Liver problems
-
సగం గుండెతో జన్మించిన చిన్నారి.. పుట్టిన నాలుగో రోజు నుంచే మూడు ఓపెన్ సర్జరీలు
న్యూయార్క్: అమెరికాలో ఐదేళ్ల చిన్నారి అరుదైన వ్యాధితో పోరాడుతోంది. ఆ చిన్నారి పుట్టుకతోనే సగం గుండెతో జన్మించింది. ఆ చిట్టితల్లి పేరు కేథరీన్ లాంగే. ఆమె హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్‌తో జన్మించింది. ఈ గుండె లోపం కారణంగా ఆ చిన్నారికి గుండె ఎడమ భాగం అభివృద్ధి చెందదు. పాపం ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ఆమెకు నయమవుతుందేమోనన్న ఆశతో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అరుదైన వ్యాధిని ఆ చిన్నారి తల్లి 20 వారాల గర్భవతిగా ఉన్నప్పుడే గుర్తించారు వైద్యులు. ఈ విషయాన్ని వైద్యులు ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు కూడా. పైగా మెక్సికోలో ఈ అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స చేసే వైద్యులు కూడా లేరని కొలరాడోకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఆ చిన్నారి పుట్టిన నాలుగు రోజునే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత నాలుగు నెలల వయసులో మరోకటి, రెండున్నర ఏళ్లలో మరొక ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అంతేకాదు ఆ చిన్నారికి దాదాపు 10 హార్ట్ కాథెటరైజేషన్లు(గుండె కొట్టుకునేలా చేసే డివైజ్‌లు) జరిగాయి. కేవలం గత 12 నెలల్లో 40 సార్లుకు పైగా రక్తం తీశారు. ఇప్పడూ 11వ హార్ట్ కాథెటరైజేషన్ ప్రక్రియకు సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి గుండె జబ్బుతో పాటు, లివర్ లీకేజ్‌తో బాధపడుతోంది. దీన్ని ప్రోటీన్ లాసింగ్ ఎంట్రోపతి అని పిలుస్తారు. ఐతే ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ఆ చిన్నారి బతుకుందనే ఆశతో ఉన్నారు. ఒకవేళ వైద్యుల ప్రయత్నాలు విఫలమైతే ప్రత్యక్ష గుండె మార్పిడి చేయాల్సి ఉంటుందని అన్నారు. (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం.. మంటల్లో సైతం ఎగిరి..) -
తాగకపోయినా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ బాధితులు
సాక్షి, హైదరాబాద్: ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేకున్నా, ఫ్యాటీ లివర్ బాధితులు పెరుగుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి తమ రూరల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, క్లినికల్ డేటాల విశ్లేషణ ద్వారా నిర్వహించిన అధ్యయనం ఫలితాలను వివరించింది. ప్రతి 10మందిలో నలుగురికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది. అంతర్జాతీయ నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ (నాష్) దినాన్ని పురస్కరించుకుని ఈ అధ్యయన వివరాలను ఏఐజీ ఆసుపత్రి గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆసుపత్రి ఛైర్మన్, డైరెక్టర్ డా.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ శారీరక శ్రమ లేని జీవనశైలి, అపసవ్య ఆహారపు అలవాట్ల వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి మన దేశంలో విస్తరిస్తోందన్నారు. అయితే ఎక్కువ లక్షణాలు లేకపోవడం వల్ల అనుకోకుండా మాత్రమే ఇది బయటపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాము నిర్వహించిన పరీక్షల్లో 20శాతం మందికి గుర్తించామని, దీనితో పట్టణ ప్రాంతాల్లో డేటాను పోల్చి చూసినప్పుడు అదే స్థాయిలో సమస్య తీవ్రత ఉందని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాము ప్రత్యేకంగా ఫ్యాటీ లివర్ కేర్ విభాగాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి హెపటాలజీ డైరెక్టర్ డా.మిథున్ శర్మ ఎఐజీ ఆసుపత్రి ఒబెసిటీ, మెటబాలిక్ థెరపీ డైరెక్టర్ డా.రాకేష్ కలాపాల తదితరులు పాల్గొని మాట్లాడారు. (చదవండి: గుడ్‌న్యూస్: గెస్ట్ లెక్చరర్ల వేతనాలు.. గంటకు రూ. 90 పెంపు) -
తరుచూ బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ద్రాక్ష పండ్లు తింటున్నారా.. అయితే
కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం త్వరగా దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం ఇటీవల కాలంలో బాగా అలవాటైంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం కూడా వస్తుంది. దీనివల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది లివర్ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. లివర్ సిర్రోసిస్ కారణంగా, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. లివర్‌ను కాపాడే పదార్థాల విషయానికి వస్తే.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలు... ఎంతో రిలాక్స్ అవుతాం. కొన్ని రోజులుగా కాఫీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు కాఫీని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చారు. కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని తేలింది. కాబట్టి మోతాదు మించని కాఫీ, టీల వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కాఫీ, టీ అలవాటు లేకపోతే, కొత్తగా అలవాటు చేసుకోనవసరం లేదు. ఉదయమే గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. చదవండి: చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే.. ద్రాక్షలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని కాపాడతాయి. కాబట్టి తరచు ద్రాక్ష పండ్లు తినడం ఎంతో మంచిది. అలాగే వెల్లుల్లి. దీనిని వెల్ ఉల్లి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని హానికర విషాలు తొలగిపోతాయి. కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంపల్లో కాలేయ కణాల పునరుత్పత్తికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. రోజూ వీటిని డైట్లో చేర్చుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది. ఆపిల్స్ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాపిల్ తొక్క, లోపలి గుజ్జులోనూ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇంకా యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తినొచ్చు. శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. రోజూ ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి. క్యాబేజీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్లో భాగం చేసుకోవడం మరచిపోవద్దు. చదవండి: వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు? గుడ్ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ లివర్ని కాపాడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్లో ఎన్నో ఆరోగ్య గుణాలు దాగి ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పరిశోధనలలో తేలింది. -
చిట్టి తల్లికి పెద్ద కష్టం.. 5 నెలల పాపకు లివర్ ఇన్ఫెక్షన్
సాక్షి, కామారెడ్డి: పిల్లలు పుట్టారన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎక్కువ కాలం లేకుండా పోయింది. తొలి సొంతానంగా పుట్టిన కొడుకును వింత వ్యాధి పీడిస్తోంది. తర్వాత జన్మించిన కూతుర్ని అనారోగ్యం వేధిస్తోంది. తల్లి ఒడిలో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారికి పెద్ద కష్టం వచ్చి పడింది. అమ్మ పాలు తాగుతూ ఆడుకోవాల్సిన చిన్న వయస్సులోనే లివర్ ఇన్ఫెక్షన్ సోకింది. గతంలో రూ.7 లక్షలు అప్పు చేసి పాపకు ఆపరేషన్ చేయించారు తల్లిదండ్రులు. ప్రస్తుతం కాలేయ మార్పిడి కోసం రూ.25 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన శివలింగు సౌజన్య, నవీన్‌కు 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం కూతురు నిక్షిత పుట్టింది. మూడు నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్న పాప తర్వాత అనారోగ్యం బారిన పడింది. దీంతో వారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూయించారు. ఫలితం లేకపోవడంతో చివరికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపకు లివర్ ఇన్ఫెక్షన్ ఉందని పిత్తాశయం ట్యూబ్ ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో రూ.7లక్షలు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. నెల రోజులు బాగానే ఉన్నా తీవ్ర జ్వరం రావడంతో మళ్లీ హైదరాబాద్‌కు తీసుకెళ్లగా వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. పాపకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని సూచించారు. పాప ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆపరేషన్‌కు రూ.25లక్షలకు వరకు ఖర్చవుతుందని తెలపడంతో దంపతులు ప్రస్తుతం విలవిలలాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌజన్య టీటీసీ పూర్తి చేసి కొద్దిరోజులు ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పని చేసి బాబు పుట్టగానే ఇంటి పట్టునే ఉంటుంది. నవీన్ బీఈడీ చేసి ఉద్యోగం రాకపోవడంతో ఉన్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేదరికంలో ఉన్న తాము ఇప్పటికే అప్పులు చేసి చిన్నారికి ఆపరేషన్ చేయించామని.. ప్రస్తుతం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించడానికి దాతలు చేయూత అందించాలని కోరుతున్నారు. పాపకు లివర్ మారి్పడి కోసం తండ్రి నవీన్‌ను అన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం నవీన్ లివర్‌ను తన పాపకు మారి్పడి చేయడానికి ఆపరేషన్ అవసరం. మంచానికే పరిమితమైన కొడుకు ఐదేళ్ల క్రితం వీరికి జన్మించిన కొడుకు విలోహిత్ సైతం అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. బాబు పుట్టిన కొద్ది రోజులకే కదలిక, ఏడుపు లేకపోవడంతో చాలా ఆ్రస్పతులు చూపెట్టి లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకపోయింది. డౌన్ సిండ్రోమ్ వ్యాధి సోకడంతో రూ.ఐదు లక్షలకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆ బాబు మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిని తప్పా ఎవ్వరిని గుర్తుపట్టలేడు. ఫోన్ పే నంబర్: 9848793242 (సౌజన్య చెల్లి సంధ్యారాణి) బ్యాంక్ అకౌంట్ వివరాలు: శివలింగు సౌజన్య (పాప తల్లి) అకౌంట్ నంబర్: 49630100005080 ఐఎఫ్ఎస్సీ కోడ్: BARBOKAMARE ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు బోనకల్: ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సుగంధం మల్లికార్జునరావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను ఇంటర్ వరకు చదివించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పైచదువులకు వెళ్లలేదు. పెద్ద కుమారుడు వెంకటేష్ ఖమ్మంలోని ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కుటుంబానికి ఆపద వచ్చి పడింది. తీవ్ర జ్వరంతో వెంకటేష్ బాధ పడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు కిడ్నీలు పని చేయడం లేదని, అవి ఉండాల్సిన దాని కంటే చిన్నవిగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వెంకటేష్ తల్లిదండ్రులు 6 నెలలుగా అనేక ఆస్పత్రులల్లో రూ.2 లక్షలు వరకు ఖర్చు చేశారు. మూడు రోజులకోసారి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లి గవ్వలేక రెక్కాడితే గానీ డొక్కాడని తల్లిదండ్రులు అందినకాడికి అప్పులు చేసి వైద్యం చేయించారు. ప్రస్తుతం వెంకటేష్ మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో తల్లిదండ్రులు ఆపన్న హస్తంకోసం ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు 70322 13517 నంబర్‌ను సంప్రదించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. -
నిరుపేద చిన్నారి.. దాతల సాయం కోరి..!
బుడిబుడి అడుగుల చిన్నారికి పెద్ద జబ్బు చేసింది. తల్లిదండ్రులదేమో సామాన్య కుటుంబం. కానీ లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో చేసేది లేక అందిన కాడికి అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తూ.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చెన్నూర్: తమ చిన్నారిని కాపాడమని మహేందర్, లక్ష్మి దంపతులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. తలా కొంత సాయం చేసి తమను ఈ గండం నుంచి గట్టెక్కిస్తారని ఆశగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభం, శుభం తెలియని చిన్నారి అందరితో కలిసి ఆనందంగా ఆడుకునే అభం, శుభం తెలియని చిన్నారి ప్రాణాంతక కాలేయ వ్యాధితో బాధపడుతోంది. కన్నవారు అష్టకష్టాలు పడుతూ స్థోమతకు మించి అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూర్ పట్టణం బట్టిగూడెం కాలనీకి చెందిన మహేందర్, లక్ష్మిలకు ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి నవీన (3). రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వీరివి. మహేందర్ టాటాఏస్ డ్రైవర్‌గా పని చేస్తుండగా లక్ష్మి కూలీ చేసి బతుకు బండిని లాగుతున్నారు. ఇద్దరూ కష్టపడి పిల్లలను కంటికి రెప్పలా సాకుతున్నారు. కానీ పది రోజుల క్రితం నవీనకు జ్వరం వచ్చింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. నవీనకు డెంగీ లక్షణాలున్నాయని, కరీంనగర్‌కు తరలించాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన చిన్నారిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో చిన్నారిని హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు చిన్నారి నవీనకు పరీక్షలు నిర్వహించి గుండెలాగేలా... ఆ చిన్నారి డెంగీతో పాటు లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుందని, చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని తెలిపారు. గురువారం నుంచి చికిత్సకు రోజుకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చవుతోంది. ఇప్పటికే రూ. 4.80 లక్షలు ఖర్చయ్యాయని.. ఇన్నాళ్లూ ఎలాగోలా అప్పుచేసి నెట్టుకొచ్చామని, ప్రస్తుతం అప్పులిచ్చేవారు కూడా లేరని చిన్నారి తండ్రి మహేందర్ అంటున్నారు. దాతలు సాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు ఇప్పటికే చిన్నారి వైద్య ఖర్చులకు రూ. 5 లక్షలకు పైగా ఖర్చయింది. ఇంకా నాలుగు నుంచి రూ. 5 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. చిన్నారిని కాపాడుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు ఆత్రుత పడుతున్నారు. కానీ అంతంతమాత్రంగా ఉన్న వారి ఆర్థికస్థోమతను చూసి ఎలాగా అని భయపడుతున్నారు. ఆపన్నహస్తం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చిన్నారి నవీన వైద్య ఖర్చుల కోసం చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ అర్చనగిల్డా రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. నెన్నల కృష్ణ, అకౌంట్ నంబర్: 62297400611 ఐఎఫ్ఎస్సీ: SBIN0020128 స్టేట్‌బ్యాంక్, చెన్నూర్ బ్రాంచ్,గూగుల్‌పే: 8096384756 -
నంది వర్ధనం
కాకినాడ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు రూ.25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడానికి కరప వచ్చిన సీఎం జగన్‌కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పట్టణానికి చెందిన ఎం.నందిని కాలేయవ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోందని తెలియజేశారు. అప్పట్లో సానుకూలంగా జగన్ స్పందించారు. గత రెండు రోజులుగా నందిని పరిస్థితి విషమించడంతో నగర ఎమ్మెల్యే ద్వారంపూడి సీఎం జగన్మోహన్రెడ్డికి ఫోన్ ద్వారా తండ్రి వెంకటరమణ చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా హుటాహుటిన స్పందించి రూ.25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో యశోద ఆసుపత్రి వైద్యులు నందినికి గురువారం శస్త్రచికిత్స చేశారు. నందిని ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే ద్వారంపూడికి, సీఎం జగన్‌కు బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...
మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 200 కోట్ల మంది మద్యం తాగుతుంటారు. ప్రపంచంలోని మొత్తం జనాభాలో అంటే... 753.04 కోట్ల మందిలో ఇప్పుడు ఈ క్షణాన 0.7% మంది... అంటే దాదాపు 5 కోట్ల మంది మద్యం తాగుతూ ఉన్నారు. అంతగా మద్యం తాగుతూ ఉండటం వల్ల, దాని దుష్ప్రభావం వల్ల ప్రపంచ జనాభాలో ప్రతి 10 సెకండ్లకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. ఇంతగా మనుషులను చంపేస్తున్నా ఆల్కహాల్‌కు ఎందుకు బానిస అవుతారంటే అది తాగగానే మనకు అది ఇచ్చే ఆహ్లాద భావన. ఆ ఆహ్లాదభావనను అలాగే కొనసాగించడం కోసం. కానీ ఆ ఆహ్లాద భావనే ప్రధాన సైడ్‌ఎఫెక్ట్‌గా మారి మనను అనేక రకాలుగా దెబ్బతీస్తుంది. తాగినవారికి తాత్కాలికంగానే హుషారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం బేజారు. ఆల్కహాల్‌తో కలిగే అనర్థాల గురించి అవగాహన కోసమే ఈ కథనం. మనం ఏదైనా ఆహారం తీసుకుంటే అది కడుపులోకి వెళ్లాక జీర్ణమయ్యాక రక్తంలో కలుస్తుంది. కానీ ఆల్కహాల్ తాగగానే మన నోటిలోని మ్యూకస్ పొరల నుంచే నేరుగా రక్తంలో కలవడం మొదలైపోతుంది. కడుపులోకి చేరిన మద్యం కూడా జీర్ణం కాదు. కడుపులోంచి 20 శాతం, మిగతా 80 శాతం చిన్నపేగుల నుంచి రక్తంలో కలవడం మొదలవుతుంది. మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే... మనం ఆల్కహాల్ తాగినప్పుడు అది కేవలం సెకన్ల వ్యవధిలో మెదడుకు చేరడం మొదలవుతుంది. మద్యం తాగడం మొదలుపెట్టాక కేవలం ఆరు నిమిషాల్లో మెదడు కణాల్లోకి వెళ్తుంది. ఆ వెంటనే మన మెదడులోంచి డోపమైన్ అనే సంతోష రసాయనాలు బయటికి వస్తాయి. అవి మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. దాంతో ఒకరకమైన ఆనందం, ఆహ్లాదం, హాయిగా తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి. ఇలా ఆనందం, ఆహ్లాదం కలగడానికి ‘గామా అమైనో బ్యుటిరిక్ యాసిడ్’ (గాబా) అనే ఓ న్యూరోట్రాన్స్మిటర్ కారణం. గాబా అనేది ఒక అమైనోయాసిడ్. ఇది మన మెదడులోని సిగ్నల్స్‌కు అడ్డుకట్ట వేసి మెదడు పని చేసే వేగాన్ని తగ్గిస్తుంది. మనలోని ఇన్హిబిషన్లను తగ్గిస్తుంది. దాంతో ధైర్యం వచ్చిన భావన కలిగి, అంతకు ముందు విచక్షణతో ఆలోచించి, మనకు ప్రమాదకరమని అనిపించిన రిస్కీ పనులను సైతం తేలిగ్గా చేసేస్తుంటారు. దాంతో నిజానికి ఈ ఆనందాహ్లాదాలు, గాలితో తేలిపోవడాలు కలగడమే ఓ ప్రధాన సైడ్ఎఫెక్ట్ అన్నమాట. మద్యాలను పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారన్న విషయం తెలిసిందే కదా. ఇలా పులియబెట్టినప్పుడు ఈ ‘గాబా’ మరింత ఎక్కువగా తయారవుతుంది. మొదట ఆహ్లాదం కలిగించిన ఈ ‘గాబా’యే మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకుంటున్నవారిలో మూర్చవ్యాధి (సీజర్స్), మాట, నడకలపై నియంత్రణ కోల్పోయే సెరిబెల్లార్ డీజనరేషన్ డిసీజ్, యాంగై్జటీ, పానిక్ డిజార్డర్, డిప్రెషన్ వంటి అనేక మూడ్ డిజార్డర్స్కు కారణమవుతుంది. మద్యం తాగేవారి పిల్లలకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి వ్యాధులూ వచ్చే అవకాశం ఉంది. ఇక మద్యం ఏదైనప్పటికీ పులిసే క్రమంలో కొన్ని పదార్థాలు వెలువడతాయి. వాటిని ‘కంజీనర్స్’ అంటారు. ఆల్కహాల్ తాగినప్పుడు మనం ఒక పదార్థం తాలూకు అసలు రుచినీ, వాసననూ పసిగట్టలేం. రంగును గుర్తించలేం. ఈ కంజీనర్స్ అనేవి రంగు, రుచి, వాసనలతో పాటు ఇంకా అనేక అంశాలను పసిగట్టనివ్వని విధంగా ఫిల్టర్స్లా పనిచేస్తాయి. దాంతో మనం స్పృహలో ఉన్నప్పుడు ఏమాత్రం ఇష్టపడనివీ, మనకు హాని చేసే పదార్థాలనూ తాగినప్పుడు నిస్సంకోచంగా తీసుకుంటూ ఉంటాం. ఏయే మోతాదుల్లో ఏయే మార్పులు హుషారుగా ఉండటానికి చేసే మద్యపానంతో అనేక అనర్థాలు సంభవిస్తాయి. మద్యం తాగినప్పుడు మొదటి 20 ఎం.ఎల్. పరిమాణం మెదడులో కలిగించే రసాయన మార్పులు మరింత మద్యం తీసుకునేలా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే తొలి 20 ఎంఎల్.తో ఉద్వేగం, హుషారుగా అనిపించడం కాస్త దుడుకుతనం కలుగుతాయి. అదే హుషారును కొనసాగించడానికి వ్యక్తులు మద్యపానాన్ని కొనసాగిస్తారు. అయితే తొలుత చురుకుదనాన్ని కలిగించినట్లు అనిపించే అదే మద్యం కాస్తా 80 ఎం.ఎల్. మించగానే శరీరంలో కొన్ని మార్పులు కలిగిస్తుంది. అవి... తమపై తాము నియంత్రణ కోల్పోవడం, ఒళ్లు తూలడం, ఏకాగ్రత లేకపోవడం వంటి మార్పులకు కారణమవుతుంది. ఆ తర్వాత ఆ పరిమాణం 200 ఎం.ఎల్.కు చేరితే కోపం, చిరాకు, దెబ్బలాటకు దిగడం, అరవడం వంటి దుర్లక్షణాలు చోటు చేసుకుంటాయి. రోడ్‌రేజ్ వంటివి ఈ సమయంలోనే చోటు చేసుకుంటాయి. దెబ్బలాటలు ముదిరినప్పుడు అవి నేరాలకూ దారితీస్తాయి. బాగా మద్యం తీసుకొని ఉన్న సమయంలో వ్యక్తి జడ్జ్మెంట్ కోల్పోతాడు. దాంతో దాదాపు 90 శాతం నేరాలు, ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలకు మద్యమే కారణమవుతోంది. ఇక మద్యం ఒక వ్యసనంగా మారినప్పుడు ఒక వ్యక్తి ప్రమేయం లేకుండానే తాగడం మొదలుపెడతాడు. తీసుకోవాలనుకున్న మోతాదు దగ్గర తనను తాను నియంత్రించుకోలేడు. అందుకే మద్యం తాగడాన్ని ఒక వ్యాధిగానే డాక్టర్లు (మానసిక నిపుణులు) పరిగణిస్తారు. మొదటి చిన్న చిన్న మోతాదులకు, దాంతో వచ్చే ఆహ్లాద భావనలకు ఆకర్షితమై మొదలుపెట్టే ఈ సరదా... క్రమంగా పెరుగుతూ పోతుంది. అందుకే సరదాగా మద్యం తాగే అలవాటు ఉన్నవారు సైతం మొదట్లోనే దాన్ని వదిలేయడం చాలా మంచిది. ఒక దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించే ఈ అలవాటును మొగ్గలోనే తుంచేయడం అవసరం కూడా. ఎన్ని విధాలా నష్టం అంటే మద్యం శరీరంలోని అన్ని అవయవాలపై తన దుష్ప్రభావం చూపుతుందని చెప్పుకున్నాం కదా. మన ఒంట్లో దాని వల్ల నష్టపోని వ్యవస్థలు, కీలక భాగాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు కొన్ని వాస్తవాలు ♦ జీర్ణకోశ వ్యవస్థ: మద్యం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టడంలో లోపాలు (మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్), క్యాన్సర్లు, హీమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్ గ్రంథి సమస్యలు కనిపిస్తాయి. 75% ఈసోఫేజియల్ క్యాన్సర్లకు కారణం మద్యం తాగడమే. ♦ గుండె: ఆల్కహాల్ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందన, లయల్లో మార్పులు. గుండెపోటు, అథెరోస్లీ్కరోసిస్ సమస్యలు. ♦ నాడీ వ్యవస్థలో లోపాలు: జ్ఞాపకశక్తిలోపం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు. ♦ సెక్స్ సమస్యలు: సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు. ♦ గర్భిణులు ఆల్కహాల్ తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడంతో అనేక వైకల్యాలు కనిపించవచ్చు. ♦ మద్యం తాగినప్పుడు ఆకలి మందగించడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. అది అనేక విటమిన్ లోపాలకు కారణం అవుతుంది. ♦ ప్రమాదాలు: మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో బతికినప్పటికీ ఒక్కోసారి తలకు తీవ్రమైన గాయాల వల్ల జీవితాంతం వైకల్యంతోనే జీవించాల్సి వచ్చే అవకాశాలే ఎక్కువ. మానేసిన వెంటనే ఆరోగ్య ప్రయోజనాలు ఇంతటి నష్టాన్ని కలిగించే మద్యం మానేయగానే మన శరీరం బాగుపడటం మొదలవుతుంది. మద్యం మానేయగానే కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే కాలేయం పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. భవిష్యత్తులో కాలేయ వ్యాధుల ముప్పు తొలగిపోతుంది. రక్తపోటు తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 3.5% క్యాన్సర్లు మద్యం కారణంగానే వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక పేర్కొంటోంది. అందుకే దాన్ని గ్రూప్–1 కార్సినోజెన్‌గా చెబుతోంది. అంటే మద్యం మానేయడం వల్ల దాదాపు 10 రకాల క్యాన్సర్ల ముప్పు తొలగిపోతుందని అర్థం. అంతేకాదు.. ఆల్కహాల్ మానేసి, బరువును అదుపులో పెట్టుకొని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటే క్యాన్సర్లు వచ్చే ముప్పు 30 శాతానికి పైగా తగ్గుతుంది. అయితే దీర్ఘకాలికంగా మద్యం అలవాటు ఉన్నవారు అకస్మాత్తుగా ఆపేసినప్పుడు ఆల్కహాల్ విత్‌డ్రావల్ సిండ్రోమ్ అనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో పొంతనలేకుండా మాట్లాడటం, గుండె వేగంలో మార్పులు, భయం, వణుకు, ఆందోళనతో పాటు కొన్ని సార్లు ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి తాత్కాలికమే. ఒకటి నుంచి రెండు వారాల్లో మామూలైపోతారు. మద్యం సరదాగా తాగే అలవాటు ఉన్నా సరే... దాన్ని తక్షణం మానేయండి. ఇక దీర్ఘకాలిక మద్యపాన ప్రియులు కూడా పైన పేర్కొన్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని మానేయడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలికంగా మద్యం అలవాటు ఉన్నవారిలో మానేయాలనే దృఢసంకల్పం ఉన్నప్పుడు అలాంటి వారికి డాక్టర్ల ఆధ్వర్యంలో కొద్దిపాటి చికిత్సతో మద్యాన్ని మాన్పించడం సులువే. మద్యం గురించి అవీ ఇవీ... ♦ మనిషి కొత్తరాతి యుగం నాటి (10,000 బీసీ) నుంచి ఆహారపదార్థాలను పులియబెట్టి మద్యం తయారు చేయడం నేర్చుకున్నాడు. చైనాలో 7000 బీసీలో కూడా మద్యం తయారు చేసిన తార్కాణాలున్నాయి. పిరమిడ్ల నిర్మాణంలో కూలీలకు బీర్లను వేతనంగా ఇచ్చిన దాఖలాలూ ఉన్నాయి. ♦ కొందరైతే తమ గ్లాసు ఖాళీ అవ్వగానే ఆ ఖాళీ గ్లాసును చూసి కూడా భయపడతారూ, ఆందోళనపడతారు. ఆ భయాన్నే ‘సీనోసిలికఫోబియా’ అంటారు. ఆ భయాన్ని అధిగమించడం కోసం వెంటనే తమ ఖాళీగ్లాసు నింపేస్తుంటారు. ♦ అమెరికాలోని ఒహాయోలో చేపకు మద్యం తాగించడం చట్టబద్దమైన నేరం. ♦ ఒక రోజు అలగ్జాండర్ తన సైనికులకు మద్యం తాగే పోటీని నిర్వహించాడు. పోటీ ముగిసే సమయానికి పటాలంలోని 42 మంది సైనికులు మద్యం విషప్రభావం కారణంగా (ఆల్కహాల్ పాయిజనింగ్తో) చనిపోయారు. ♦ ఐర్లాండ్‌లో 1875లో ఒక మద్యం తయారీ సంస్థలో అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడా మద్యం పరిశ్రమ నుంచి మద్యం ఏరులై వీధుల్లో ప్రవహించింది. అలా ఫ్రీగా మద్యం పారుతుంటే వృధాకానివ్వకూడదంటూ చాలామంది మద్యం ప్రియులు అదేపనిగా తాగడం మొదలుపెట్టారు. అలా తాగేసిన వారిలో 13 మంది మద్యం దుష్ప్రభావంతో (ఆల్కహాల్ పాయిజనింగ్తో) చనిపోయారు. ♦ లేత రంగు మద్యాల్లో కంటే ముదురు రంగు (డార్క్) మద్యాల్లో ఆల్కహాల్ మోతాదులు చాలా ఎక్కువ. ఇక మన ఆసియా దేశాల వారిలోని 50% మందిలో ఆల్కహాల్ తాగితే దాన్ని తట్టుకొని ప్రాసెస్ చేయగల జన్యువు లేదు. అందుకే పాశ్చాత్య దేశాల కంటే మన ఆసియా దేశాల వారిలో మద్యంతో మరింత ముప్పు. కాలేయంపైనే అధిక దుష్ప్రభావం... శరీరంలోకి ఏవైనా విషపదార్థాలు ప్రవేశించగానే వాటిని విరిచేసి వాటి ప్రభావాన్ని నిర్మూలించే విధులను కాలేయం నిర్వహిస్తుంది. మద్యం ఒకరకమైన విషం (టాక్సిన్) కావడం వల్ల దాన్ని విరిచి వేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంటుంది. అలా కాలేయం ఆల్కహాల్ విరిచేస్తున్న క్రమంలో ఎసిటాల్డిహైడ్, ఎసిటేట్ అనే రసాయనాలు వెలువడుతుంటాయి. ఈ రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. నిజానికి ఆల్కహాల్ తాగిన మర్నాడు మనిషి హ్యాంగోవర్‌కు గురవుతాడు. ఇందుకు ఆల్కహాల్‌ను విరిచేసే క్రమంలో వెలువడే ఎసిటాల్డిహైడ్, ఎసిటేట్లతో పాటు ఇతర రసాయన బైప్రోడక్ట్సే కారణం. అవి విషపూరితమైనవి కావడం వల్ల ఆ విషాల ప్రభావంతో మనిషి మందకొడిగానూ, చిరాకుగానూ మారిపోయి, తన రోజువారీ పనులను చురుగ్గా చేసుకోలేకపోతాడు. ఇలా విషాలను విరిచేసే పనిలో కాలేయం తాను నిత్యం చేయాల్సిన దానికంటే ఎక్కువగా మరింత ఎక్కువగా పనిచేస్తుంది. ఇక అలవాటుగా మద్యం తాగేవారిలో ఈ విషయాలను విరిచేసే పనిని అదేపనిగా చేస్తుండటం వల్ల కాలేయంపై చాలా భారం పడుతుంది. మెదడుపై దుష్ప్రభావం ఇలా... ప్రధానమైన దెబ్బ కాలేయంపైనా... ఆ తర్వాత మెదడుపైన పడుతుంది. మద్యం మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఎక్కువ మోతాదుల్లో మద్యం తీసుకున్నప్పుడు అది మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగాన్ని దెబ్బతీయడం మొదలుపెడుతుంది. మనలో లాజిక్‌తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్‌కూ, అంచనావేయడానికి ఆ భాగమే తోడ్పడుతుంది. అదే సరిగా పనిచేయకపోవడంతో మనం మెల్లగా మన భావోద్వేగాలపై అదుపు కోల్పోతాం. ఎలాంటి ముప్పునైనా తేలిగ్గా తప్పించుకోగలమనే అతివిశ్వాసం పెరగడంతో రిస్క్ తీసుకునే పనులకు పాల్పడుతుంటాం. దాంతో అనేక అనర్థాలు జరుగుతాయి. అటు తర్వాత మెదడులోని టెంపోరల్ లోబ్ ప్రభావితమవుతుంది. ఫలితంగా మరచిపోవడం, చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. చివరకు చిరాకు, కోపం కలుగుతాయి. నిజానికి ఆల్కహాల్ అనేది డిప్రెషన్లోకి నెట్టే ఒక డిప్రెస్సెంట్. అది మనిషిని కుంగిపోయేలా చేస్తుంది. అంతేకాదు... మెదడు పనితీరు, చురుకుదనం తగ్గుతాయి. అలాగే మితిమీరి తాగుతూ ఉంటే ఆ తర్వాతి దశ కోమాయే. ఎంత మోతదులో ఎలాంటి మార్పులు కలుగుతాయో విపులంగా చెప్పుకుందాం. ఏయే మోతాదులు... ఎలాంటి పరిణామాలు /లక్షణాలు డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి,చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,రోడ్ నెం. 12, బంజారాహిల్స్,హైదరాబాద్ -
మధుమేహానికి చెక్.. కొత్త పద్ధతిలో!
మధుమేహానికి నిరపాయకరంగా చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెటబాలిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు చేసిన తాజా ప్రయత్నం మాత్రం కొంచెం వినూత్నమైంది. కొవ్వులతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా సరే.. అవి కాలేయంలో సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి మధుమేహం రాకుండా చేయవచ్చునని వీరు అంటున్నారు. మన శరీరంలో కొవ్వులు అడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంటాయని మనకు తెలుసు. దీర్ఘకాలంపాటు ఎక్కువగా తీసుకుంటే మాత్రం కొవ్వు కాలేయంలో కూడా పోగుబడుతుంది. ఇది కాస్తా ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీసి.. శరీరం ఇన్సులిన్‌కు స్పందించే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో టైప్ –2 మధుమేహం వచ్చేస్తుంది. ఈ రకమైన జీవక్రియ సంబంధిత వ్యాధులకు.. సెరమైడ్ అనే కొవ్వు రకానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు గతంలోనే గుర్తించినా.. ప్రొటీన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వీటిని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం అంతగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో మ్యాక్స్ ప్లాంక్ శాస్త్రవేత్తలు ఈ సెరమైడ్ కొవ్వులలో ఇన్సులిన్ నిరోధాన్ని ప్రేరేపిస్తున్న వాటిని గుర్తించారు. వాటిని మాత్రమే అడ్డుకోగల ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడాన్ని తగ్గించగలిగారు. ఇదే క్రమంలో వాటి రక్తంలోని చక్కెర మోతాదులు కూడా తగ్గాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న హామెర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు సెల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఆహారవాహికలో రక్తనాళాలు ఉబ్బాయి...ప్రమాదమా?
నా వయసు 65 ఏళ్లు. నేను ఆల్కహాలిక్ సిర్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. నాకు ఎండోస్కోపీ చేసి ఆహారవాహికలో రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయని చెప్పారు. వాటివల్ల ఏదైనా ప్రమాదమా? మీకు సిర్రోసిస్ అనే జబ్బు వల్ల ఆహారవాహికలో ‘ఈసోఫేజియల్ వారిసెస్’ అనేవి అభివృద్ధి చెందాయి. వీటి పరిమాణాన్ని బట్టి మీకు మున్ముందు రక్తపువాంతులు అయ్యే అవకాశం ఉంది. ఈ వారిసెస్ అనేవి ఏ పరిమాణంలో ఉన్నాయన్న విషయం మీరు రాయలేదు. మాములుగా వారిసెస్ పరిమాణం గ్రేడ్3 లేదా గ్రేడ్ 4 ఉన్నట్లయితే అవి పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు రక్తపువాంతుల విషయాన్ని మీ లేఖలో ప్రస్తావించలేదు కాబట్టి మీకు ఇంతకు ముందు ఆ రక్తపు వాంతులు అయినట్లు లేదు. కాబట్టి మీరు ప్రొప్రనాల్ 20 ఎంజీ, రోజుకు రెండుసార్లు వాడితే సరిపోతుంది. మీ సైమస్యకు ఎండోస్కోపీ ద్వారా ‘బ్యాండింగ్’ అనే చికిత్స చేసి, ఉబ్బిన రక్తనాళాలను పూర్తిగా తగ్గేటట్లు చేయవచ్చు. దానివల్ల రక్తపువాంతులు అయ్యే అవకాశం తగ్గుతుంది. మీకు ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. పిత్తాశయాన్ని తొలగించిన చోట తరచూ నొప్పి... ఎందుకిలా? నా వయసు 50 ఏళ్లు. మూడేళ్ల కిందట లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా నా పిత్తాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం రెండు నెలల నుంచి అదే ప్రాంతంలో తరచూ నొప్పి వస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? నాకు తగిన సలహా ఇవ్వండి. సాధారణంగా లివర్‌లో ఉద్భవించే పైత్యరసం చిన్న చిన్న నాళాల ద్వారా వచ్చి పిత్తాశయంలో చేరుతుంది. పిత్తాశయం లోని సీబీడీ అనే నాళం ద్వారా చిన్న పేగుల్లోకి చేరుతుంది. మీకు పిత్తాశయం తొలగించిన తర్వాత నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముందుగా అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి సీబీడీ అనే నాళంలో ఏమైనా రాళ్లు ఉన్నాయేమో చూపించుకోగలరు. ఒకవేళ అల్ట్రాసౌండ్ నార్మల్‌గా ఉన్నట్లయితే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని ‘అల్సర్స్’కు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయేమో నిర్ధారణ చేసుకోవాలి. పైన తెలిపిన కారణాలు ఏమీ లేనట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. పాపకు మలంలో రక్తం పడుతోంది... సలహా ఇవ్వండి మా పాప వయసు ఎనిమిదేళ్లు. అప్పుడప్పుడూ మలంలో రక్తం పడుతోంది. మామూలుగా మలవిసర్జనలో ఎలాంటి సమస్యా లేదు. మా పాప విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ పాప వయసు రీత్యా, ఆమెకు పెద్దపేగుల్లో కణుతులు (పాలిప్స్) ఉండే అవకాశం ఉంది. వాటివల్ల అప్పుడప్పుడూ మలంలో రక్తం పడే అవకాశం ఉంటుంది. ఇలా తరచూ రక్తం పోవడం వల్ల రక్తహీనత (అనీమియా)కు దారితీసే ప్రమాదం ఉంది. మీరు ఒకసారి మీ పాపకు ‘సిగ్మాయిడోస్కోపీ’ అనే పరీక్ష చేయించండి. ఒకవేళ పాలిప్స్ ఏవైనా ఉన్నట్లయితే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని పూర్తిగా తొలగించవచుచ. దానివల్ల పాపకు పూర్తిగా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. చికిత్స చేయించుకున్న తర్వాత కూడా జ్వరం, కామెర్లు! నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది కిందటి నుంచి కడుపులో నొప్పి, కామెర్లు, దురద వస్తే వైద్యపరీక్షలు చేయించుకున్నాను. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈఆర్సీపీ అనే పరీక్ష చేసి స్టెంట్ వేశారు. మళ్లీ నెల రోజుల నుంచి జ్వరం రావడం, కళ్లు పచ్చగా మారడం జరుగుతోంది. నాకు సరైన సలహా ఇవ్వండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు గాల్‌స్టోన్స్, సీబీడీ స్టోన్స్ అనే సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మీకు కడుపులో వేసిన బిలియరీ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. అందువల్ల మీకు కామెర్లు, జ్వరం వస్తున్నాయి. మీరు తక్షణం మళ్లీ ఈఆర్సీపీ చేయించుకోండి. ఇది అత్యవసరంగా జరగాల్సిన చికిత్స, ఈఆర్సీపీ వల్ల సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించవచ్చు. దాంతోపాటు మూసుకుపోయిన స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ అమర్చవచ్చు. ఈఆర్సీపీ తర్వాత మీరు లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే మీరు ఆపరేషన్ చేయించుకుని ఉంటే బాగుండేది. మీరు చెప్పిన లక్షణాల నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈఆర్సీపీ ప్రక్రియనూ, లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ సర్జరీని చేయించుకోండి. డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మి, హెచ్ఓడీ, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోంటరాలజీ డిపార్ట్మెంట్, కేర్ హాస్పిటల్స్ హైటెక్‌సిటీ, హైదరాబాద్ -
ఫ్యాటీలివర్ అంటున్నారు.. సలహా ఇవ్వండి
నా వయసు 58 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. లివర్ కొవ్వు పదార్థాలను గ్రహించి అవి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. అయితే కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వవున్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ∙మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి ∙లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు ∙తరచూ చేపమాంసాన్ని అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది ∙మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. కడుపులో మంట... పరిష్కారం చెప్పండి నా వయసు 42 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి కడుపులోనూ, ఛాతీభాగంలోనూ మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... ►మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం ►కాఫీ, టీలను పూర్తిగా మానేయడం ►పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం ►బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం ►భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి ►తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. ►పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. గాల్ బ్లాడర్‌లో రాళ్లు...సలహా ఇవ్వండి నేను నెల రోజుల క్రితం కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు అసింప్టమాటిక్ గాల్‌స్టోన్ డిసీజ్ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారి ఓ ఏడాదికి నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. కాబట్టి మీకు వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటే, ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు. తరచూ కడుపునొప్పి..మందులు వేసుకుంటేనే తగ్గుతోంది.. నా వయసు 37 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. మల విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. కొన్నిసార్లు మలబద్ధకం, మరికొన్నిసార్లు విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. మీరు రాసిన లక్షణాలను బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన చెందుతుండే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య తగ్గుతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, బంజారా హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
కొండలా కొవ్వు కాలేయానికి ముప్పు
జీవనశైలి మార్పులు, అసంబద్ధఆహారపు అలవాట్లతో కాలేయం పనితీరు దెబ్బతింటోంది. మనిషిఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి చేస్తే కాలేయానికి ‘కొవ్వు’ ముప్పుగా పరిణమిస్తోంది. సాధారణంగా హెపటైటీస్–బి,హెపటైటీస్–సి ఇన్ఫెక్షన్లతో పాటు అతిగా మద్యం తాగేవారు ఎక్కువగా ‘ఫ్యాటీ లివర్’ సమస్యలతో బాధపడుతుంటారు. కానీ ప్రస్తుతం జీవనశైలి,ఆహారపు అలవాట్లలో మార్పులకు తోడు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, కొన్ని రకాల నాటు మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో ఎలాంటి దురలవాట్లు లేని వారు కూడా ‘నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్’ సమస్యతో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో :బాధితుల్లో 12.22 శాతం మంది 30 ఏళ్లలోపు వారుంటే... 40 ఏళ్లలోపు వారు 25.8 శాతం, 50 ఏళ్లలోపు వారు 28.10 శాతం, 60 ఏళ్లలోపు వారు 21.74 శాతం ఉండడం గమనార్హం. తొలి దశలో మేల్కొనకపోవడంతో కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిని మార్పిడి చికిత్సలకు వెళ్లాల్సి వస్తోంది. జీవన్‌దాన్ ద్వారా బ్రెయిన్‌డెత్ బాధితుల నుంచి కాలేయం సేకరించి ఇప్పటి వరకు 612 కాలేయ మార్పిడి చికిత్సలు చేయగా, నగరంలోనే అత్యధికంగా ఒక్క గ్లోబల్ ఆస్పత్రిలోనే 700 పైగా లైవ్ కాలేయ మార్పిడి చికిత్సలు జరగడం విశేషం. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా ఈ జబ్బుల బారినపడుతుండడం గమనార్హం. బాధితుల ఎదురుచూపు.. కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు కాలేయ మార్పిడి చికిత్స చేయాల్సిందే. అయితే ఇది చాలా ఖర్చుతో కూడిన వైద్యం కావడంతో చాలా మంది చికిత్సకు వెనకాడుతున్నారు. ప్రభుత్వం ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చినప్పటికీ... ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతూ కాలేయ మార్పిడి చికిత్స కోసం తెలంగాణలో 2,833 మందికి పైగా రోగులు జీవన్‌దాన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. రోగుల నిష్పత్తికి అనుగుణంగా దాతలు లేకపోవడంతో చాలా మంది చికిత్సకు నోచుకోకుండానే మరణిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అంతంతే.. కుటుంబసభ్యుల్లో ఎవరైనా బాధితుడికి తమ కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చినా... వయసు, బ్లడ్‌గ్రూప్ మ్యాచింగ్ కావడం లేదు. ఒకవేళ మ్యాచ్ అయినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా లైవ్ డోనర్ సర్జరీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో చికిత్సలు జరగడం లేదు. ఫలితంగా ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేకపోవడంతో బాధితులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. వ్యాయామం చేయాలి.. ఒకప్పుడు ధనవంతుల్లో మాత్రమే ఈ ఫ్యాటీ లివర్ సమస్యలు వెలుగు చూసేవి. ప్రస్తుతం వారిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆహారం మితంగా తీసుకుంటూ శరీరానికి అవసరమైన వ్యాయామం చేస్తూ జీవనశైలిని మార్చుకుంటున్నారు. కానీ మధ్యతరగతి ప్రజల్లో ఇప్పటికీ సరైన ఆరోగ్య స్పృహ లేదు. ఏది పడితే అది తినడం, దాన్ని అరిగించుకునేందుకు కనీస వ్యాయామం చేయకపోవడంతో ఊబకాయులుగా మారుతున్నారు. దీనికి మధుమేహం తోడవుతోంది. కాలేయంలో చక్కెర నిల్వలు పెరిగి ఫ్యాటీ లివర్‌కు కారణమవుతోంది. కాలేయం పనితీరు దెబ్బతినకుండా ఉండాలంటే మద్యం, మాంసాహారాలు మితంగా తీసుకోవాలి. శరీరానికి కనీస వ్యాయామం ఉండాలి. – డాక్టర్ రమేశ్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి చిన్న పిల్లల్లోనూ... సాధారణంగా మద్యం, మాంసం, ఆయిల్ ఫుడ్ అతిగా తీసుకునేవారే ఎక్కువగా కాలేయ జబ్బుల బారినపడుతుంటారు. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే కనీస/తక్కువ బరువుతో ఉన్నవారు... ఎలాంటి దురలవాట్లు లేనివారు సైతం ప్రస్తుతం ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఇలా ప్రతి 10 మందిలో ఐదారుగురు ఈ సమస్యతో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పెద్దవారిలో బయటపడే ఈ సమస్య... ప్రస్తుతం చిన్నపిల్లల్లోనూ ఎక్కువగా నమోదవుతోంది. జన్యుపరమైన కారణాలతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్లే ఇందుకు కారణమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. – డాక్టర్ మధుసూదన్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి -
మృత్యువు కబళిస్తోంది!
బి.కొత్తకోట : మండలంలోని బీరంగికి చెందిన విద్యార్థి కాలేయవ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కాలేయమార్పిడి చేయాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించడంతో ఆ నిరుపేద విద్యార్థి ప్రాణం నిలిపే దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. వివరాలు.. బీరంగికి చెందిన గాజుల రమేష్‌కు ముగ్గురు సంతానం. వారిలో గాజుల గణేష్ (14) బీరంగికి సమీపంలోని శంకరాపురం జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. రమేష్‌కు వర్షాధారంతో పండే ఎకరా పొలం ఉంది. రోజూ కూలీకి వెళ్తే వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఐదేళ్లుగా గణేష్ కడుపు, కాళ్లకు వాపులు వస్తుంటే మదనపల్లె, తిరుపతి ఆస్పత్రుల్లో చూపించాడు. తగ్గినట్లే వాపులు తగ్గి మళ్లీ అదే సమస్య తిరగబెడుతుండడంతో గణేష్ ఇబ్బంది పడుతుండేవాడు. వైద్యుల సలహా మేరకు ఇటీవలే హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి గణేష్‌కు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో గణేష్ కాలేయం పూర్తిగా పాడైనట్టు నిర్థారించారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయిం చుకోవాలని అక్కడి వైద్యులు సూచించారు. రమేష్ నుంచి 40శాతం కాలేయం స్వీకరించి గణేష్‌కు అమర్చుతామని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఈ చికిత్సకోసం రూ.25లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో రమేష్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. కుటుంబ పోషణే కష్టంగా మారిన తరుణంలో గణేష్‌కు చికిత్స నిమిత్తం ఇప్పటికే తలకు మించి అప్పులు చేశాడు. కళ్లముందే అనారోగ్యంతో రోజు..రోజుకూ నీరసించిన బిడ్డ దుస్థితి చూసి కుంగిపోతున్నారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో గణేష్ ఆస్పత్రుల వెంట తిరుగుతున్నాడు. ఇప్పుడు కాలేయమార్పిడి ఆర్థికస్థోమత లేకపోవడంతో తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. -
ప్రోబయాటిక్స్‌తో కాలేయానికి మేలు!
పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అన్నారా? మజ్జిగ, ఆవకాయ వంటి ప్రోబయాటిక్ ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారుగానీ.. శాస్త్రవేత్తలు తాజాగా వీటినే శాస్త్ర పరిశోధనల చట్రంలో నిరూపిస్తున్నారు. విషయం ఏమిటంటే.. మన కడుపు, పేవుల్లోని బ్యాక్టీరియాు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిసినప్పటి నుంచి ప్రోబయాటిక్స్‌పై కూడా పరిశోధనలు ఊపందుకున్నాయి. ఎమరీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో ఈ ప్రోబయాటిక్స్ కాలేయానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసింది. బ్యాక్టీరియా మన జీవక్రియల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? అందుకు ఏ ఏ పరమాణువులు ఎలా కారణమవుతున్నాయి? అన్న అంశాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకోగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సయీదీ తెలిపారు. లాక్టోబాసిల్లస్ రామ్నోసస్ జీజీ అనే బ్యాక్టీరియాపై తమ పరిశోధనలు జరిగాయని, రెండు వారాలపాటు ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న ఆహారంతోపాటు కాలేయానికి చేటు చేయగల రసాయనాన్ని ఉద్దేశపూర్వకంగా అందించామని, ఆశ్చర్యకరంగా ప్రోబయాటిక్స్ తీసుకుంటున్న ఎలుకల్లో నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని వివరంచారు. బ్యాక్టీరియా కారణంగా శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు స్పందించి రసాయనం కారణంగా ఎక్కువైన ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా కాలేయానికి నష్టం తగ్గినట్లు చెప్పారు. ఈ ఫలితాలు మానవుల్లోనూ ఇలాగే ఉంటే.. ప్రోబయాటికక్స్ వాడకం ద్వారా కాలేయానికి జరిగే నష్టాన్ని తగ్గింవచ్చునని అన్నారు. -
ఎక్సైజ్ సీఐ బషీర్ మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు రూరల్ మండల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐ ఎస్.బషీర్ అహ్మద్ (57) శుక్రవారం మృతి చెందారు. 2015 సెప్టెంబరు నుంచి చిత్తూరు రూరల్ సీఐగా పనిచేస్తున్న ఈయన మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. మధ్యాహ్నం చిత్తూరులోని తన నివాసంలో ఉండగా కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. శనివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియం మసీదు వద్ద అంత్యక్రియలు జరుగుతాయని బషీర్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈయన మృతిపట్ల ఎక్సైజ్ అధికారులు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. -
తండ్రిని రక్షించుకున్న తనయ ..
సాక్షి, న్యూఢిల్లీ: ఆడవాళ్లు మైనస్, మగవాళ్లు ప్లస్ అనే అభిప్రాయం ఇప్పటికీ సమాజంలో కొనసాగుతుండడం వల్ల భారత్‌లో గత రెండు దశాబ్దాల్లో దాదాపు కోటి మంది శిశు బ్రూణ హత్యలకు పాల్పడ్డారు. దీన్ని మార్చాలనే ఉద్దేశంతోనే కేంద్రం ‘బేటీ బచావో, బేటీ పడావో’ లాంటి నినాదాలను తీసుకొచ్చి విస్తత ప్రచారాన్ని సాగిస్తోంది. ఆడ పిల్లలను మైనస్‌గా భావించడానికి పెళ్లి సందర్భంగా కట్న కానుకలు ఇచ్చి పంపించాల్సి ఉంటుందని, అవసరానికి కూడా వారు అందిరారన్నది చాలా మంది తండ్రుల అభిప్రాయం. ఇది పూర్తిగా తప్పని డాక్టర్ రచిత్ భూషణ్ శ్రీవాస్తవ పేస్బుక్ పోస్టింగ్ స్పష్టం చేస్తోంది. పూజా బిజార్ణియా అనే ఓ ధైర్యం కలిగిన కూతురు చావు బతుకుల మధ్యనున్న తన తండ్రిని రక్షించడం కోసం తన లివర్‌ను దానం చేసింది. ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని, తండ్రికి లివర్‌ను దానం చేసిన ఆ తనయను అభినందించకుండా ఉండలేకపోతున్నానంటూ డాక్టర్ భూషణ్ పేర్కొన్నారు. తండ్రి కూతుళ్ల ఫొటోను కూడా ఆయన ఫేస్బుక్లో షేర్ చేయగా ఇప్పుడది వైరల్ అవుతోంది. -
నిండు జీవితానికి ‘నవ’ పరీక్షలు!
బీపి, షుగర్, కంటి సమస్యలు, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, స్థూలకాయం, ఎముకలు బలహీనపడటం, రక్తంలో ెహిమోగ్లోబిన్ తగ్గడం వంటి సమస్యలు చాలామందికి సర్వసాధారణంగా ఎదురయ్యేవే. కారణాలను గుర్తించి, వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఉపకరించేవే ఈ నవపరీక్షలు... 1. రక్తపోటు పరీక్ష: ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి పెరగడంతో చిన్న వయసు వారిలో కూడా ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు కనిపిస్తోంది. ‘స్ఫిగ్మోమానోమీటర్’ అనే పరికరంతో బీపీని కొలుస్తారు. వైద్యుల సలహా మేరకు ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు దీనిని అదుపు చేయవచ్చు. అప్పటికీ అదుపులోకి రాకుంటే, మందులు వాడాల్సి ఉంటుంది. 2. ఈసీజీ పరీక్ష: గుండె పనితీరును తెలుసుకోవడానికి ఎలక్ట్రో కార్డియోగ్రఫీ (ఈసీజీ) పరీక్ష అత్యవసరం. ఈసీజీ పరికరం సాయంతో గుండె కొట్టుకునే తీరును తెలుసుకుంటారు. దీనిద్వారా గుండె కండరాలకు తగినంతగా రక్త సరఫరా జరగకపోవడం, గుండె లయలో హెచ్చుతగ్గులు, తగినంత వేగంతో గుండె పంప్ చేయలేకపోవడం, గుండె కండరాల్లో ఏవైనా దళసరిగా మారడం లేదా వాటి పరిమాణం పెరగడం, గుండెలో పుట్టుకతో ఏర్పడే లోపాలు వంటివి కనుక్కోవచ్చు. 3. లివర్ ఫంక్షన్ టెస్ట్స్: లివర్ పనితీరును తెలుసుకునేందుకు చేసే కొన్ని రకాల రక్తపరీక్షలనే లివర్ ఫంక్షన్ టెస్ట్స్ అంటారు. వీటిలో ఆల్బుమిన్, టోటల్ బైలురుబిన్, డెరైక్ట్ బైలురుబిన్, ట్రాన్సామినాసెస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్ వంటి పదార్థాల స్థాయిని కనుగొనేందుకు చేసే పరీక్షలు ఉంటాయి. వీటి ద్వారా హెపటైటిస్, హైపర్ పారాథైరాయిడిజం, పచ్చకామెర్లు (జాండిస్) వంటి జబ్బులను తెలుసుకోవచ్చు. వీటితో పాటు అల్ట్రాసౌండ్ హోల్ అబ్డామిన్ పరీక్ష చేయడం ద్వారా లివర్ సిరోసిస్, ఫ్యాటీలివర్ కూడా ఉందేమో తెలుసుకోవచ్చు. లివర్‌లోని లోపాల వల్ల తలెత్తే జబ్బుల లక్షణాలు అంత తొందరగా బయటపడవు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, చికిత్స చేయడం తేలిక. 4. కంటి పరీక్ష: సాధారణంగా కంటిచూపు 6/6 ఉంటుంది. చిన్నారులు ఎక్కువగా హ్రస్వదృష్టి బారిన పడుతుంటారు. నలభై ఏళ్లు దాటాక చత్వారం వచ్చేస్తుంది. అంటే, దూరదృష్టి పెరుగుతుందన్నమాట. ఇవే కాకుండా, వయసు మళ్లిన వారికి గ్లకోమా, క్యాటరాక్ట్ వంటి ఇబ్బందులూ తలెత్తుతాయి. ఎప్పటికప్పుడు కంటి పరీక్ష జరిపించుకుంటూ, తగిన చికిత్స పొందాలి. 5. కిడ్నీ పరీక్ష: కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి సీరమ్ క్రియాటినిన్ పరీక్ష నిర్వహిస్తారు. కండరాల జీవక్రియలో వెలువడే రసాయనిక వ్యర్థమే క్రియాటినిన్. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని సక్రమంగా ఉండేలా చూడటంలో కిడ్నీలదే కీలక పాత్ర. కిడ్నీల పనితీరులో తేడా వస్తే రక్తంలో క్రియాటినిన్ పరిమాణం పెరిగిపోతుంది. క్రియాటినిన్ పరిమాణం సాధారణంగా 0.8-1.2 ఎండీ/డీఎల్, పురుషుల్లో 0.8-1.3 ఎంజీ/డీఎల్ ఉంటుంది. మూత్రపరీక్ష ద్వారా కూడా దీని స్థాయిని తెలుసుకుంటారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి మూత్రపరీక్ష, రక్తపరీక్ష రెండింటి ద్వారా ఈ పరిమాణాన్ని తెలుసుకుని, కిడ్నీల పనితీరులో తేడాలు ఉన్నట్లు తేలితే తగిన చికిత్స చేస్తారు. 6. కొలెస్ట్రాల్ పరీక్ష: రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. రక్తపరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. ఎల్డీఎల్, హెచ్‌డీఎల్ ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. ఎల్డీఎల్నే చెడు కొవ్వు అంటారు. ఇది ఎక్కువగా ఉంటే, ధమనుల్లో కొవ్వు చేరి గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అదే, హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి చెడుకొవ్వు చేరకుండా అరికడుతుంది. 45 పైబడ్డ వాళ్లు ప్రతి ఏటా ఈ పరీక్ష చేయించుకోవాలి. 7. చక్కెర పరీక్ష: రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే. చక్కెరను నియంత్రించే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాన్‌క్రియాస్ పనితీరు మందగించినా, కండరాలు, కాలేయం, కొవ్వుల్లో ఉండే జీవకణాలు ఇన్సులిన్‌కు తగిన రీతిలో ప్రతిస్పందించకపోయినా చక్కెరజబ్బు వస్తుంది. పాన్‌క్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోతే టైప్-1 డయాబెటిస్ వస్తుంది. ఇది చిన్న వయసు నుంచే కనిపిస్తుంది. ఇన్సులిన్‌ను శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో ఉపయోగించుకోనప్పుడు టైప్-2 డయాబెటిస్ వస్తుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా 45 ఏళ్ల వారు తరచు రక్తపరీక్షలు జరిపించుకుని, రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడం మంచిది. 8. కంప్లీట్ బ్లడ్ పిక్చర్: రక్తంలో ఉండే సూక్ష్మ పదార్థాలన్నింటి పరిమాణాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తహీనత వంటి లోపాలను కనుగొనేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది. రక్తంలో హెమోగ్లోబిన్ పరిమాణం 11ఎంజీ/డీఎల్ నుంచి 16 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లే. డెంగ్యూ వంటి వ్యాధులు సోకినప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ద్వారానే ఆ పరిస్థితిని తెలుసుకోవచ్చు. 9. బోన్ డెన్సిటీ టెస్ట్: మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో మహిళలు ఆస్టియో పొరాసిస్కు గురవుతుంటారు. మరీ సన్నగా ఉండే మహిళలు, వంశపారంపర్యంగా ఈ వ్యాధి కొనసాగుతున్న వాళ్లు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. బోన్ డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియో పొరాసిస్ వ్యాధిని తేలికగా గుర్తించవచ్చు. బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. డాక్టర్ ఎల్. సుదర్శన్ రెడ్డి సీనియర్ జనరల్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబద్ -
రేడియేషన్ చికిత్సలో ఇతర కణాలు దెబ్బతినవు
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. కడుపులో మంట, ఆకలి లేకపోవడం, మలబద్ధకం కనిపించాయి. డాక్టర్ గారు , కాలేయం పనితీరులో లోపం ఉందన్నారు. హోమియోలో చికిత్స ఉందా? - సునీల్‌కుమార్, విశాఖపట్నం ప్రస్తుతం తీసుకునే ఆహారపు అలవాట్లు మారడంతో ఆహారంలో కొవ్వులు పేరుకుపోయి కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాలేయం జీర్ణవ్యవస్థకు సంబంధించిన గ్రంథి. ఇది పైత్యరసాన్ని స్రవిస్తుంది. కాలేయం స్రవించే ఈ పదార్థాలు ఎంజైమ్‌లు లేకపోయినా బైలిరుబిన్, బైలివర్దిన్ అనే రంగు పదార్థాలు ఉండి, కొవ్వులు జీర్ణం కావడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాలేయం చాలా కీలకమైన విధులను నిర్వహిస్తుంది. ఇందులోని 20-25 శాతం పనిచేసినా శరీరంలోని విధులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవుల వల్ల హెపటైటిస్ అనే కాలేయవాపు వ్యాధి రావచ్చు. కాలేయ సమస్యలు ప్రధానంగా హెపటైటిస్లోని ఏ, బీ, సీ, డీ, ఈ అనే వైరస్ వల్లనే వస్తుంటాయి. అయితే హెపటైటిస్లోని కొన్ని రకాలు మన శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపడమే గాక... ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. కాలేయానికి హెపటైటిస్, సిర్రోసిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, హీమోక్రొమటోసిస్, విల్సన్స్ డిసీజ్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్, గిల్బర్ట్ సిండ్రోమ్, పసిరికలు వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కారణాలు: కలుషిత ఆహారం తీసుకోవడంవ్యాయామం లేకపోవడం మత్తుపదార్థాలు, పొగతాగడం వంటి అలవాట్లు ఇన్ఫెక్షన్ రక్తమార్పిడి వంటివి కాలేయ సమస్యలు రావడానికి కారణాలు లక్షణాలు: బరువు తగ్గడం, గాయాలు తొందరగా తగ్గకపోవడం జీర్ణసమస్యలు మలబద్ధకం నీరసం, ఆకలి మందగించడం సమస్య ముదిరిన కొద్దీ ముక్కు నుంచి రక్తస్రావం, కాళ్లలో వాపు, మందులకు సరిగా స్పందించకపోవడం, జీర్ణాశయంలోని సిరలు వ్యాకోచించడం వంటివి జరుగుతాయి. జాగ్రత్తలు: కాలేయ సంబంధ వ్యాధులను ప్రాథమికదశలోనే గుర్తిస్తే చాలా తేలికగా నయం చేసుకోవచ్చు కొవ్వు, ప్రోటీన్లు వంటివి తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మద్యం, పొగతాగడం పూర్తిగా మానేయాలి సమతుల ఆహారం తీసుకోవాలి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకునేలా జీవనశైలి మార్చుకోవాలి. హోమియో చికిత్స: ఈ విధానంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచే అద్భుతమైన మందులు ఉన్నాయి. ఆరమ్‌మెట్, కాల్కేరియా అర్స్, బెలడోనా, లైకోపోడియమ్, నేట్రమ్ సల్ఫ్, మెర్క్‌సాల్ వంటి మందులు మంచి ఫలితాలను చూపుతాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. దాంతో కాలేయ సమస్యలను సమూలంగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ డయాబెటిక్కౌన్సెలింగ్ నా వయసు 65 ఏళ్లు. చాలాకాలంగా డయాబెటిస్ ఉంది. ఇటీవల మా డాక్టర్ షుగర్ ఉన్నవాళ్లు ప్రత్యేకంగా పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. పాదాలను సంరక్షించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - నవనీతరావు, కొండాపూర్ డయాబెటిస్ రోగులు పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాదాలకు సంబంధించి ఏ సమస్యలూ రాకుండా పాటించాల్సినవి... పొగతాగకండి చెప్పులు లేకుండా అసలు నడవవద్దు. మీ ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి ప్రతిరోజూ పాదాలను పరిశీలించుకుంటూ ఉండాలి. ఎర్రబారడం, వేడిగా అనిపించడం, పుండ్లు, పగుళ్లు, గాయాలు, షూ వేసుకోవడం వల్ల గానీ లేదా ఇతర అంశాల వల్లగానీ గోళ్ల సమస్యలు లేకుండా చూసుకోండి. పాదం అడుగుభాగాన్ని అద్దంలోనూ పరిశీలించుకోండి. పైన పేర్కొన్న అంశాలు కనిపిస్తాయా అని చూసుకోండి. మీ షూస్లోగానీ లేదా చెప్పుల్లో గానీ రాయిలాంటివి చేరితే తక్షణం తీసేయండి. మీ గోర్లు కాలి కండలోకి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. పాదాల్లో మృదువుగా లేకపోతే... స్పర్శతో దాన్ని తెలుసుకోండి మీరు షూస్ కొనుక్కోవాలంటే సాయంత్రం పూట తీసుకోండి. దీనివల్ల ఆ సమయానికి పాదాలు పూర్తిగా సాగి ఉంటాయి. అప్పుడు మీకు దొరికే సైజ్ చాలా కరెక్ట్. పాదాలకు చాలా అనువుగా ఉండే షూ లేదా చెప్పులు మాత్రమే తీసుకోండి. పాదరక్షల కింది భాగం కూడా చాలా మృదువైన మెటీరియల్‌తో చేసి ఉండాలి. చెప్పుల పైన ఉన్న కప్పు భాగం కూడా అంతే మృదువుగా ఉండాలి ఒకసారి వేసుకున్న తర్వాత అదేపనిగా రెండుగంటల పాటు వేసుకొని ఉండకండి మీరు చెప్పులు వేసుకునే ముందర కాలికి మాయిశ్చరైజర్ పూసుకోండి. పాదం పొడిగా ఉన్నప్పుడే పాదరక్షలు ధరించాలి మీ పాదాలను హీటింగ్ ప్యాడ్స్, వేడినీటి బుడగలు, రూమ్హీటర్ల నుంచి, మంట నుంచి జాగ్రత్తగా చూసుకోండి కాలికి ఆనెకాయల వంటివి రాకుండా జాగ్రత తీసుకోండి. ఒకవేళ ఉంటే దానికి జిగురుగా ఉండే ప్లాస్టర్స్ వేయకండి కాలికి ఏవైనా రసాయనాలు అంటకుండా జాగ్రత్త తీసుకోండి. బలమైన యాంటీసెప్టిక్ పదార్థాలు పాదాలకు తగలకుండా జాగ్రత్త తీసుకోండి మీ బొటనవేలి గోరును కట్ చేసుకునే సమయంలో కాస్త బయటికే ఉండేలా ట్రిమ్ చేసుకోండి చాలా బిగుతుగా ఉండే స్టాకింగ్స్ వంటివి ధరించవచ్చు. లైట్‌కలర్స్ ఉండే సాక్స్ వేసుకోవాలి. సాక్స్‌లో ఏవైనా చిరుగులు ఉంటే వాటిని ధరించవద్దు. పాదాల విషయంలో ఏ సందేహం వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ లంగ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. మార్కెటింగ్ జాబ్‌లో ఉన్నాను. స్మోకింగ్ అలవాటు వల్లే నా ఊపిరితిత్తి (లంగ్)కి క్యాన్సర్ సోకినట్లు ఈమధ్య నిర్వహించిన టెస్ట్‌లలో బయటపడింది. రేడియేషన్ థెరపీ చేయించుకుంటే నయమైపోతుందని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. పైగా ఊపిరి తీసుకున్నప్పుడల్లా లంగ్ కదులుతూ ఉంటుంది కాబట్టి రేడియేషన్ చికిత్స చేస్తున్నప్పుడు లంగ్తో పాటు ఇతర కణాలూ దెబ్బతింటాయేమోనని ఆందోళనగా ఉంది. నా అనుమానాలు నన్ను కలవరపెడుతున్నాయి. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - చంద్రశేఖర్, హైదరాబాద్ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం పొగతాగే అలవాటు. దీనికి తోడు మీరు మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారని అంటున్నారు కాబట్టి ఎక్కువగా తిరగడం వల్ల వాతావరణంలోని వాయు కాలుష్యం కూడా క్యాన్సర్‌కు కారణమై ఉండవచ్చు. మొదటి స్టేజ్ అంటున్నారు కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ లంగ్ క్యాన్సర్ సమస్యను రేడియేషన్ థెరపీతో సక్సెస్‌ఫుల్‌గా, సమూలంగా నిర్మూలించవచ్చు. రేడియేషన్ థెరపీలో వచ్చిన అత్యాధునిక చికిత్సలు మంచి ఫలితాలను అందజేస్తున్నాయి. ఆధునిక వైద్య విధానాలవల్ల ఏర్పడే ఇమేజింగ్‌తో లంగ్ కదులుతున్నప్పటికీ క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి, నాశనం చేస్తారు. కేవలం క్యాన్సర్ కణాలపై మాత్రమే ఈ రేడియేషన్ పడుతుంది. అది కూడా లంగ్‌లో ఉన్న క్యాన్సర్ కణాలపైనే పనిచేసేలా లక్ష్యాలను సంధిస్తారు. దాంతో లంగ్ కదులుతూన్నప్పటికీ, కేవలం టార్గెట్‌కు మాత్రమే చికిత్స కిరణాలు తగులుతాయి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మీ లంగ్‌కు గానీ, మీరు భయపడుతున్నట్లు దానికి పరిసరాల్లో ఉండే ఏ ఇతర అవయవాలకు గానీ ఎలాంటి హానీ జరగదు. ఇతర ఆరోగ్యకరమైన కణాలపై ఎలాంటి రేడియేషన్ ప్రభావమూ ఉండదు. రేడియేషన్ థెరపీతో కేవలం క్యాన్సర్ ఉన్న భాగమే నశిస్తుంది. మీ ఇతర అవయవాలు రేడియేషన్ ప్రభావానికి లోనుకావు. ఇప్పటివరకూ మీలాంటి కేసుల్లో అంతా పాజిటివ్ రిజల్ట్సే వచ్చాయి. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోకుండా నిరభ్యంతరంగా రేడియేషన్ థెరపీ తీసుకోవచ్చు. డాక్టర్ కె. కిరణ్ కుమార్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
పెరిగే బరువు... తగ్గే ఆయువు!
హిట్ బై ఫ్యాట్ ఒక వ్యక్తి ఉండాల్సినదాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయాణించడమేనని యూఎస్‌కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో 9,564 మంది స్థూలకాయం ఉన్నవారితో పాటు 3,04,011 మంది సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు.