వృద్ధులే టార్గెట్!
- మభ్యపెట్టి నగలతో ఉడాయింపు
- దొంగల ముఠా ఆటకట్టించిన పోలీసులు
నాంపల్లి: వృద్ధులు, ఒంటరి మహిళలను మభ్యపెట్టి ఆభరణాలు ఎత్తుకెళ్లే ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.13.24 లక్షల విలువ చేసే 46 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. జంట కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులున్నాయి. 2011 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నా పోలీసులకు చిక్కడం ఇదే మొదటిసారి. సోమవారం నాంపల్లిలోని మధ్య మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకకు చెందిన సంతోష్ కులకర్ణి(46) చైతన్యపురి సాయి రెసిడెన్సీలో ఉంటున్నాడు.
ఇతడి తండ్రి లక్ష్మణ్‌రావు దేవాదాయ శాఖలో ఉద్యోగి. సంతోష్ కులకర్ణి 1991లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యతో కలిసి గౌలిగూడలో పాఠశాలను నడిపాడు. ఆరేళ్ల తర్వాత భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పాఠశాలను మూసేశారు. సంతోష్ మాత్రం బిస్కెట్లు, చాక్లెట్లు, జనరల్ వస్తువులను నేరుగా కంపెనీల నుంచి కిరాణా దుకాణాలకు సరఫరా చేసేవాడు. అయితే, జల్సాలకు అలవాటు ఇతడికి వ్యాపారం గిట్టుబాటు కాలేదని వదిలేసి మోసాలు, చోరీలు మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో గౌలిగూడకు చెందిన పులిగిల లక్ష్మణ్, చైతన్యపురికి చెందిన ముదిగొండ భాస్కర్‌తో ముఠాకట్టాడు. కిరాణా షాపు నడిపే వృద్ధులు, ఒంటరి మహిళలను టార్గెట్ చేశారు. మొదట ఇలాంటి వారికి ఫోన్ చేసి మా కంపెనీ మీకు ఆషాఢం ఆఫర్లు ఇస్తోందంటూ చెప్పి బిస్కెట్లు, చాక్లెట్లు ఎక్కువ అమ్మితే కంపెనీ ఫ్రిజ్, కూలర్లు, బంగారు ఆభరణాలు ఇస్తామంటూ ఎర వేస్తారు. నిజమే అనుకొని వృద్ధులు వీరిని తమ ఇంటికి పిలిచేవారు.
ఇంటికి రాగానే ఉంగరం, గొలుసు సైజులు కావాలని వారి వద్ద ఉన్న ఆభరణాలను తీసుకుంటారు. వాటి సైజు కొలుస్తున్నట్లు నటిస్తూనే దృష్టి మరల్చి పారిపోయేవారు. ఇలా వీరి చేతిలో మోసపోయిన బాధితులు గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించగా ముఠా కోసం వల పన్నారు. ఎట్టకేలకు సికింద్రాబాద్ కుండ మార్కెట్ వద్ద ఉన్న ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరాల చిట్టా బయటపడింది. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సమావేశంలో సెంట్రల్ జోన్ ఓఎస్‌డీ వరప్రసాదరావు, చిక్కడపల్లి ఏసీపీ అమరకాంత్‌రెడ్డి, గాంధీనగర్ అడిషనల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, ఇన్‌స్పెక్టర్ సంజీవరావు పాల్గొన్నారు. కాగా, విలేకరుల సమావేశానికి ఈ ముఠా చేతిలో మోసపోయిన బాధితులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలు నిందితులతో ఇలా మోసగించి నగలు ఎత్తుకెళ్లేకంటే పని చేసుకొని బతకొచ్చుకదా? అని అన్నారు.