గ్రాండ్‌ అండ్‌ గ్రేట్‌ | Grand and Great | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌ అండ్‌ గ్రేట్‌

Published Sun, Dec 18 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

గ్రాండ్‌ అండ్‌ గ్రేట్‌

గ్రాండ్‌ అండ్‌ గ్రేట్‌

తాత సంఘం

‘వృద్ధాప్యం శాపం కాదు. సహజం. నీరసాలు, నిందలు వదిలేద్దాం. ఉత్సాహంగా ఉందాం. పిల్లలకు మార్గదర్శకంగా నిలుద్దాం’ అనే ఆదర్శంతో ఆవిర్భవించింది ‘తాత సంఘం’. మహాత్ముని స్ఫూర్తితో.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామంలో ఈ సంఘం ఏర్పాటైంది. గడ్డం రాజిరెడ్డి అనే పెద్దాయన గాంధీ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. గ్రేట్‌ అనిపించే ఈ ‘గ్రాండ్‌’పా ల సంఘం గురించి నాలుగు మాటలు.

తాత 2011 సంఘం ఏర్పాటైంది. గ్రామంలో అరవై ఏళ్లు పైబడిన వారందరూ సంఘంలో సభ్యులే. ప్రారంభంలో 60 మంది వృద్ధులు సభ్యులుగా చేరారు. తరువాత ఆ సంఖ్య 109 మందికి చేరింది. వారిలో ఇంతవరకు 17 మంది  మరణించారు. ఎవరికైనా పిల్లలతో సమస్య వచ్చినా, వారితో పిల్లలకు సమస్య వచ్చినా ఇక్కడ పరిష్కారాలు ఆలోచిస్తారు. వ్యవస్థాపక సభ్యులుగా గడ్డం రాజిరెడ్డి, బీఏ సాయన్న, పాగల భూమయ్య, మచ్చ సాయన్న... ఇలా కొందరు ఈ సంఘం ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. సంఘానికి గ్రామంలో ఒక ప్రతిష్టను, పెద్దరికాన్ని తెచ్చారు.   

సమస్య పరిష్కారం కావాలంటే వ్యక్తిగా ముందు మనం మారాలన్న మహాత్మాగాంధీ మార్గాన్ని ఆచరించాలన్న ఉద్దేశ్యంతో సంఘానికి గాంధీతాత సంఘంగా మొదట నామకరణం చేశారు. అయితే సాంకేతికంగా గాంధీ పేరుతో రిజిస్ట్రేషన్‌ నిరాకరించడంతో ‘తాత సంఘం’ పేరుతో సంఘాన్ని కొనసాగిస్తున్నారు. ఏ కుటుంబంలోనైనా వృద్ధులు అనాదరణకు గురైతే సంఘ సభ్యులు కొందరు వారి ఇంటికి వెళ్లి విషయాన్ని అడిగి తెలుసుకుంటారు. సమస్య ఎక్కడ ఉందో వెతుకుతారు. ఒకవేళ సమస్య వృద్ధులతోనే అయితే వారు మారేలా కౌన్సిలింగ్‌ ఇస్తారు. పిల్లల దగ్గర  తప్పుంటే వారిని మందలించి దారికి తెస్తారు.

సంఘం పేరిట సభ్యులు ప్రతి నెలా జమ చేసే 10 రూపాయల మొత్తంతో ‘నిధి’ కూడా ఏర్పాటయింది. ఆ నిధితో సంఘ సభ్యులు ఓ షెడ్డు నిర్మించుకున్నారు. గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. వీటన్నింటికీ రూ.లక్షా 20 వేల దాకా ఖర్చయ్యాయి. సంఘ సభ్యులు ప్రతిరోజూ సమావేశమవ్వాలన్నది నియమం. అక్కడ సాధకబాధకాలుంటే మాట్లాడుకుని సమస్యలేవైనా ఉంటే ఆదిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ తరం కొడుకులతో ఎలా మెలగాలి, కోడళ్లతో ఎలా ఉండాలి అనే విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ వివాదాల విషయంలో సంఘం తరఫున ఇచ్చే తీర్పులను గ్రామస్థులు కూడా గౌరవిస్తున్నారని తాతసంఘ సభ్యులు చెబుతున్నారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement