పరిమళించిన మానవత్వం
పోరుమామిళ్ల: మానవత్వం పరిమళించింది.. ఇద్దరు యువకులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం పలువురిని కదిలించింది.. వారు అనాథ వృద్ధున్ని ఆశ్రమంలో చేర్చారు.. అయితే ఆయనను విధి చిన్నచూపు చూడటంతో సంఘటన మరో మలుపు తిరిగింది.. ఆ గడియల్లోనే మృతి చెందిన వృద్ధునికి వారు అన్నీ తామే అయి అంత్యక్రియలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఆ యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పూర్’ జిల్లా ఇన్‌చార్జి, పోరుమామిళ్లకు చెందిన రామకృష్ణారెడ్డి ఒకరు కాగా, ఆయన మిత్రుడు సుభాన్‌బాషా మరొకరు.
ఇంట్లో ఆదరించే దిక్కు లేక:
ప్రొద్దుటూరు మండలం బుడ్డాయపల్లెకు చెందిన రామయ్య(70) ఇంట్లో ఆదరించే దిక్కులేక అనాథగా బజారున పడ్డాడు. పోరుమామిళ్లకు చేరిన ఆయన అనారోగ్యంతో స్థానిక 30 పడకల ఆసుపత్రిలో ఆదివారం చేరాడు. చికిత్స చేసిన సిబ్బంది వృద్ధుడి వివరాలు తెలుసుకొని ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పూర్’ జిల్లా ఇన్‌చార్జి రామకృష్ణారెడ్డికి సమాచారం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు ఫాదర్ సర్వేశ్వరరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.
మిత్రుడు సుభాన్‌బాషా సహకారంతో ఆటోలో బాలమ్మ సత్రం వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ ఆటో నుంచి దింపి, ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. అంత వరకు బాగానే వుంది. బాగా మాట్లాడుతున్న వృద్ధుడు, అక్కడ మంచినీరు తాగాక వీల్ కుర్చీలో కూర్చొని సేద తీరుతున్న సమయంలోనే ఊపిరి ఆగిపోయింది. తాము చేసిన కృషితో ఆశ్రమంలో ఆశ్రయం దొరికిందని ఆనందిస్తున్న ఇద్దరు యువకులకు వృద్ధుని హఠాన్మరణం ఆవేదన కలిగించింది.
ఫాదర్ సర్వేశ్వరరెడ్డితో మాట్లాడి వారే ఆశ్రమ సమీపంలో గొయ్యి తీసి, సంప్రదాయ పద్ధతిలో అన్నీ తామే అయి, ఆశ్రమ సిస్టర్ సహాయంతో వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబానికి దూరమయి, అనాథగా వున్న ఆయనకు సంబంధంలేని యువకులు మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించడం అందరికీ మార్గదర్శకం.