వికలాంగశాతాన్ని బట్టి రూ.1500 చొప్పున పెంచుతున్నట్లు పొందుపరిచారేగానీ.... ఇలా అర్హతలను బట్టి వాతలు పెడతామని మాత్రం పేర్కొనలేదు. పింఛన్ పెంచుతున్న నేపధ్యంలో కొన్నింటినైనా తగ్గించగలిగితే అక్కడి సొమ్మును కూడా ఉన్న వాటికి సర్దవచ్చన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని పలువురు లబ్ధిదారులు వేలెత్తిచూపుతున్నారు.
కమిటీ పేరుతో కోతలు
వైఎస్సార్ జిల్లాలో వృద్ధులు 1,24,319, వితంతువులు 65,078, చేనేతలు 8,813, అభయహస్తం 16,895, వికలాంగులు 30,603, కల్లుగీత కార్మికులు 21 మంది చొప్పునమొత్తం 2,45,729మందికి నెలకు రూ. 6,95,16,700 మొత్తాన్ని ప్రతినెల ప్రభుత్వం పింఛన్ రూపంలో అందజేస్తుంది. అక్టోబరు 2 నుంచి పింఛన్ మొత్తాన్నిపెంచుతున్న నేపద్యంలో టీడీపీ సర్కార్ అనర్హుల పేరుతో లబ్ధిదారుల జాబితాలో కోతకు సిద్ధమైంది. భూమి ఉండకూడదు.. ఇంటిలో ఇన్ని గదులే ఉండాలి.. తదితర కారణాలు చూపుతూ పింఛన్‌లను తగ్గించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి పలు బృందాలు జిల్లాలోని అనేక మండలాల్లోని గ్రామాల్లో లబ్ధిదారుల అర్హతలు, అనర్హతలపై సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులుగా ఉండాలా? వద్దా?అనే విషయాన్ని నిర్ణయిస్తున్నారు. కమిటీలో ఎంపీడీఓతోపాటు వీఆర్వో, డ్వాక్రా మహిళలు, సర్పంచ్, టీడీపీకి సంబంధించిన నాయకులను కూడా పెట్టి ఎంపిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆందోళనలో లబ్ధిదారులు
ఏదో నెలనెలా అంతో ఇంతో పింఛన్ రూపంలో ఇస్తుంటే సర్దుకుని పోయేవాళ్లమని, ఇప్పుడు రూ. 1000 పేరుతో కోతలు పెడితే ఎలా బతకాలని పలువురు వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేయడానికి వయస్సు సహకరించదని, ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధుల పట్ల కనికరం చూపాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ తీరుతో జాబితాలో ఎవరి పేరు ఉంటుందో, ఎవరి పేరు ఊడుతుందో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నాలుగైదు నెలలుగా ఐరిస్, వేలిముద్రలు, ఆధార్‌కార్డుల పేరుతో అధికారులు విపరీతంగా ఇబ్బందులు పెట్టారని, రెండు మూడు నెలలుగా కూడా పింఛన్ ఇవ్వకుండా అది సరిపోలేదు, ఇది సరిపోలేదంటూ సతాయించారని...ఇప్పుడేమో అసలుకే ఎసరు పెట్టేందుకు సిద్ధమవడం ఏమిటంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.