Helping Hands for the Poor
-
పేదోడిదే పెద్దమనసు!
అది కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ దేశం విలవిల్లాడుతున్న కాలం.. అటు కరోనా దాడి, ఇటు దాని కట్టడికి విధించిన లాక్డౌన్లు, కర్ఫ్యూలతో ఉపాధికి దెబ్బపడింది.. ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. రాష్ట్రాల ఆర్థిక నిర్వహణే గాడితప్పిన దుస్థితి.. ఆపన్నహస్తం కోసం ఎందరో అభాగ్యులు ఎదురుచూస్తున్న వేళ భారతీయులలోని మానవత్వం పరిమళించింది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడాలన్న గురజాడ సూక్తిని ఆచరించి చూపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య ఏకంగా రూ. 23,700 కోట్లను సమాజంలోని వివిధ వర్గాలకు విరాళంగా అందించినట్టు తాజా అధ్యయనంలో తేలింది. దానగుణంలో దిగువ, మధ్యతరగతి జనం ముందు వరుసలో నిలిస్తే.. ధనిక వర్గం అంతంతే విదిలించినట్టు తేలింది. కరోనా సమయంలో మన దేశంలో, విదేశాల్లో దానధర్మాల తీరు ఎలా ఉంది? భూమ్మీద చేతికి ఎముక లేనట్టుగా దానాలు చేసే దేశాలు, వ్యక్తులు ఎవరు? లోభి పుంగవుల మాటేమిటి? వంటి వివరాలతో ప్రత్యేక కథనం. దానం చేసే చేతికి మనసుండాలి.. మమతకు మానవత్వం తోడవ్వాలి.. మానవ సేవే మాధవ సేవ అన్నదీ బోధపడాలి. కరోనా కాలంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు దీన్ని అర్థం చేసుకుని.. తోటివారికి చేతనైనంత సాయం చేసి ఆదుకున్నారని అశోకా యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రపీ’ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ‘హౌ ఇండియా గివ్స్ 2020–2021’ పేరుతో చేపట్టిన అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. దాని ప్రకారం.. భారతీయులు 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య మొత్తంగా రూ.23,700కోట్లను విరాళాల రూపంలో అందించారు. ఇందులో అత్యధికంగా రూ.15,168 కోట్లను మత సంస్థలకు దానం చేశారు. మత సంస్థలను మినహాయిస్తే.. అత్యధికంగా డబ్బు లేదా ఇతర సాయం చేసింది అభాగ్యులకు, యాచకులకేనని అధ్యయనం వెల్లడించింది. వారికి రూ.2, 900 కోట్లను అందించినట్టు తెలిపింది. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను ఆదుకొనేందుకు మరో రూ.2 వేల కోట్లను అందించారని, ఇళ్లలో పనిచేసేవారికి రూ.1,000 కోట్లు అందించి పెద్దమనసు చాటుకున్నారని వివరించింది. కోవిడ్ రెండోసారి విజృంభించినప్పుడు ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్లకు ఇబ్బంది, వలస కూలీల కాలినడక వంటి సమయంలో మతేతర సంస్థలు అంటే పీఎం–కేర్స్, ఎన్జీవోలు, ట్రస్ట్‌లు లేదా ఆరోగ్య సిబ్బందికి చేసిన సాయం మొత్తం రూ.1,100 కోట్లు మాత్రమేనని పేర్కొంది. మత సంస్థలకే అత్యధిక విరాళాలు ఇక మొత్తంగా చూస్తే.. 70% కుటుంబాలు మత సంస్థలకు సాయం చేయగా, 12% కుటుంబాలు అభాగ్యులను ఆదుకున్నాయి. మరో 9% తమ దగ్గరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సా యం చేసినట్టు నివేదిక పేర్కొంది. ఇంట్లో పనిచేసేవారికి సాయం చేశామని చెప్పిన కుటుంబాలు 4%. మతాలకతీతంగా నిరాశ్రయులకు ఆశ్రయం, విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించే రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్, మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు ఎందరో భారతీయులు దానం చేయడం చెప్పుకోవాల్సిన విషయం. పేదోడి పెద్ద మనసు దానమిచ్చిన వారిలో అత్యధికం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల వారేనని అధ్యయనం తెలిపింది. ఏకంగా 52 శాతం మంది స్వల్పాదాయ వర్గాల కుటుంబాలు చేసిన దానమే మొత్తం సొమ్ములో 34 శాతం వరకు ఉండటం విశేషం. ఆదాయం ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో 22శాతం మంది మాత్రమే ఏదో ఒక రూపంలో సాయం చేసినట్టు అధ్యయనం తేల్చింది. వయసు రీత్యా చూస్తే 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు దాతల్లో ఎక్కువగా ఉన్నారు. దానం చేయాలా, వద్దా? ఒకవేళ చేస్తే ఏ రూపంలో అన్న కీలకమైన అంశాలపై నిర్ణయాలు పురుషులే తీసుకున్నట్టు వెల్లడైంది. వారు ఎక్కువగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మత సంస్థలకు దానమిచ్చేందుకు ఆసక్తి చూపారు. మహిళలు నిర్ణయాలు తీసుకున్న కుటుంబాల్లో సాయం ఎక్కువగా అభాగ్యులు/ యాచకులు, తమ ఇళ్లలో పనిచేసేవారికి అందింది. పట్టణ, నగర ప్రాంతాలతో (83 శాతం) పోలిస్తే పల్లె ప్రాంతాల్లో ఇతరులకు సాయం చేసినవారు స్వల్పంగా (88 శాతం) ఎక్కువ. ప్రాంతాల వారీగా చూస్తే.. ఉత్తర భారతంలో ఎక్కువ మంది (96 శాతం) ఆర్థిక సాయం చేశారు. తర్వాతి స్థానంలో ఈశాన్య భారతం (93 శాతం)నిలిచింది. అధ్యయనం జరిగిందిలా.. అశోకా వర్సిటీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా దాదాç³# 81 వేల కుటుంబాలను ప్రశ్నించారు. మొత్తం 18 రాష్ట్రాల్లో రెండు దశల్లో సర్వే చేశారు. ఆరు నెలల్లో (అక్టోబర్ 2020–మార్చి 2021) మీరు ఎవరికైనా దానం చేశారా? ఒకవేళ చేసి ఉంటే ఎవరికి? ఎందుకు? