ఫ్యాటీలివర్‌ అంటున్నారు.. సలహా ఇవ్వండి | Liver Absorbs Fatty Substances and Makes Them Useful for the Body | Sakshi
Sakshi News home page

ఫ్యాటీలివర్‌ అంటున్నారు.. సలహా ఇవ్వండి

Published Fri, Apr 26 2019 1:03 AM | Last Updated on Fri, Apr 26 2019 1:03 AM

Liver Absorbs Fatty Substances and Makes Them Useful for the Body - Sakshi

నా వయసు 58 ఏళ్లు. ఇటీవల జనరల్‌ హెల్త్‌ చెకప్‌లో భాగంగా స్కానింగ్‌ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్‌ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. 

లివర్‌ కొవ్వు పదార్థాలను గ్రహించి అవి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. అయితే కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్‌ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్‌. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వవున్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్‌ సిర్రోసిస్‌ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్‌ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు.

 మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్‌ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ∙మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి ∙లినోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు ∙తరచూ చేపమాంసాన్ని అంటే వారానికి  100–200 గ్రాములు తీసుకోవడం మంచిది ∙మటన్, చికెన్‌ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్‌ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్‌ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్‌ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. 

కడుపులో మంట... పరిష్కారం చెప్పండి 

నా వయసు 42 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి కడుపులోనూ, ఛాతీభాగంలోనూ   మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్‌ సిరప్‌ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. 

మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ (జీఈఆర్‌డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... 

►మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం
►కాఫీ, టీలను పూర్తిగా మానేయడం
►పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం
►బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం
►భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి
►తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. 
►పై సూచనలతో పాటు మీ డాక్టర్‌ సలహా మీద పీపీఐ డ్రగ్స్‌ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. 

గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు...సలహా ఇవ్వండి

నేను నెల రోజుల క్రితం కంప్లీట్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్‌ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. 

మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు అసింప్టమాటిక్‌ గాల్‌స్టోన్‌ డిసీజ్‌ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారి ఓ ఏడాదికి నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. కాబట్టి మీకు వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటే, ఆపరేషన్‌ అవసరం లేదు. మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు. 

తరచూ కడుపునొప్పి..మందులు వేసుకుంటేనే తగ్గుతోంది..

నా వయసు 37 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. మల విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. కొన్నిసార్లు మలబద్ధకం, మరికొన్నిసార్లు  విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. 
 
మీరు రాసిన లక్షణాలను బట్టి మీరు ఐబీఎస్‌ (ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన చెందుతుండే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్‌ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్‌ అని వస్తే మీకు ఐబీఎస్‌ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్‌ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య తగ్గుతుంది.

డాక్టర్‌ భవానీరాజు సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, 
బంజారా హాస్పిటల్స్, కేర్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement