పండుటాకుల పాట్లు
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
పోస్టాఫీస్‌ల చుట్టూ ప్రదక్షిణలు
నిరీక్షించి నీరసించిపోతున్న వృద్ధులు, దివ్యాంగులు
సూర్యాపేట :వయస్సు మీదపడిన పండుటాకులు, దివ్యాంగులు, వితంతువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘ఆసరా’ పింఛన్ పథకం రోజురోజుకూ నీరుగారుతోంది. మూడు నెలలుగా జిల్లాలోని లబ్ధిదారులకు పెన్షన్ అందకపోవడంతో వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. వృద్ధాప్యంలో ప్రభుత్వం అందించే ‘ఆసరా’తోనే బతుకీడుస్తున్న వారు ప్రస్తుతం డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిత్యం పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేçస్తూ నిరీక్షించి నీరసించి పడిపోతున్నారు. పలు చోట్ల వృద్ధులు అనారోగ్యానికి గురైన సంఘటనలుచోటు చేసుకుంటున్నాయి.
ఒకరిద్దరికే ఇచ్చి....
ప్రభుత్వం పెన్షన్ డబ్బులు విడుదల చేసిందని అధికారులు చెబుతున్నా.. లబ్ధిదారులకు మాత్రం మూడు నెలలుగా అందడంలేదు. పోస్టాఫీస్‌ల్లో ఒకరిద్దరికి ఇచ్చి డబ్బులు లేవని అధికారులు ముఖం చాటేస్తున్నారని వృద్ధులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 23 మండలాలు రెండు మున్సిపాలిటీలు, హుజూర్‌నగర్ నగర పంచాయతీ పరిధిలో 51,310 వృద్ధాప్య, 51,408 వితంతు, 19,813 వికలాంగులు, 6,500 గీతకార్మికులు, 823 చేనేత కార్మికుల పెన్షన్లు మొత్తం 1,29,854 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు, వితంతులకు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు నెలకు రూ.1,500 అందచేస్తారు. ఇలా జిల్లాలోని పెన్షన్‌దారులకు నెలకు రూ.15.15కోట్ల బడ్జెట్‌ను (ఆక్టోబర్ నెలకు) ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు 19 మండలాల పరిధిలో కేవలం 50,716 మంది లబ్ధిదారులకుగాను రూ.5,89,60,000 మాత్రమే పంపిణీ చేశారు. అంటే మిగిలిన రూ.10 కోట్లు పంపిణీ చేయాల్సింది. అదేవిధంగా పలుప్రాంతాల్లో సెప్టెంబర్ నెల డబ్బులు కూడా అందజేయకపోవడం గమనార్హం. వీటితో పాటు, డిసెంబర్ నెల కూడా గడిచిపోయిందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల డబ్బులు బ్యాంకులకు వచ్చేదెప్పుడు, వచ్చిన డబ్బులు తమకు అందచేసేదెప్పుడని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రొడెక్కిన వృద్ధులు...
మూడు నెలలుగా పెన్షన్లు అందకపోవడంతో తమ కనీస అవసరాలు తీర్చుకోలేక పోతున్నామని వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఆందోళన బాటపట్టి రోడెక్కారు. పెన్‌పహాడ్ మండలంలోని పలు గ్రామాలకు ఇప్పటి వరకు ఆక్టోబర్ నెల డబ్బులు కూడా రాలేదని పోస్టాఫీస్ అధికారులు చెప్పడంతో ఇటీవల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గరిడేపల్లి మండలం కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద కూడా నిరసన తెలిపారు. ఇక ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో గురువారం పెన్షనర్లు రాస్తారోకో నిర్వహించారు. ఇలా ప్రతీ రోజు ఏదో ఒక చోట నిరసనలు తెలియడం పరిపాటిగా మారింది.
పెద్దనోట్ల రద్దుతో...
ఆసరా పింఛన్‌దారులకు పెద్దనోట్ల రద్దు దెబ్బ కూడా బాగానే తగిలింది. 50 రోజుల క్రితం కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రకటన చేసింది. అప్పటికే నెల రోజుల పింఛన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు నోట్ల రద్దు ప్రభావంతో మళ్లీ డబ్బులు అందలేదు. దీంతో వారు ఎంచేయాలో అర్థం కాని పరిస్థితిల్లో పడిపోయారు. కొన్ని చోట్ల నవంబర్ పింఛన్ డబ్బులు పంపిణీ చేసినా రూ.2 వేల నోటుతో చిల్లర ఇక్కట్లు తప్పలేదు.