ఆహారవాహికలో  రక్తనాళాలు ఉబ్బాయి...ప్రమాదమా? | Swollen Blood Vessels can Totally Alleviate | Sakshi

ఆహారవాహికలో  రక్తనాళాలు ఉబ్బాయి...ప్రమాదమా?

May 13 2019 12:34 AM | Updated on May 13 2019 12:34 AM

Swollen Blood Vessels can Totally Alleviate - Sakshi

నా వయసు 65 ఏళ్లు. నేను ఆల్కహాలిక్‌ సిర్రోసిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాను. నాకు ఎండోస్కోపీ చేసి ఆహారవాహికలో రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయని చెప్పారు. వాటివల్ల ఏదైనా ప్రమాదమా? 

మీకు సిర్రోసిస్‌ అనే జబ్బు వల్ల ఆహారవాహికలో ‘ఈసోఫేజియల్‌ వారిసెస్‌’ అనేవి అభివృద్ధి చెందాయి. వీటి పరిమాణాన్ని బట్టి మీకు మున్ముందు రక్తపువాంతులు అయ్యే అవకాశం ఉంది. ఈ వారిసెస్‌ అనేవి ఏ పరిమాణంలో ఉన్నాయన్న విషయం మీరు రాయలేదు. మాములుగా వారిసెస్‌ పరిమాణం గ్రేడ్‌3 లేదా గ్రేడ్‌ 4 ఉన్నట్లయితే అవి పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు రక్తపువాంతుల విషయాన్ని మీ లేఖలో ప్రస్తావించలేదు కాబట్టి మీకు ఇంతకు ముందు ఆ రక్తపు వాంతులు అయినట్లు లేదు. కాబట్టి మీరు ప్రొప్రనాల్‌ 20 ఎంజీ, రోజుకు రెండుసార్లు వాడితే సరిపోతుంది. మీ సైమస్యకు ఎండోస్కోపీ ద్వారా ‘బ్యాండింగ్‌’ అనే చికిత్స చేసి, ఉబ్బిన రక్తనాళాలను పూర్తిగా తగ్గేటట్లు చేయవచ్చు. దానివల్ల రక్తపువాంతులు అయ్యే అవకాశం తగ్గుతుంది. మీకు ఆల్కహాల్‌ అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. 

పిత్తాశయాన్ని తొలగించిన చోట తరచూ నొప్పి... ఎందుకిలా? 

నా వయసు 50 ఏళ్లు. మూడేళ్ల కిందట లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా నా పిత్తాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం రెండు నెలల నుంచి అదే ప్రాంతంలో తరచూ నొప్పి వస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? నాకు తగిన సలహా ఇవ్వండి. 

సాధారణంగా లివర్‌లో ఉద్భవించే పైత్యరసం చిన్న చిన్న నాళాల ద్వారా వచ్చి పిత్తాశయంలో చేరుతుంది. పిత్తాశయం లోని సీబీడీ అనే నాళం ద్వారా చిన్న పేగుల్లోకి చేరుతుంది. మీకు పిత్తాశయం తొలగించిన తర్వాత నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముందుగా అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేసి సీబీడీ అనే నాళంలో ఏమైనా రాళ్లు ఉన్నాయేమో చూపించుకోగలరు. ఒకవేళ అల్ట్రాసౌండ్‌ నార్మల్‌గా ఉన్నట్లయితే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని ‘అల్సర్స్‌’కు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయేమో నిర్ధారణ చేసుకోవాలి. పైన తెలిపిన కారణాలు ఏమీ లేనట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. 

పాపకు మలంలో రక్తం పడుతోంది... సలహా ఇవ్వండి 

మా పాప వయసు ఎనిమిదేళ్లు. అప్పుడప్పుడూ మలంలో రక్తం పడుతోంది. మామూలుగా మలవిసర్జనలో ఎలాంటి సమస్యా లేదు. మా పాప విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. 

మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ పాప వయసు రీత్యా, ఆమెకు పెద్దపేగుల్లో కణుతులు (పాలిప్స్‌) ఉండే అవకాశం ఉంది. వాటివల్ల అప్పుడప్పుడూ మలంలో రక్తం పడే అవకాశం ఉంటుంది. ఇలా తరచూ రక్తం పోవడం వల్ల రక్తహీనత (అనీమియా)కు దారితీసే ప్రమాదం ఉంది. మీరు ఒకసారి మీ పాపకు ‘సిగ్మాయిడోస్కోపీ’ అనే పరీక్ష చేయించండి. ఒకవేళ పాలిప్స్‌ ఏవైనా ఉన్నట్లయితే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని పూర్తిగా తొలగించవచుచ. దానివల్ల పాపకు పూర్తిగా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. 

చికిత్స చేయించుకున్న తర్వాత కూడా జ్వరం, కామెర్లు! 

నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది కిందటి నుంచి కడుపులో నొప్పి, కామెర్లు, దురద వస్తే వైద్యపరీక్షలు చేయించుకున్నాను. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈఆర్‌సీపీ అనే పరీక్ష చేసి స్టెంట్‌ వేశారు. మళ్లీ నెల రోజుల నుంచి జ్వరం రావడం, కళ్లు పచ్చగా మారడం జరుగుతోంది. నాకు సరైన సలహా ఇవ్వండి. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు గాల్‌స్టోన్స్, సీబీడీ స్టోన్స్‌ అనే సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మీకు కడుపులో వేసిన బిలియరీ స్టెంట్‌ మూసుకుపోయి ఉండవచ్చు. అందువల్ల మీకు కామెర్లు, జ్వరం వస్తున్నాయి. మీరు తక్షణం మళ్లీ ఈఆర్‌సీపీ చేయించుకోండి. ఇది అత్యవసరంగా జరగాల్సిన చికిత్స, ఈఆర్‌సీపీ వల్ల సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించవచ్చు. దాంతోపాటు మూసుకుపోయిన స్టెంట్‌ స్థానంలో కొత్త స్టెంట్‌ అమర్చవచ్చు. ఈఆర్‌సీపీ తర్వాత మీరు లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే మీరు ఆపరేషన్‌ చేయించుకుని ఉంటే బాగుండేది. మీరు చెప్పిన లక్షణాల నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈఆర్‌సీపీ ప్రక్రియనూ, లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్‌ సర్జరీని చేయించుకోండి. 

డాక్టర్‌ ఆశా సుబ్బలక్ష్మి, హెచ్‌ఓడీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోంటరాలజీ డిపార్ట్‌మెంట్,
కేర్‌ హాస్పిటల్స్‌ హైటెక్‌సిటీ, హైదరాబాద్‌ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement