ఒంగోలు టౌన్ : వారంతా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. నెలనెలా వచ్చే పింఛనే ఆధారం. అలాంటి పింఛన్‌ను సర్వే పేరుతో పీకేశారు. అప్పటివరకూ అందుకున్న పింఛన్లకు వారిని అనర్హులను చేశారు. జాబితాల్లో ఉన్న పేర్లను ఏకపక్షంగా తొలగించారు. తమకు జరిగిన అన్యాయం గురించి వారంతా మండల అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఏకంగా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు.
కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఆ వివరాల ప్రకారం... చీమకుర్తి మండలం పీ నాయుడుపాలెం గ్రామంలో ఆ గ్రామ కమిటీ పింఛన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ గ్రామ సర్పంచ్, కార్యదర్శులు ఏకపక్షంగా వ్యవహరించి 75 మంది అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పేర్లను తొలగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికామన్న కారణంతోనే పింఛన్ల జాబితా నుంచి తమపేర్లు తొలగించారంటూ బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఇంతమంది పింఛన్లు తొలగించారా:కలెక్టర్
వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో కలెక్టర్‌ను కలిసి తమ పింఛన్లు తొలగించారని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇంతమంది పింఛన్లు తొలగించారా అని అవాక్కయ్యారు. సర్వే నిర్వహించి తమ పేర్లను తొలగించారంటున్న బాధితుల్లో కొంతమంది 90 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు చూపించడంతో వారి పింఛన్ల తొలగింపునకు కారణాలు తెలియజేయాలని డీఆర్‌డీఏ పీడీ పద్మజను ఆదేశించారు. ప్రతిఒక్కరినీ విచారించి నివేదికలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పింఛన్లు పీకేశారు
Published Tue, Sep 30 2014 2:41 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
Advertisement
Advertisement