ఒంగోలు టౌన్: ప్రతి నెలా ఠంచనుగా వచ్చే పింఛన్‌ను రెండు నెలల నుంచి రాకుండా చేశారని కందుకూరు మండలం ఓగూరుకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాపోయారు. సోమవారం ప్రకాశం భవనం ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో వారు తమ గోడును కలెక్టర్ విజయకుమార్‌కు విన్నవించుకున్నారు.
కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా?: కలెక్టర్
‘50 మంది అధికారులు ఒకేచోట కూర్చొని నాలుగు గంటలు పనిచేస్తున్నారు. దానివల్ల సమస్యలకు పరిష్కారం రావాలి. మీరు(అధికారులు) మాత్రం ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వచ్చినట్లుంది’ అని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు స్పష్టమైన నిర్ణయాలు రాయకుండా తూతూ మంత్రంగా కలెక్టర్‌కు అందించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కారంచేడు మండలం స్వర్ణ గ్రామ పంచాయతీలోని రెగ్యులర్, కాంట్రాక్టు కార్మికులు తమకు 14 నెలల నుంచి వేతనాలు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇన్‌చార్జ్ డీఎల్‌పీవో నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. రెగ్యులర్ కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా సర్క్యులర్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నా దగ్గరకు ఊరికే ఎందుకు పంపిస్తారు :
మండల పరిధిలో మీరు చేయాల్సిన పనులు చేయకుండా నా దగ్గరకు ఊరికే ఎందుకు పంపిస్తున్నారని పొదిలి తహశీల్దార్‌ను కలెక్టర్ నిలదీశారు. పొదిలి మండలం రాజుపాలెంలో 448 మందికి 2009లో సర్వే నెం 1064లో ఇళ్ల పట్టాలిచ్చినా ఇంతవరకు పొజిషన్లు చూపించలేదు. దాంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఐదేళ్ల నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన కలెక్టర్ పట్టాలు పంపిణీ చేసిన వారిలో అర్హులైన వారితో జాబితాను ప్రచురించి వెంటనే పొజిషన్లు చూపించాలని పొదిలి తహశీల్దార్‌ను ఆదేశించారు.
ఏ లోకంలో ఉన్నావు ?
- మార్కెటింగ్‌శాఖ అధికారిపై కలెక్టర్ మండిపాటు
సుబాబుల్, జామాయిల్ రైతుల నుంచి తక్కువ ధరకు కర్ర కొనుగోలుచేసి మద్దతు ధరకు కొన్నట్లు బిల్లులు ఇస్తుండటంపై కలెక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒంగోలు, చీమకుర్తి మార్కెట్ కమిటీల పరిధిలో జరుగుతున్న తంతును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, ఇతర నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకిలా జరుగుతోందని మార్కెటింగ్‌శాఖ అధికారిని కలెక్టర్ ప్రశ్నించారు.
సుబాబుల్ టన్ను 4400, జామాయిల్ టన్ను 4600 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చెబుతున్న ధర జిల్లాలోదా లేక దేశంలోదా, నువ్వు ఏ లోకంలో ఉన్నావు, ఏమి జరుగుతుందో తెలియకుండా ఊహల్లో ఉండి మాట్లాడతావా అని నిలదీశారు. ఒంగోలు, చీమకుర్తి మార్కెట్ యార్డులపై పోలీసుల సాయంతో ఆకస్మిక తనిఖీలుచేసి నివేదికలు అందించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించారు.
పాఠశాల ప్రాంగణంలో ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకులా?
ఉలవపాడు మండలం చాకిచర్ల పంచాయతీ పరిధిలోని సుబ్బారాయుడు సత్రం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రైవేట్ గృహాలకు చెందిన సెప్టిక్ ట్యాంకులు నిర్మించిన విషయమై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో చుట్టుపక్కన ఉన్నవారు సెప్టిక్ ట్యాంకులు కట్టారని గ్రామ ఉప సర్పంచ్ కామేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ సెప్టిక్ ట్యాంకులు కట్టిన వారికి నోటీసులు ఇచ్చి పాఠశాల ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు.
వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసినా సాయం అందలేదు:
ఉలవపాడు, సింగరాయకొండ మండలాల్లోని 58 మందికి వెట్టిచాకిరి నుంచి విముక్తి అయినా ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని ప్రకాశం జిల్లా యానాది యువజన సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వై జాలయ్య, వై అంజిబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీ నెల్లూరు జిల్లా గూడూరులో వెట్టి నుంచి విముక్తి చేసినా ప్రభుత్వం నుంచి 20 వేల రూపాయల నగదు, ఇంటి స్థలం రాలేదన్నారు. దీనిపై విచారించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్..కందుకూరు సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు.
చదువులోనూ, మెనూలోనూ వివక్ష :
సంతమాగులూరు మండలం ఏల్చూరులోని కేజీబీవీ ఎస్‌వో తమ పిల్లలకు చదువు చెప్పించడంలో, మెనూ పాటించడంలో వివక్ష ప్రదర్శిస్తోందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 2011లో ఎస్‌వోగా బాధ్యతలు స్వీకరించిన ఆవుల సునీత ఎస్సీ విద్యార్థినులను, ఇతర కులాల విద్యార్థినులను వేర్వేరుగా విభజించి వారిమధ్య తగువులు పెట్టిస్తోందన్నారు. కేజీబీవీలో ఎస్సీ కులానికి చెందిన ఎస్‌వోను నియమించాలని కోరారు.
పింఛన్లు పీకేశారు
Published Tue, Nov 25 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement