ఉసురు తీసిన పింఛన్
బ్యాంక్‌కు వెళ్లి వస్తూ అప్పలనర్సమ్మ మృతి
చిట్టినగర్ : ప్రభుత్వం ఇచ్చే పింఛను సొమ్ము కోసం వృద్ధులు ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో పింఛన్లకోసం వెళ్లి వస్తూ జైనాబీ, పడాల కాంతమ్మ, పిళ్లా లక్ష్మి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలు మరిచిపోకముందే 32వ డివిజన్ పరిధిలో బుధవారం మరో వృద్ధురాలి ప్రాణం పోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కొత్తపేట ఆంజ నేయవాగు బ్రహ్మంగారి మఠం ప్రాంతానికి చెందిన వెండిముద్దల అప్పలనర్సమ్మ (70)కు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛను అందుతోంది.
వచ్చే నెల నుంచి బ్యాంక్ ఖాతాలోనే పింఛను డబ్బులు వేస్తామని అధికారులు చెప్పడంతో రెం డు రోజులుగా బ్యాంక్‌లో ఖాతా తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కొత్తపేట కేబీఎన్ కాలేజీ సమీపంలోని ఓ జాతీయ బ్యాంక్‌కు వెళ్లి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వాలని అడగ్గా మరో పది రోజుల వరకు ఖాళీ లేదని అధికారులు చెప్పారు. బంగారయ్య కొట్టు సమీపంలోని మరో జాతీయ బ్యాంక్‌కు వెళ్లగా దరఖాస్తు పూర్తిచేసి ఇవ్వాలని కోరారు. ఖాతా తెరిచి బుధవారం పాస్ పుస్తకం తీసుకుని ఆనందంగా ఇంటికి వెళుతుండగా సొమ్మసిల్లి పడిపోయి ప్రాణం వదిలింది.