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. రెండో దశ సర్వే 2021 అక్టోబర్‌లో జరిగింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలు, కుటుంబాలు ఏ రకంగా దా నాలు చేస్తున్నాయో తెలుసుకొనేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని.. సామాజిక, ఆర్థికస్థాయిలు, వయసు, స్త్రీ, పురుషుల్లో ఇతరులకు సాయం చేసే లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయని వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎందరో ఆపన్నులు ప్రపంచవ్యాప్తంగా జరిగే దానాలపై చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ (సీఏఎఫ్) ఏటా ఒక అధ్యయనం నిర్వహిస్తుంది. 2021 లో ఈ సంస్థ సుమారు 115 దేశాల్లో సర్వే చేసి ఒక నివేదికను సిద్ధం చేసింది. అపరిచితులకు సాయం చేయడం, డబ్బు విరాళంగా ఇవ్వడం, ఇతరుల పనికోసం సమయం వెచి్చంచడం అనే మూడింటిని దానం లేదా సాయంగా నిర్ణయించి ఈ అధ్యయనం చేపట్టింది. అన్ని దేశాల్లోనూ అపరిచితులకు సాయం చేయడం ఎక్కువైందని నివేదిక తెలిపింది. దాదాపు 300 కోట్ల మంది డబ్బు దానం చేయగా, ప్రతి ఐదుగురిలో ఒకరు తమ సమయాన్ని వెచి్చంచినట్టు పేర్కొంది. డబ్బు రూపంలో విరాళమివ్వడం వంటి విషయాల్లో ఇండొనేíÙయా తొలిస్థానంలో నిలవగా.. అపరిచితులకు సాయం విషయంలో నైజీరియా అగ్రస్థానంలో నిలిచింది. 25 శాతం సంపద ఇచ్చేస్తామంటున్న స్టార్టప్ కింగ్‌లు! తమ సంపదలో 25 శాతాన్ని దానధర్మాలకు కేటాయిస్తామని స్టార్టప్ కంపెనీలతో కోట్లు గడించిన నిఖిల్ కామత్, సుజిత్ కుమార్, అంకిత్ నాగోరిలు ఇటీవలే ప్రకటించారు. దీనికి అదనంగా విద్యా సంబంధ కార్యక్రమాల కోసం వారు భారీగా విరాళాలు సేకరించారు. ‘యంగ్ ఇండియన్ ఫిలాంథ్రొపిక్ ప్లెడ్జ్’ సంస్థ సభ్యులుగా వారు ఈ ప్రకటన చేశారు. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్టార్టప్ జెరోదా, ట్రూబీకన్ కంపెనీల వ్యవస్థాపకుడిగా నిఖిల్ కామత్, ఉడాన్ వ్యవస్థాపకుడు సుజిత్ కుమార్, క్యూర్ ఫుడ్స్‌ను స్థాపించిన అంకిత్ నాగోరిలు ‘బిల్ అండ్ మెలిండా గేట్స్’ ఫౌండేషన్‌తో కలసి కర్ణాటకలోని హావేరి, తుముకూరు, యాద్గిర్, దావణగెరె జిల్లాల్లో సుమారు 105 పాఠశాలలు, వాటి పరిసరాల్లోని అంగన్వాడీల రూపురేఖలను మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేపట్టారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
ఆకలితో ఉన్నవారిని ఆదుకుందాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ దెబ్బకు పలు వ్యాపారాలు, పనులు నిలిచిపోయాయి. రోజుకూలీలు డబ్బుల్లేక తినీతినక పస్తులుంటున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు పరిచయం అక్కర్లేదు. ఈ విపత్తు వేళ సాటి మనిషి కడుపు నింపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం’ అని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
కోదాడలో పేదలకు చేయూత
సాక్షి,నల్గొండ: కరోనా మహమ్మారి చిన్న వారి నుంచి పెద్దవారి వరకు కష్టాన్ని కలిగిస్తోంది. ఈ వైరస్ విజృంభించడంతో కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కదీంతో రోజు వారీ కూలీలు, వలస కూలీలు, పేదలకు ఆహారం లభించక, నిత్యవసరాలు అందుబాటులో లేక పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి సాయంగా అనేక మంది వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు వారికి తోచిన సాయం అందిస్తున్నారు. (జగనన్న సైనికులు పేరిట ఐటీ ఉద్యోగులు సేవ) ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో అత్యంత నిరుపేద, రోజువారి వ్యవసాయ కూలీ, వృద్ధులు, దివ్యాoగులలో 200 కుటుంబాలను ఎంపిక చేసి వారికి నెలకు సరిపోను సుమారు రూ.500ల విలువగల లక్ష రూపాయల నిత్యవసర వస్తువులు డొనేట్ కార్ట్ పౌండేషన్ వారి సహకారంతో తొగర్రాయి శ్రీ వివేకానంద యువజన సంఘం సభ్యులు వారి ఇంటికే వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు నందుల లక్ష్మీనరసింహశాస్త్రి, ప్రస్తుత అధ్యక్షుడు సంతోష్, డోనేట్ కార్ట్ సీఈఓ సందీప్ శ్రీవాత్సవ్, యూత్ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చదవండి: (ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్) -
కన్నీటి "రోజా"
మనసెరిగిన భర్త.. ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు.. ప్రేమగా చూసుకునే అత్తామామ.. అందమైన జీవితం ఆమెది. భర్త రెక్కల కష్టంతో ఉన్నంతలో ఇల్లు సాఫీగా నడిచేది. సజావుగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్త మంచంపట్టగా.. చికిత్స కోసం ఆస్తులన్నీ కరిగిపోయాయి. కూలీగా మారి కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమె.. పసుపుకుంకుమ కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఏ దేవుడైనా సాయం చేయకపోతాడా.. తన భర్త ప్రాణాలు నిలుపకపోతాడా అని ఆశగా ఎదురుచూస్తోంది. అనంతపురం ,గుంతకల్లు: బోమ్మనహాళ్ మండలం దేవగిరి గ్రామానికి చెందిన రోజాకు విడపనకల్లు మండలం కరకముక్కల గ్రామానికి చెందిన అనిల్‌కుమార్(30)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కూతురు నిదర్శిని(5), కుమారుడు యశ్వంత్ (2) సంతానం. అనిల్‌కుమార్‌కు సొంత ట్రాక్టర్, కొంత వ్యవసాయ భూమి ఉంది. రోజా కూడా భర్త మనసెరిగిన ఇల్లాలుగా అత్తామామలు కిష్టప్ప, లక్ష్మీదేవిలతో కలిసి ఆనందంగా కాలం గడుపుతోంది. కానీ ఆ కుటుంబంపై విధి పగబట్టింది. 2018 సెప్టెంబర్ 10న సొంత పనిమీద ద్విచక్ర వాహనంపై రాయదుర్గానికి వె?ళ్లిన అనిల్‌కుమార్.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గుర్తుతెలియని వాహనం అనిల్‌కుమార్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అతను తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు అనిల్‌కుమార్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఇక్కడ దాదాపు 3 నెలల పాటు ఉంచి చికిత్స చేయించారు. ఇందుకోసం రూ.25 లక్షల దాకా ఖర్చు చేశారు. ఈ క్రమంలో జీవనాధారమైన ట్రాక్టర్‌ను అమ్మేశారు. ఉన్న కాస్త పొలం తనఖా పెట్టారు. ఒంటిపై ఉన్న బంగారం మొత్తాన్ని అమ్మేశారు. బయటి వ్యక్తుల నుంచి సుమారు రూ.12 లక్షల దాకా అప్పు చేశారు. ఇలా రూ.25 లక్షలు ఖర్చు చేసిన తర్వాత అనిల్‌కుమార్ కోమా నుంచి బయటపడ్డాడు. అయితే వెన్నెముక బాగా దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో రోజా జీవితం తలకిందులైంది. తలలోని రక్తనాళాల్లో గడ్డలు అనిల్‌కుమార్ తలలోని రక్తనాళాల్లో దాదాపు 25 చోట్ల చిన్నపాటి రక్తపు గడ్డలున్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం అనిల్‌కుమార్ కళ్లు తెరిచి చూడటం తప్ప.. ఎవరితో మాట్లాడలేడు. ఆహారం తీసుకోలేడు. దీంతో కడుపు వద్ద రంధ్రం చేసి గొట్టం ద్వారా ద్రవాహారాన్ని అందిస్తున్నారు. 10 నెలలకు పైగా మంచానికే పరిమితం కావడంతో ఒళ్లంతా పుండ్లు పడ్డాయి. రోజూ వైద్య చికిత్స, ఫిజియోథెరపీ చేయించడంతో పాటు ఖరీదైన మందులు వాడాల్సి ఉంది. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చిపెట్టిన అనిల్‌కుమార్ కుటుంబం వద్ద ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రోజా రెక్కల కష్టంతోనే... బెంగళూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనిల్‌కుమార్‌ను కుటుంబీకులు స్వస్థలం కరకముక్కలకు తీసుకువచ్చారు. అయితే రోజూ వారి వైద్య పరీక్షల్లో భాగమైన డ్రస్సింగ్, ఫిజియోథెరపీ కోసం గుంతకల్లు నుంచి వైద్యులను పిలిపించుకోవడం తలకు మించిన భారమైంది. రోజు వారీ ఖర్చులు అధికం కావడంతో దిక్కు తోచక గుంతకల్లు పట్టణంలోని మహబూబ్‌నగర్‌లో నివాసముంటున్న అనిల్‌కుమార్ అక్క మనోజ్ఞ ఇంటికి చేరారు. అనిల్‌కుమార్ భార్య రోజా స్థానికంగా ఉన్న ఓపైపుల పరిశ్రమలో కూలీపనులకు వెళ్తూ...వచ్చిన ఆ కొద్దిపాటి మొత్తంతోనే భర్తకు డ్రస్సింగ్, ఫిజియోథెరపీ చేయిస్తోంది. ఉదయం కూలీకి వెళ్లడం రాత్రి భర్తకు సపర్యలు చేస్తోంది. రోజా పనికి వెళ్లిన సమయంలో అనిల్‌కుమార్ తల్లి లక్ష్మీదేవి సేవలు చేస్తుంది. ఈ స్థితిలో కుటుంబ పోషణ భారం కాగా.. రోజా తన రెండేళ్ల కుమారుడు యశ్వంత్‌ను పుట్టింట్లో వదిలింది. ఐదేళ్ల కూతురు నిదర్శిని తన వద్దే ఉంచుకుని పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదివిస్తోంది. మందులకు డబ్బుల్లేక రోజా కూలి డబ్బులతో కుటుంబం గడవడే కష్టం కాగా...రెండు నెలలుగా అనిల్‌కుమార్‌కు అందించాల్సిన రోజువారీ మందులు ఆపేశారు. డ్రస్సింగ్, ఫిజియోథెరపీ సేవలు నిలిచిపోయాయి. మంచంపై ఎముకల గూడులా కనిపిస్తున్న అనిల్ వైపు దీనంగా చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రోజా మిగిలిపోయారు. తనకొచ్చిన కష్టాన్ని తలచుకుని లోలోనే కుమిలిపోతున్నారు. ఏ దేవుడైనా సాయం చేసి తన భర్త ప్రాణాలు కాపాడకపోతాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. నా కొడుకును బతికించండి నా కుమారుడికి తలలో గడ్డ కట్టుకుపోయిన రక్తపు పొరలు తొలగించడానికి మరొక ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు రూ.5 లక్షలు దాకా ఖర్చు అవుతుందనీ, ఆపరేషన్ చేయిస్తే నా కొడుకు బతుకుతాడని చెబుతున్నారు. దాతలు గొప్ప మనస్సుతో ఆపన్న హస్తం అందిస్తే నా బిడ్డను బతికించుకుంటాను. – లక్ష్మీదేవి, అనిల్ అమ్మ పసుపుకుంకుమ నిలబెట్టండి మా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా భర్తను బెంగళూరుకు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించలేకపోతున్నాం. కనీసం రోజూ వారి మందులు ఇప్పించలేని దుస్థితిలో ఉన్నా. పుస్తెల తాళ్లమ్ముకున్నా..డబ్బు సరిపోక పస్తులుంటున్నాం. మా ఆయనకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక్కపూట కూడా సంతృప్తిగా భోజనం చేసింది లేదు. దాతలు, ప్రభుత్వం ముందుకు వచ్చి సాయం చేస్తే నా పసుపు కుంకుమ నిలబెట్టుకుంటా. – రోజా, అనిల్‌కుమార్ భార్య కరుణ చూపని టీడీపీ సర్కార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనిల్‌కుమార్ కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నా.. అప్పటి ప్రభుత్వం కరుణ చూపలేదు. ప్రమాదంలో మెదడు, వెన్నెముక దెబ్బ తిన్న తన భర్తను ఆదుకోవాలని అనిల్ భార్య రోజా పూర్తి ఆధారాలతో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నా.. ఒక్కరూ స్పందించలేదు. సాయం చేయాలనుకునే వారు పేరు: బాలప్పగారి రోజా అకౌంట్ నం: 31292200103546 ఐఎఫ్ఎస్సీ కోడ్: SYNB0003129 సిండికేట్ బ్యాంకు,విడపనకల్లు.సెల్: 8186018112 -
మృత్యువు కబళిస్తోంది!
బి.కొత్తకోట : మండలంలోని బీరంగికి చెందిన విద్యార్థి కాలేయవ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కాలేయమార్పిడి చేయాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించడంతో ఆ నిరుపేద విద్యార్థి ప్రాణం నిలిపే దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. వివరాలు.. బీరంగికి చెందిన గాజుల రమేష్‌కు ముగ్గురు సంతానం. వారిలో గాజుల గణేష్ (14) బీరంగికి సమీపంలోని శంకరాపురం జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. రమేష్‌కు వర్షాధారంతో పండే ఎకరా పొలం ఉంది. రోజూ కూలీకి వెళ్తే వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఐదేళ్లుగా గణేష్ కడుపు, కాళ్లకు వాపులు వస్తుంటే మదనపల్లె, తిరుపతి ఆస్పత్రుల్లో చూపించాడు. తగ్గినట్లే వాపులు తగ్గి మళ్లీ అదే సమస్య తిరగబెడుతుండడంతో గణేష్ ఇబ్బంది పడుతుండేవాడు. వైద్యుల సలహా మేరకు ఇటీవలే హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి గణేష్‌కు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో గణేష్ కాలేయం పూర్తిగా పాడైనట్టు నిర్థారించారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయిం చుకోవాలని అక్కడి వైద్యులు సూచించారు. రమేష్ నుంచి 40శాతం కాలేయం స్వీకరించి గణేష్‌కు అమర్చుతామని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఈ చికిత్సకోసం రూ.25లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో రమేష్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. కుటుంబ పోషణే కష్టంగా మారిన తరుణంలో గణేష్‌కు చికిత్స నిమిత్తం ఇప్పటికే తలకు మించి అప్పులు చేశాడు. కళ్లముందే అనారోగ్యంతో రోజు..రోజుకూ నీరసించిన బిడ్డ దుస్థితి చూసి కుంగిపోతున్నారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో గణేష్ ఆస్పత్రుల వెంట తిరుగుతున్నాడు. ఇప్పుడు కాలేయమార్పిడి ఆర్థికస్థోమత లేకపోవడంతో తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని రాజాంకు చెందిన పతివాడ అనసూయ దాతలను వేడుకుంటోంది. తమది పేద కుటుంబం అని.. జబ్బుతో బాధపడుతున్న భర్త సురేష్‌కు వైద్యం చేయించలేని దీన స్థితిలో ఉన్నామని వాపోతోంది. శుక్రవారం ఆమెను సాక్షిని ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన పతివాడ సురేష్ పొట్టకూటి కోసం భార్య అనసూయ, ఇద్దరు కుమార్తెలతో నెల్లూరు జిల్లాకు వలస వెళ్లాడు. అక్కడ ఓ రైస్‌మిల్లులో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాజరాజేశ్వరిదేవి పండగ కోసం అని గత నెల 23న సొంతూరు రాజాం వచ్చారు. 24న సురేష్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. జ్వరమే కదా అని సమీపంలో ఉన్న ఓ ఆర్ఎంపీకి చూపిం చారు. ఆ ఆర్ఎంపీ ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే ఆ ఇంజక్షన్ వికటించడంతో సురేష్ శరీరమంతా విష పూరితం అయినట్టు తయారైంది. దీంతో వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో రెండు చోట్ల శస్త్రచికిత్సలు చేశారు. అక్కడితో ఆ జబ్బు నయం కాలేదు. దీంతో ఆ ఆస్పత్రి వైద్యులు వైజాగ్ తీసుకెళ్లిపోవాలని సూచించారు. చేసేది లేక అనసూయ భర్తను వైజాగ్‌లోని ద్వారకానగర్‌లో గల కళా ఆస్పత్రిలో చేర్పించింది. ఇక్కడి వైద్యులు సురేష్‌ని పరిశీలించి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. కొంచెం కష్టమేనని చెప్పి విషపూరితం అధికంగా ఉన్న శరీరంలోని ఓ ప్రాంతానికి శస్త్ర చికిత్స చేశారు. అయితే శరీరమంతా విషం వ్యాపించడంతో మరో రెం డు, మూడు సర్జరీలు పడతాయని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె సాక్షిని ఆశ్రయించింది. కూలి పని చేసుకుని బతుకు సాగిస్తు న్న తమ కుటుంబానికి ఆపద వచ్చి పడిందని.. ఇప్పటికే తమ వద్ద ఉన్న డబ్బులు, బంధువుల సాయంతో ఆపరేషన్లు చేయించామని చెప్పుకొచ్చింది. ఇకపై ఆపరేషన్లు చేసే స్థోమత లేదని..తన వద్ద డబ్బులు లేవని వాపోయింది. దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని..ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నానని, తన భర్తకు ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంది. ఆర్థిక సాయం చేసే దాతలు 96035 32410, 96662 58284 నంబర్లలో సంప్రదించాలని లేదా కళా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త సురేష్‌ను లేదా తనను సంప్రదించవచ్చని అనసూయ వేడుకుంటోంది. -
జీవిత చక్రం తిరగబడింది!
జీవితం.. కష్ట సుఖాల కలయిక సాగిపోయినంత వరకూ సాఫీనే.. ఆగిపోతే బండికాదు..మొండి కుటుంబం ఒడిదుడుకులు లేకుండా నడిచిందంటే.. జీవితం బాగుందంటే దానికో అర్థం..అవయవయాలన్నీ సక్రమంగా ఉంటే అందం.. ఆనందం అన్నీ సమ‘పాల’లా కలిసుంటే ఆరోగ్యం.. అదే మహాభాగ్యం..ఆయుష్షు బాగుంటే.. ప్రయాణం ప్రశాంతం అంటాం..లేదంటే ‘విధి’ అంటాం.. అదీ కాదంటే ‘కర్మ’ అనుకుంటాం. ఆ కుటుంబ దయనీయ గాథ ఇలాంటిదే..చిన్న కుటుంబం.. చింతలేదనుకున్నారు. అప్పుడే కష్టాల కడలి వారింటి తలుపు తట్టింది..కిడ్నీ వ్యాధి రూపంలో కీడుతలపెట్టింది.. దయలేని దారిద్య్రంపట్టి పీడిస్తోంది. మానవత్వం మనిషి రూపంలో ఉంటుందనే ఒకే ఒక్క ఆశ..రేపటి నవోదయం దిశగానిరుపేద కళ్లు నిరీక్షిస్తున్నాయి. అనంతపురం, వజ్రకరూరు: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కార్పెంటర్ దంపతులు చికిత్స, కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వజ్రకరూరు మండలం గంజికుంటకు చెందిన అంగడి షేక్ దాదాపీర్ కార్పెంటర్. ఇతనికి 2009 సంవత్సరంలో గుంతకల్లు పట్టణానికి చెందిన సహేరాబానుతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు మహమ్మద్ నజీబ్ రెండో తరగతి, కుమార్తె సనాకౌసర్ ఎల్కేజీ చదువుతున్నారు. దాదాపీర్‌కు పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంది. ఈ విషయం రెండేళ్ల కిందట బయటపడింది. కిడ్నీ వద్ద నొప్పిగా ఉండటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్స కోసం దాదాపు రూ.3లక్షల దాకా ఖర్చయ్యింది. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులో చేరాడు. వైద్య పరీక్షల్లో కిడ్నీ ఫెయిలైనట్లు తేలింది. ట్రాన్స్‌ప్లాంటేషన్ (కిడ్నీ మార్పిడి) చేయాలని వైద్యులు స్పష్టం చేశారు. భర్తకు కిడ్నీ దానం చేసిన భార్య దాదాపీర్‌కు అన్న, నలుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. వీరిలో ఎవరివీ సరిపోకపోవడంతో చివరకు భార్య తన రెండు కిడ్నీల్లో ఒకదానిని భర్తకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 2016 జూలైలో ప్రభుత్వ నిబంధనల మేరకు భార్య కిడ్నీని భర్తకు అమర్చారు. చికిత్స కోసం రూ.19 లక్షల దాకా అప్పు చేశారు. ఈ అప్పు తీర్చడానికి నాలుగు ఎకరాల భూమిని అమ్మితే రూ.15 లక్షలు వచ్చింది. ఆర్డీటీ సంస్థ రూ.రెండు లక్షల ఆర్థిక సాయం అందచేసింది. ప్రస్తుతం భార్యాభర్తలు బరువైన పనులు చేయలేని పరిస్థితి. ఇంటి పట్టునే ఉంటున్నారు. వీరిద్దరికీ ప్రతి నెలా వైద్య పరీక్షలు, దాదాపీర్‌కు మందులు కొనడానికి రూ.15 వేల దాకా ఖర్చు వస్తోంది. బతుకు భారం.. కార్పెంటర్ దంపతులకు ఆరోగ్యం సహకరించకపోవడంతో సంపాదించలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోక కార్పెంటర్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. తమ దీన పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకుపోయినా పింఛన్ కానీ, పక్కా గృహం కానీ మంజూరు చేయలేదు. పాత ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, దయార్ద్ర హృదయులు మానవతా దృక్పథంతో ఆలోచించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కష్టం ఎవరికీ రాకూడదు ఇలాంటి కష్టం ఏ ఒక్కరికీ రాకూడదు. కిడ్నీ సమస్య కారణంగా ఉన్న భూమిని అమ్ముకుని అప్పులు చెల్లించా. మందులు కొనడానికి ప్రతినెలా రూ. 15 వేలు ఖర్చు అవుతోంది. పని చేద్దామన్నా ఆరోగ్యం సహకరించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. కనీసం పింఛన్ కూడా మంజూరు చేయలేదు.– అంగడి దాదాపీర్, సహేరాబాను ఆర్థికసాయం చేయదలిస్తే.. పేరు : షేక్ దాదాపీర్ అకౌంట్ నంబర్ : 31643093766 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వజ్రకరూరు ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐఎన్0002804 సెల్ నంబర్ : 90140 32275, 91770 45452 -
సేవాగుణం.. 'వంశీ'మోహనం
రసూల్‌పురా : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారి రక్తం అందక తన కళ్ల ముందే చనిపోవడం అతడిన మనసును కలచివేసింది. దీంతో చావుబతుకుల్లోఉన్నవారికి రక్తదానంతో ప్రాణం పోయాలనే నిశ్చయంతో ఓ యువకుడు నడుం కట్టాడు. అతడి సేవాతత్పరతకు ముగ్గురు స్నేహితులు కూడాజతకూడారు. రక్తందానం చేసే వారి వివరాలతో బ్లడ్ డోనర్స్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ప్రాంతం ఎక్కడైనా డోనర్స్‌తో సకాలంలో రక్తం అందించి పలువురి ప్రాణాలను కాపాడుతున్నారు. అంతేకాకుండా రైల్వేస్టేషన్లు,బస్స్టేషన్లు రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై ఉండే అనాథలకు, వీధి బాలలకు, వృద్ధులకు కడుపునిండా అన్నం పెడుతున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉంటున్నమతిస్థిమితం లేనివాళ్లకు స్వయంగా కటింగ్, షేవింగ్, స్నానాలు తామే స్వయంగా చేస్తున్నారు. గాయాలకు ఆయింట్మెంట్ రాస్తున్నారు. మందులను అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు బోయిన్‌పల్లికి చెందిన ఆర్యవంశీ, అతని స్నేహితులు. రక్తదానం, అనాథలకు సేవ చేయాలనే ఆలోచన ఎందుకువచ్చిందనే విషయంపై ఆర్యవంశీ ఇలా వివరించాడు. నా కళ్లెదుటే ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో రక్తం అందక అసువులు బాసింది. ఈ ఘటన నాలో ఓ ఆలోచన కలిగించింది. ప్రార్థించే పెదవులకన్నా.. సాయం చేసే చేతుల మిన్న మదర్ థెరిస్సా సూక్తిని ఆదర్శంగా తీసుకుని నా ఆలోచనకు ఆచరణలో పెట్టాను. ప్రతిరూపంగా బ్లడ్‌డోనర్స్ వాట్సప్ గ్రూప్ సృషించి రక్తదానం చేసే వారి ఫోన్ నంబర్లను సేకరించాను. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందజేస్తున్నాం. పూట గడవని కుటుంబాలకు బుస సుమ, భాస్కర్, అల్లాడి గంగ, చాణక్య దాతల సహాయంతో సరుకులు, బియ్యం అందజేస్తున్నాం. బోయిన్‌పల్లిలోని తారా ఫౌండేషన్, మంచి కలలు అనాథ సంస్థల్లో ఉంటున్న వారికి భోజనం, క్షుర సేవలు అందజేస్తున్నాం. స్నేహితురాలు రేణుక, ఉప్పుగూడకు చెందిన శ్రీకాంత్, నల్లగుట్టకు చెందిన శ్రవణ్‌లు అండగా ఉంటున్నారు. వీరే కాకుండా వైఎస్సార్ సీపీ నాయకులు సుఖేందర్‌రెడ్డి సర్వ్ నీడి గౌతమ్, సర్కార్ ఫౌండేషన్ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ అనాథ వృద్ధురాలు దారి తప్పి నగరానికి చేరుకోవడంతో ఆమెను అనాథాశ్రమంలో చేర్పించాం. ఇప్పటివరకు 5వందల మందికిపైగా రక్తం అందించాం. రక్తం అవసరం ఉన్నవారు వాట్సప్ నంబర్ 87127 34487, 63003 72886లను సంప్రదించవచ్చు -
వెన్ను తడితే.. బంగారు భవితే!
ప్రతిభకు పేదరికం అడ్డుకాలేదు. పుట్టెడు పేదరికాన్ని జయించి టెన్త్‌లో ఉత్తమ విజేతలుగా నిలిచారు. రెక్కలు ముక్కలు చేసుకుని బతుకీడ్చే కుటుంబాల్లో పుట్టిన ఈ చిన్నారులు ఎన్నో కష్టాలు చుట్టుముట్టినా ఏమాత్రం వెరవకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారు. ఒకవైపు అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, సెక్యురిటీ గార్డులుగా బతుకుబండి నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పనిలో ఆసరా అవుతూనే.. మరోవైపు చదువులోనూ రాణిస్తున్నారు. సర్కారు బడులను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నిలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన పేదింటి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజ యాలు సాధించాలంటే వీరి తల్లిదండ్రుల శ్రమ ఒక్కటే సరిపోదు. సమాజం కూడా అండగా నిలవాలి. వారి చదువులకు తమవంతు తోడ్పాటును అందించినప్పుడే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు. మానవతావాదులు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించి, వారి వెన్ను తట్టినప్పుడే ఇది సాధ్యం. – సాక్షి, సిటీబ్యూరో సెక్యురిటీ గార్డ్ కుమారుడు టాపర్.. తల్లితో నీలకంఠం శేరిలింగంపల్లి: పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహకల్పకు చెందిన శివన్న నాయుడు (సెక్యూరిటీ గార్డ్), దమయంతి దంపతుల కుమారుడు నీలకంఠం 9.2 సాధించి శేరిలింగంపల్లి హైస్కూల్ టాపర్ టాపర్‌గా నిలిచాడు. తాను భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవుతానని నీలకంఠం చెబుతున్నాడు. ఇప్పటికే పాలిటెక్నిక్‌లో సీటు వచ్చిందని, దాతలు ప్రోత్సహిస్తే మరింత ముందుకు సాగుతానంటున్నాడు. దాతలు.. 9573398513 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. పుట్టెడు దుఃఖంలోనూ.. తండ్రి రాములుతో రష్మిత ఎల్బీనగర్: తండ్రి ప్రైవేటు ఉద్యోగి. మంచాన పడిన తల్లి. వీరి కూతురు రష్మిత పట్టుదలతో కష్టపడి 10వ తరగతిలో 9.8 జీపీఏ సాధించింది. తల్లి సుజాత మరణించిన 15 రోజులకే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఓ వైపు తల్లి లేని బాధ, మరోవైపు పరీక్షలు. అయినా మొక్కవోని దీక్షతో పరీక్ష రాసింది. 9.8 జీపీఏ సాధించింది. తండ్రి రాములు ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులో చాలీచాలని జీతంతో బతుకుబండి లాగుతున్నాడు. వనస్థలిపురంలో నివాసముంటున్న వీరి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే పైచదువులు చదువుతానని రష్మిత చెబుతోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 94410 66370 విజయ ప్రసాదం.. తల్లిదండ్రులతో పూర్ణకంటి ప్రసాద్ ఆల్విన్‌కాలనీ: జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్స్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్ణకంటి ప్రసాద్ పదో తరగతి ఫలితాల్లో 9.5 జీపీఏ గ్రేడింగ్ సాధించాడు. బాలరామ్, కురువమ్మ దంపతుల కుమారుడు ప్రసాద్ పేదరికంలోనూ పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్‌లో విజయం సాధించాడు. తండ్రి బాలరామ్ కార్పెంటర్‌గా జీవనం కొనసాగిస్తుంటాడు. ఉన్నత చదువులు చదివి ఇంజనీరింగ్‌లో రాణించాలని ప్రసాద్ లక్ష్యంగా ఎంచుకున్నాడు. దాతలు ఎవరైనా ఆదుకొంటే ఉన్నతవిద్య చదువుతానని ప్రసాద్ చెబుతున్నాడు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్: 96528 70380 రాళ్లు కొట్టే ఇంట రతనాల బిడ్డ తల్లిదండ్రులతో షేక్ సకినాబీ ఘట్‌కేసర్‌టౌన్: ఘట్కేసర్ జెడ్పీ బాలికల పాఠశాలలో చదివిన షేక్ సకినాబీ 2017– 2018 విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీలో మండల టాపర్‌గా నిలిచింది. షేక్ సకీనాబీ తల్లితండ్రులు షేక్ ఇమాం, లాల్‌బీ రాళ్లు కొట్టుకుని జీవించే కుటుంబం. తమ కూతురు 9.5 పాయింట్లతో మండల టాపర్‌గా రావడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పేదలు తమ కూతురిని పై చదువులు ఎలా చదివించాలో అర్థం కావడం లేదు. దాతలు ముందుకొచ్చి చేయూతనిస్తే ఉన్నత చదువులు చదువుతానని విద్యార్థిని షేక్ సకినాబీ చెబుతోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 90101 55941 ప్లంబర్ కూతురు బంపర్.. తల్లిదండ్రులతో అఫ్రీన్ శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలోని నెహ్రూనగర్ బస్తీలో నివాసం ఉండే ఎస్డీ సలీమ్ (ప్లంబర్), రజియా దంపతుల పెద్ద కుమార్తె అఫ్రీన్. టెన్త్‌లో 9.2 సాధించి టాపర్‌గా నిలిచింది. సలీమ్ ప్లంబర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న శేరిలింగంపల్లి హైస్కూల్లో చదివిస్తున్నాడు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు చెల్లించే స్థోమత లేక గవర్నమెంట్ స్కూల్ చేర్పించినట్లు తెలిపారు. బైపీసీ పూర్తి చేసి డాక్టర్‌ను కావాలని ఉన్నా ఆర్థి«క పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదని ఎంఈసీ చేయాలనుకుంటున్నానని అఫ్రీన్ చెబుతోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 99122 55986 ఈ రాజేశ్వరి.. విజయేశ్వరి.. రాజేశ్వరి సుభాష్‌నగర్: సూరారం జిల్లా పరిషత్ పాఠశాలలో టి.రాజేశ్వరి 9.7 జీపీఏ సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సూరారం పారిశ్రామికవాడలో నివాసం ఉంటున్న రాజేశ్వరి తండ్రి విన్నారావు ఓ పరిశ్రమలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. తల్లి భూలక్ష్మి రోజువారీ కూలి. భవిష్యత్తులో తనకు ప్రొఫెసర్ కావడమే లక్ష్యమని రాజేశ్వరి పేర్కొంటోంది. దాతలు తనను ఆదుకుకునేందుకు ముందుకు వస్తే రాణిస్తానని చెబుతోంది. ఆర్థిక సాయం అందించేవారు సంప్రదించాల్సిన ఫోన్: 95020 53302 పేదింట్లో పుట్టినా.. వంశీకృష్ణ వనస్థలిపురం: పేదింటిలో పుట్టినా.. ప్రభుత్వ పాఠశాలలో చదివినా.. ఆ విద్యార్థి పట్టుదలతో ఎస్సెస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 9.7 గ్రేడ్‌తో ప్రథమ స్థానంలో నిలిచాడు ఎల్బీనగర్ ఎన్టీఆర్నగర్కు చెందిన పబ్బ రాంమోహన్, సంధ్యారాణిల కుమారుడు వంశీకృష్ణ. వనస్థలిపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన వంశీ మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి రాంమోహన్ బిగ్‌బజార్ గోదాములో వర్కర్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. వీరి ఆర్థిక స్థోమత అంతంత మాత్రం కావడంతో వంశీకృష్ణ విద్యాభ్యాసానికి దాతలు సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్: 95423 01731 -
పరిమళించిన మానవత్వం
పోరుమామిళ్ల: మానవత్వం పరిమళించింది.. ఇద్దరు యువకులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం పలువురిని కదిలించింది.. వారు అనాథ వృద్ధున్ని ఆశ్రమంలో చేర్చారు.. అయితే ఆయనను విధి చిన్నచూపు చూడటంతో సంఘటన మరో మలుపు తిరిగింది.. ఆ గడియల్లోనే మృతి చెందిన వృద్ధునికి వారు అన్నీ తామే అయి అంత్యక్రియలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఆ యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పూర్’ జిల్లా ఇన్చార్జి, పోరుమామిళ్లకు చెందిన రామకృష్ణారెడ్డి ఒకరు కాగా, ఆయన మిత్రుడు సుభాన్‌బాషా మరొకరు. ఇంట్లో ఆదరించే దిక్కు లేక: ప్రొద్దుటూరు మండలం బుడ్డాయపల్లెకు చెందిన రామయ్య(70) ఇంట్లో ఆదరించే దిక్కులేక అనాథగా బజారున పడ్డాడు. పోరుమామిళ్లకు చేరిన ఆయన అనారోగ్యంతో స్థానిక 30 పడకల ఆసుపత్రిలో ఆదివారం చేరాడు. చికిత్స చేసిన సిబ్బంది వృద్ధుడి వివరాలు తెలుసుకొని ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పూర్’ జిల్లా ఇన్చార్జి రామకృష్ణారెడ్డికి సమాచారం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు ఫాదర్ సర్వేశ్వరరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మిత్రుడు సుభాన్‌బాషా సహకారంతో ఆటోలో బాలమ్మ సత్రం వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ ఆటో నుంచి దింపి, ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. అంత వరకు బాగానే వుంది. బాగా మాట్లాడుతున్న వృద్ధుడు, అక్కడ మంచినీరు తాగాక వీల్ కుర్చీలో కూర్చొని సేద తీరుతున్న సమయంలోనే ఊపిరి ఆగిపోయింది. తాము చేసిన కృషితో ఆశ్రమంలో ఆశ్రయం దొరికిందని ఆనందిస్తున్న ఇద్దరు యువకులకు వృద్ధుని హఠాన్మరణం ఆవేదన కలిగించింది. ఫాదర్ సర్వేశ్వరరెడ్డితో మాట్లాడి వారే ఆశ్రమ సమీపంలో గొయ్యి తీసి, సంప్రదాయ పద్ధతిలో అన్నీ తామే అయి, ఆశ్రమ సిస్టర్ సహాయంతో వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబానికి దూరమయి, అనాథగా వున్న ఆయనకు సంబంధంలేని యువకులు మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించడం అందరికీ మార్గదర్శకం.