Man Suffering With Kidney Failure And 5 Months Baby With Liver Infection Need Help - Sakshi
Sakshi News home page

5 నెలల పాపకు లివర్‌ ఇన్ఫెక్షన్‌.. సాయం కోసం ఎదురుచూపు

Published Mon, Jul 12 2021 10:58 AM | Last Updated on Mon, Jul 12 2021 2:03 PM

Liver Infection For 5 months Baby, Man Suffering With Kidney Failure Need Help - Sakshi

చిన్నారి నిక్షితతో తల్లిదండ్రులు, అన్నా చెల్లెలు విలోహిత్, నిక్షిత

సాక్షి, కామారెడ్డి: పిల్లలు పుట్టారన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎక్కువ కాలం లేకుండా పోయింది. తొలి సొంతానంగా పుట్టిన కొడుకును వింత వ్యాధి పీడిస్తోంది. తర్వాత జన్మించిన కూతుర్ని అనారోగ్యం వేధిస్తోంది. తల్లి ఒడిలో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారికి పెద్ద కష్టం వచ్చి పడింది. అమ్మ పాలు తాగుతూ ఆడుకోవాల్సిన చిన్న వయస్సులోనే లివర్‌ ఇన్ఫెక్షన్‌ సోకింది. గతంలో రూ.7 లక్షలు అప్పు చేసి పాపకు ఆపరేషన్‌ చేయించారు తల్లిదండ్రులు. ప్రస్తుతం కాలేయ మార్పిడి కోసం రూ.25 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన శివలింగు సౌజన్య, నవీన్‌కు 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం కూతురు నిక్షిత పుట్టింది. మూడు నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్న పాప తర్వాత అనారోగ్యం బారిన పడింది. దీంతో వారు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూయించారు. ఫలితం లేకపోవడంతో చివరికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపకు లివర్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందని పిత్తాశయం ట్యూబ్‌ ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పడంతో రూ.7లక్షలు అప్పు చేసి ఆపరేషన్‌ చేయించారు. నెల రోజులు బాగానే ఉన్నా తీవ్ర జ్వరం రావడంతో మళ్లీ హైదరాబాద్‌కు తీసుకెళ్లగా వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. పాపకు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని సూచించారు.

పాప ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆపరేషన్‌కు రూ.25లక్షలకు వరకు ఖర్చవుతుందని తెలపడంతో దంపతులు ప్రస్తుతం విలవిలలాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌజన్య టీటీసీ పూర్తి చేసి కొద్దిరోజులు ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలిగా పని చేసి బాబు పుట్టగానే ఇంటి పట్టునే ఉంటుంది. నవీన్‌ బీఈడీ చేసి ఉద్యోగం రాకపోవడంతో ఉన్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేదరికంలో ఉన్న తాము ఇప్పటికే అప్పులు చేసి చిన్నారికి ఆపరేషన్‌ చేయించామని.. ప్రస్తుతం లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించడానికి దాతలు చేయూత అందించాలని కోరుతున్నారు. పాపకు లివర్‌ మారి్పడి కోసం తండ్రి నవీన్‌ను అన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం నవీన్‌ లివర్‌ను తన పాపకు మారి్పడి చేయడానికి ఆపరేషన్‌ అవసరం.

మంచానికే పరిమితమైన కొడుకు 
ఐదేళ్ల క్రితం వీరికి జన్మించిన కొడుకు విలోహిత్‌ సైతం అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. బాబు పుట్టిన కొద్ది రోజులకే కదలిక, ఏడుపు లేకపోవడంతో చాలా ఆ్రస్పతులు చూపెట్టి లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకపోయింది. డౌన్‌ సిండ్రోమ్‌ వ్యాధి సోకడంతో రూ.ఐదు లక్షలకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆ బాబు మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిని తప్పా ఎవ్వరిని గుర్తుపట్టలేడు.

ఫోన్‌ పే నంబర్‌: 9848793242 (సౌజన్య చెల్లి సంధ్యారాణి)  
బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు:  
శివలింగు సౌజన్య (పాప తల్లి) 
అకౌంట్‌ నంబర్‌: 49630100005080 
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌:  BARBOKAMARE

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
బోనకల్‌: ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సుగంధం మల్లికార్జునరావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను ఇంటర్‌ వరకు చదివించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పైచదువులకు వెళ్లలేదు. పెద్ద కుమారుడు వెంకటేష్‌ ఖమ్మంలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కుటుంబానికి ఆపద వచ్చి పడింది. తీవ్ర జ్వరంతో వెంకటేష్‌ బాధ పడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు కిడ్నీలు పని చేయడం లేదని, అవి ఉండాల్సిన దాని కంటే చిన్నవిగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.


కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వెంకటేష్‌ 

తల్లిదండ్రులు 6 నెలలుగా అనేక ఆస్పత్రులల్లో రూ.2 లక్షలు వరకు ఖర్చు చేశారు. మూడు రోజులకోసారి డయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లి గవ్వలేక రెక్కాడితే గానీ డొక్కాడని తల్లిదండ్రులు అందినకాడికి అప్పులు చేసి వైద్యం చేయించారు. ప్రస్తుతం వెంకటేష్‌ మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో తల్లిదండ్రులు ఆపన్న హస్తంకోసం ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు 70322 13517 నంబర్‌ను సంప్రదించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement