గణేష్‌తో తండ్రి రమేష్
బి.కొత్తకోట : మండలంలోని బీరంగికి చెందిన విద్యార్థి కాలేయవ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కాలేయమార్పిడి చేయాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించడంతో ఆ నిరుపేద విద్యార్థి ప్రాణం నిలిపే దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. వివరాలు..
బీరంగికి చెందిన గాజుల రమేష్‌కు ముగ్గురు సంతానం. వారిలో గాజుల గణేష్ (14) బీరంగికి సమీపంలోని శంకరాపురం జెడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. రమేష్‌కు వర్షాధారంతో పండే ఎకరా పొలం ఉంది. రోజూ కూలీకి వెళ్తే వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఐదేళ్లుగా గణేష్ కడుపు, కాళ్లకు వాపులు వస్తుంటే మదనపల్లె, తిరుపతి ఆస్పత్రుల్లో చూపించాడు. తగ్గినట్లే వాపులు తగ్గి మళ్లీ అదే సమస్య తిరగబెడుతుండడంతో గణేష్ ఇబ్బంది పడుతుండేవాడు. వైద్యుల సలహా మేరకు ఇటీవలే హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి గణేష్‌కు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో గణేష్ కాలేయం పూర్తిగా పాడైనట్టు నిర్థారించారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయిం చుకోవాలని అక్కడి వైద్యులు సూచించారు.
రమేష్ నుంచి 40శాతం కాలేయం స్వీకరించి గణేష్‌కు అమర్చుతామని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఈ చికిత్సకోసం రూ.25లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో రమేష్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. కుటుంబ పోషణే కష్టంగా మారిన తరుణంలో గణేష్‌కు చికిత్స నిమిత్తం ఇప్పటికే తలకు మించి అప్పులు చేశాడు. కళ్లముందే అనారోగ్యంతో రోజు..రోజుకూ నీరసించిన బిడ్డ దుస్థితి చూసి కుంగిపోతున్నారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో గణేష్ ఆస్పత్రుల వెంట తిరుగుతున్నాడు. ఇప్పుడు కాలేయమార్పిడి ఆర్థికస్థోమత లేకపోవడంతో తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment