బతుకు బజారు
పింఛన్ తీసేశారు.. పోషణ భారమైంది !
ఓ అమ్మ ఆవేదన కలెక్టరేట్ చుట్టూ
{పదక్షిణల కరుణించని అధికారులు
మునిసిపల్ ఆఫీసులోనూ చుక్కెదుర
కన్నీటి పర్యంతమైన బజారమ్మ
ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు
ఆమెకు నా అనే వారు ఎవరూ లేరు. ఉన్నదల్లా ఒక్కగానొక్క కుమారుడు, భర్త. కుమారుడికి మతిస్థిమితం లేదు. భర్త పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వారి బాగోగులు చూసుకోవడమే ఆమె పని. వృద్ధాప్యంలో శక్తినంతా కూడగట్టుకొని వారిని పోషిస్తోంది. అయితే ఆమెకు ఆసరాగా ఉన్న పింఛన్‌ను ప్రభుత్వం తీసేసింది. నిబంధనల పేరుతో ఆమెకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. తనకు రెండు కళ్లుగా ఉన్న భర్త, కుమారుని పోషణ కోసం ఆమె ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. ‘పింఛన్ తీసేశారు.. ఆదుకోండి సారూ’ అంటూ ప్రాధేయపడినా కరుణించే అధికారులు కరువయ్యారు.
కర్నూలు (జిల్లా పరిషత్) : ఆనందం ఐదింతలు అంటూ ఒక వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు పేదలకున్న ఆసరాను ప్రభుత్వం తొలగించి వేస్తోంది. నెలనెలా వస్తున్న పింఛన్ ఆగిపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లూరు ఎస్టేట్‌లోని శివప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బజారమ్మ ఈ కోవకే చెందుతుంది. ఈమె ఒక్కగానొక్క కుమారుడు ఆంజనేయులుకు పుట్టుకతోనే బుద్ధిమాంద్యం. ఇప్పటికి 26 ఏళ్లు వచ్చినా అతనిలో మాత్రం మార్పులేదు. మాటలు రావు.. వినిపించవు, ఆకలని కూడా చెప్పలేడు. ఆమె భర్త మారెప్పదీ(62) అదే పరిస్థితి. పక్షవాతం వచ్చి 12 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కుమారునితో సమానంగా భర్తకూ అన్ని సపర్యలూ చేయాల్సి వస్తోంది. వారి ఆకలిని తీర్చేందుకు ఇరుగు పొరుగు వారి సహాయాన్ని అర్థిస్తుంది. అది కుదరకపోతే వీధిలో భిక్షమెత్తుకుని వచ్చి భర్త, బిడ్డ కడుపు నింపుతోంది. అయితే ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెకు వృద్ధాప్య పింఛనూ, కుమారునికి వికలాంగుల పింఛనూ ప్రభుత్వం తీసేసింది. పింఛన్ పునరుద్ధరించాలని బిడ్డను ఎత్తుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. మునిసిపల్ కమిషనర్‌ను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని జేసీ చెప్పగా గురువారం సాయంత్రం ఆమె తన కుమారున్ని ఎత్తుకుని మునిసిపల్‌కార్యాలయానికి వెళ్లింది.
గంటకు పైగా మున్సిపల్ కమిషనర్ కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరకు అడిషనల్ కమిషనర్ ప్రసాదశర్మను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. అయితే పింఛన్లు తీసేసేది తాము కాదని, డీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లాలంటూ వెనక్కి పంపించారు. దీంతో బజారమ్మ కన్నీటి పర్యంతమైంది. తనగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విలపించింది. ‘ ఈ బిడ్డను భుజాన వేసుకుని ఎక్కడికని తిరగను. ఉన్నోళ్లకు చానా మందికి పింఛన్లు ఇస్తారు...మాలాంటోళ్లవి తీసేశారు. వీడికి(కుమారునికి) వేలిముద్రలు పడవు. అందుకే ఆధార్ రాలేదు.
జిల్లా అధికారులు కనికరించి తనకు న్యాయం చేయాలి’ అని విలేకరుల ఎదుట వేడుకుంది. ప్రతి రోజూ కుమారునికి, భర్త పోషణకు రూ.200లకు పైగా ఖర్చు అవుతుందని, దాతలు సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.