సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పండుటాకులకు ‘ఆసరా’గా, వికలాంగులకు ఊతకర్రగా నిలిచేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక భద్రత పింఛన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. వృద్ధులు, వితంతవులు, గీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు రూ.1000, వికలాంగులకు రూ. 1,500 చొప్పున శనివారం నుంచి ‘ఆసరా’ పథకం కింద పింఛన్లు అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
లబ్ధిదారుల జాబితా ఇప్పటికే తయారు చేసిన జిల్లా అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4.10 లక్షల పింఛన్ దరఖాస్తులు రాగా, వీటిని అధికారులు వడబోసి 2.85 లక్షల మంది అర్హులను తేల్చారు. రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినా... తెల్లవారగానే పింఛన్ల పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. తాజాగా ప్రభుత్వం మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే పింఛన్ల పంపిణీ వాయిదా పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెరగనున్న దరఖాస్తులు
ఆహార భద్రత, పింఛన్ దరఖాస్తుల పునఃపరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హతలకు సంబంధించి గతంలో పేర్కొన్న నిబంధనలు కాకుండా పలు మార్పులు చేసింది. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.5 లక్షలు, ఇక పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు పెంచింది.
అదే విధంగా వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3.75 ఎకరాల్లోపు మాగాణి, ఏడు ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్న వాళ్లందరినీ అర్హులుగా గుర్తించాలని వెల్లడించింది. అయితే 65 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిలో ఎలాంటి సడలింపు లేకపోవడం, రేషన్‌కార్డు నిబంధనల్లో కూడా స్వల్పంగా మాత్రమే మార్పులుండడంతో దరఖాస్తులు ఓ మోస్తారుగా పెరిగే అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో అదనంగా మరో 50 వేల దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత పరిశీలనలో అర్హత కోల్పోయిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునేలా సర్కార్ తన తాజా ఆదేశాల్లో వెసులుబాటు కల్పించింది. ఆహార భద్రత, పింఛన్‌ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తహశీల్దారును సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అర్హులను తేలుస్తారు.
పింఛన్‌ల పంపిణీకి తొలి ప్రాధాన్యత
కొంతకాలంగా పింఛన్ దరఖాస్తుల విచారణ చేసిన అధికారులు అర్హత సాధించిన దరఖాస్తులను 4, 5 తేదీల్లో కంప్యూటరీక రించారు. 6,7 తేదీల్లో అర్హులైన వారికి కార్డులు ముద్రించారు. శనివారం నుంచి పింఛన్‌ల పంపిణీ ప్రారంభించేందుకుజాబితా సిద్ధం చేశారు. తహశీల్దారు, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, ఏఈఓలకు ఒక్కొక్కరికి మూడు గ్రామాల చొప్పున బాధ్యతలు అప్పగించనున్నారు. మొదటి నెల పింఛన్‌లు నగదు రూపంలో చెల్లిస్తున్నందున ప్రత్యేక అధికారుల సమక్షంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఆహార భద్రత కార్డులకు మరింత సమయం
ఆహార భద్రత కార్డులు కోసం జిల్లా వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ప్రస్తుతానికి రెవెన్యూ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి విచారణ పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్లే ఆహార భద్రత కార్డుల జారీకి మరింత సమయం పట్టనుంది. కుటుంబంలోని సభ్యుల ఆధారంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికిచ్చే కార్డులను అధికారులు గులాబి రంగులో ముద్రించనున్నారు. కొత్త కార్డులు డిసెంబర్‌లో చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలోగా జారీ కానున్నాయి. ప్రస్తుతానికి అధికార యంత్రాంగం పింఛన్‌ల పంపిణీ పైనే దృష్టి సారించింది. అందువల్లఈ దరఖాస్తుల పరిశీలనకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నిబంధనలు సడలించిన నేపథ్యంలో అదనంగా 50 వేల వరకు కార్డుల దరఖాస్తుల పెరిగే అవకాశం ఉంది.
కార్డులు గుర్తులు
వృద్ధాప్య పింఛన్‌లు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు గులాబి రంగు కార్డు
వికలాంగులకు ఆకుపచ్చ రంగు కార్డు
వితంతువులకు నీలిరంగు కార్డు
గీతకార్మికులకు
ఆహారభద్రత కార్డులు(బీపీఎల్ కుటుంబాలకు) గులాబి రంగు కార్డు
పండుటాకులకు ‘అసరా’
Published Thu, Nov 6 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement