కళా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త సురేష్‌తో అనసూయ, ఆమె పిల్లలు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని రాజాంకు చెందిన పతివాడ అనసూయ దాతలను వేడుకుంటోంది. తమది పేద కుటుంబం అని.. జబ్బుతో బాధపడుతున్న భర్త సురేష్‌కు వైద్యం చేయించలేని దీన స్థితిలో ఉన్నామని వాపోతోంది. శుక్రవారం ఆమెను సాక్షిని ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన పతివాడ సురేష్ పొట్టకూటి కోసం భార్య అనసూయ, ఇద్దరు కుమార్తెలతో నెల్లూరు జిల్లాకు వలస వెళ్లాడు. అక్కడ ఓ రైస్‌మిల్లులో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాజరాజేశ్వరిదేవి పండగ కోసం అని గత నెల 23న సొంతూరు రాజాం వచ్చారు. 24న సురేష్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. జ్వరమే కదా అని సమీపంలో ఉన్న ఓ ఆర్‌ఎంపీకి చూపిం చారు. ఆ ఆర్‌ఎంపీ ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే ఆ ఇంజక్షన్ వికటించడంతో సురేష్ శరీరమంతా విష పూరితం అయినట్టు తయారైంది.
దీంతో వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో రెండు చోట్ల శస్త్రచికిత్సలు చేశారు. అక్కడితో ఆ జబ్బు నయం కాలేదు. దీంతో ఆ ఆస్పత్రి వైద్యులు వైజాగ్ తీసుకెళ్లిపోవాలని సూచించారు. చేసేది లేక అనసూయ భర్తను వైజాగ్‌లోని ద్వారకానగర్‌లో గల కళా ఆస్పత్రిలో చేర్పించింది. ఇక్కడి వైద్యులు సురేష్‌ని పరిశీలించి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. కొంచెం కష్టమేనని చెప్పి విషపూరితం అధికంగా ఉన్న శరీరంలోని ఓ ప్రాంతానికి శస్త్ర చికిత్స చేశారు. అయితే శరీరమంతా విషం వ్యాపించడంతో మరో రెం డు, మూడు సర్జరీలు పడతాయని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె సాక్షిని ఆశ్రయించింది. కూలి పని చేసుకుని బతుకు సాగిస్తు న్న తమ కుటుంబానికి ఆపద వచ్చి పడిందని.. ఇప్పటికే తమ వద్ద ఉన్న డబ్బులు, బంధువుల సాయంతో ఆపరేషన్లు చేయించామని చెప్పుకొచ్చింది. ఇకపై ఆపరేషన్లు చేసే స్థోమత లేదని..తన వద్ద డబ్బులు లేవని వాపోయింది. దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని..ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నానని, తన భర్తకు ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంది.
ఆర్థిక సాయం చేసే దాతలు 96035 32410, 96662 58284 నంబర్లలో సంప్రదించాలని లేదా కళా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త సురేష్‌ను లేదా తనను సంప్రదించవచ్చని అనసూయ వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment