అది కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ దేశం విలవిల్లాడుతున్న కాలం.. అటు కరోనా దాడి, ఇటు దాని కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో ఉపాధికి దెబ్బపడింది.. ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. రాష్ట్రాల ఆర్థిక నిర్వహణే గాడితప్పిన దుస్థితి.. ఆపన్నహస్తం కోసం ఎందరో అభాగ్యులు ఎదురుచూస్తున్న వేళ భారతీయులలోని మానవత్వం పరిమళించింది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడాలన్న గురజాడ సూక్తిని ఆచరించి చూపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య ఏకంగా రూ. 23,700 కోట్లను సమాజంలోని వివిధ వర్గాలకు విరాళంగా అందించినట్టు తాజా అధ్యయనంలో తేలింది. దానగుణంలో దిగువ, మధ్యతరగతి జనం ముందు వరుసలో నిలిస్తే.. ధనిక వర్గం అంతంతే విదిలించినట్టు తేలింది. కరోనా సమయంలో మన దేశంలో, విదేశాల్లో దానధర్మాల తీరు ఎలా ఉంది? భూమ్మీద చేతికి ఎముక లేనట్టుగా దానాలు చేసే దేశాలు, వ్యక్తులు ఎవరు? లోభి పుంగవుల మాటేమిటి? వంటి వివరాలతో ప్రత్యేక కథనం.
దానం చేసే చేతికి మనసుండాలి.. మమతకు మానవత్వం తోడవ్వాలి.. మానవ సేవే మాధవ సేవ అన్నదీ బోధపడాలి. కరోనా కాలంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు దీన్ని అర్థం చేసుకుని.. తోటివారికి చేతనైనంత సాయం చేసి ఆదుకున్నారని అశోకా యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రపీ’ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ‘హౌ ఇండియా గివ్స్ 2020–2021’ పేరుతో చేపట్టిన అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
దాని ప్రకారం.. భారతీయులు 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య మొత్తంగా రూ.23,700కోట్లను విరాళాల రూపంలో అందించారు. ఇందులో అత్యధికంగా రూ.15,168 కోట్లను మత సంస్థలకు దానం చేశారు. మత సంస్థలను మినహాయిస్తే.. అత్యధికంగా డబ్బు లేదా ఇతర సాయం చేసింది అభాగ్యులకు, యాచకులకేనని అధ్యయనం వెల్లడించింది. వారికి రూ.2, 900 కోట్లను అందించినట్టు తెలిపింది. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను ఆదుకొనేందుకు మరో రూ.2 వేల కోట్లను అందించారని, ఇళ్లలో పనిచేసేవారికి రూ.1,000 కోట్లు అందించి పెద్దమనసు చాటుకున్నారని వివరించింది. కోవిడ్ రెండోసారి విజృంభించినప్పుడు ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్‌లకు ఇబ్బంది, వలస కూలీల కాలినడక వంటి సమయంలో మతేతర సంస్థలు అంటే పీఎం–కేర్స్, ఎన్జీవోలు, ట్రస్ట్‌లు లేదా ఆరోగ్య సిబ్బందికి చేసిన సాయం మొత్తం రూ.1,100 కోట్లు మాత్రమేనని పేర్కొంది.
మత సంస్థలకే అత్యధిక విరాళాలు
ఇక మొత్తంగా చూస్తే.. 70% కుటుంబాలు మత సంస్థలకు సాయం చేయగా, 12% కుటుంబాలు అభాగ్యులను ఆదుకున్నాయి. మరో 9% తమ దగ్గరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సా యం చేసినట్టు నివేదిక పేర్కొంది. ఇంట్లో పనిచేసేవారికి సాయం చేశామని చెప్పిన కుటుంబాలు 4%. మతాలకతీతంగా నిరాశ్రయులకు ఆశ్రయం, విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించే రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్, మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు ఎందరో భారతీయులు దానం చేయడం చెప్పుకోవాల్సిన విషయం.
పేదోడి పెద్ద మనసు
దానమిచ్చిన వారిలో అత్యధికం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల వారేనని అధ్యయనం తెలిపింది. ఏకంగా 52 శాతం మంది స్వల్పాదాయ వర్గాల కుటుంబాలు చేసిన దానమే మొత్తం సొమ్ములో 34 శాతం వరకు ఉండటం విశేషం. ఆదాయం ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో 22శాతం మంది మాత్రమే ఏదో ఒక రూపంలో సాయం చేసినట్టు అధ్యయనం తేల్చింది. వయసు రీత్యా చూస్తే 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు దాతల్లో ఎక్కువగా ఉన్నారు. దానం చేయాలా, వద్దా? ఒకవేళ చేస్తే ఏ రూపంలో అన్న కీలకమైన అంశాలపై నిర్ణయాలు పురుషులే తీసుకున్నట్టు వెల్లడైంది. వారు ఎక్కువగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మత సంస్థలకు దానమిచ్చేందుకు ఆసక్తి చూపారు. మహిళలు నిర్ణయాలు తీసుకున్న కుటుంబాల్లో సాయం ఎక్కువగా అభాగ్యులు/ యాచకులు, తమ ఇళ్లలో పనిచేసేవారికి అందింది. పట్టణ, నగర ప్రాంతాలతో (83 శాతం) పోలిస్తే పల్లె ప్రాంతాల్లో ఇతరులకు సాయం చేసినవారు స్వల్పంగా (88 శాతం) ఎక్కువ. ప్రాంతాల వారీగా చూస్తే.. ఉత్తర భారతంలో ఎక్కువ మంది (96 శాతం) ఆర్థిక సాయం చేశారు. తర్వాతి స్థానంలో ఈశాన్య భారతం (93 శాతం)నిలిచింది.
అధ్యయనం జరిగిందిలా..
అశోకా వర్సిటీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా దాదాç³# 81 వేల కుటుంబాలను ప్రశ్నించారు. మొత్తం 18 రాష్ట్రాల్లో రెండు దశల్లో సర్వే చేశారు. ఆరు నెలల్లో (అక్టోబర్ 2020–మార్చి 2021) మీరు ఎవరికైనా దానం చేశారా? ఒకవేళ చేసి ఉంటే ఎవరికి? ఎందుకు? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. రెండో దశ సర్వే 2021 అక్టోబర్‌లో జరిగింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలు, కుటుంబాలు ఏ రకంగా దా నాలు చేస్తున్నాయో తెలుసుకొనేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని.. సామాజిక, ఆర్థికస్థాయిలు, వయసు, స్త్రీ, పురుషుల్లో ఇతరులకు సాయం చేసే లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయని వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచ దేశాల్లో ఎందరో ఆపన్నులు
ప్రపంచవ్యాప్తంగా జరిగే దానాలపై చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ (సీఏఎఫ్) ఏటా ఒక అధ్యయనం నిర్వహిస్తుంది. 2021 లో ఈ సంస్థ సుమారు 115 దేశాల్లో సర్వే చేసి ఒక నివేదికను సిద్ధం చేసింది. అపరిచితులకు సాయం చేయడం, డబ్బు విరాళంగా ఇవ్వడం, ఇతరుల పనికోసం సమయం వెచి్చంచడం అనే మూడింటిని దానం లేదా సాయంగా నిర్ణయించి ఈ అధ్యయనం చేపట్టింది. అన్ని దేశాల్లోనూ అపరిచితులకు సాయం చేయడం ఎక్కువైందని నివేదిక తెలిపింది. దాదాపు 300 కోట్ల మంది డబ్బు దానం చేయగా, ప్రతి ఐదుగురిలో ఒకరు తమ సమయాన్ని వెచి్చంచినట్టు పేర్కొంది. డబ్బు రూపంలో విరాళమివ్వడం వంటి విషయాల్లో ఇండొనేíÙయా తొలిస్థానంలో నిలవగా.. అపరిచితులకు సాయం విషయంలో నైజీరియా అగ్రస్థానంలో నిలిచింది.
25 శాతం సంపద ఇచ్చేస్తామంటున్న స్టార్టప్ కింగ్‌లు!
తమ సంపదలో 25 శాతాన్ని దానధర్మాలకు కేటాయిస్తామని స్టార్టప్ కంపెనీలతో కోట్లు గడించిన నిఖిల్ కామత్, సుజిత్ కుమార్, అంకిత్ నాగోరిలు ఇటీవలే ప్రకటించారు. దీనికి అదనంగా విద్యా సంబంధ కార్యక్రమాల కోసం వారు భారీగా విరాళాలు సేకరించారు. ‘యంగ్ ఇండియన్ ఫిలాంథ్రొపిక్ ప్లెడ్జ్’ సంస్థ సభ్యులుగా వారు ఈ ప్రకటన చేశారు. ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్టార్టప్ జెరోదా, ట్రూబీకన్ కంపెనీల వ్యవస్థాపకుడిగా నిఖిల్ కామత్, ఉడాన్ వ్యవస్థాపకుడు సుజిత్ కుమార్, క్యూర్ ఫుడ్స్‌ను స్థాపించిన అంకిత్ నాగోరిలు ‘బిల్ అండ్ మెలిండా గేట్స్’ ఫౌండేషన్‌తో కలసి కర్ణాటకలోని హావేరి, తుముకూరు, యాద్గిర్, దావణగెరె జిల్లాల్లో సుమారు 105 పాఠశాలలు, వాటి పరిసరాల్లోని అంగన్‌వాడీల రూపురేఖలను మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేపట్టారు.
- కంచర్ల యాదగిరిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment