Health checkup
-
మా బిల్డింగ్ గురించి రెండు నెలల్లో ప్రకటిస్తాం: మంచు విష్ణు
‘‘మేం ఏం అనుకుని వచ్చామో ఆ పనులన్నీ పూర్తి చేశాం. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) బిల్డింగ్ ఒక్కటే బాకీ ఉంది. ఈ అంశంపై కూడా రాబోయే రెండు నెలల్లో ఓ అద్భుతమైన ప్రకటన చేయబోతున్నాం’’ అని ‘మా’అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. జీవీకే హెల్త్ హబ్ అసోసియేషన్‌తో ‘మా’ ఆధ్వర్యంలో సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అధ్యక్షుడు మంచు విష్ణు, ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘జీవీకే హెల్త్ హబ్ యాజమాన్యానికి, డాక్టర్ శాస్త్రిగారితో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. ‘మా’ సభ్యులందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు’’ అని అన్నారు. ‘‘ఆదివారం వరల్డ్ హార్ట్ డే. ఆర్టిస్టులు ఎంతో ఒత్తిడితో ఉంటారు. అందుకే వీరి కోసం మాస్టర్ చెకప్ చేశాం’’ అన్నారు డా. శాస్త్రి. ‘మా’లోని సభ్యుల్లో దాదాపు నాలుగు వందల మంది ఈ హెల్త్ క్యాంప్‌లో పాల్గొని, చెకప్ చేయించుకున్నారని సమాచారం. -
మహిళాజర్నలిస్టుల కోసం స్పెషల్ యాక్సిలేటరీ ప్రోగ్రాం
ఖైరతాబాద్: మహిళాజర్నలిస్టులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున వి హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్సిలేటరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో మహిళాజర్నలిస్టులను మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సన్మానించారు. కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రులు జగదీష్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులతో కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా జర్నలిజం అంటే కత్తిమీద సాములాంటిది. అలాంటి వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎల్రక్టానిక్, ప్రింట్ మీడియాలతో పాటు డిజిటల్ మీడియాలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరి, మున్సిఫల్ అడ్మిని్రస్టేషన్ అరవింద్ కుమార్, చీఫ్ విఫ్ బాల్కసుమన్, ఎమ్మెల్యే చందర్లతో పాటు అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సాక్షి టీవీ తరపున పద్మావతి, సుస్మిత, కావేరి, సాక్షి దినపత్రిక నుంచి కట్ట కవిత, డి.జి.భవానీ, వి.మంజుల, జి.నిర్మల, ఎస్.సరస్వతి రమలను సన్మానించారు. -
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయనకు ఆస్పత్రి వైద్యులు అందుకు సంబంధించిన ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా యశోదా ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: (తెలంగాణ సీజేగా హిమాకోహ్లి ప్రమాణస్వీకారం) -
ఫ్యాటీలివర్ అంటున్నారు.. సలహా ఇవ్వండి
నా వయసు 58 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. లివర్ కొవ్వు పదార్థాలను గ్రహించి అవి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. అయితే కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వవున్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ∙మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి ∙లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు ∙తరచూ చేపమాంసాన్ని అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది ∙మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. కడుపులో మంట... పరిష్కారం చెప్పండి నా వయసు 42 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి కడుపులోనూ, ఛాతీభాగంలోనూ మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... ►మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం ►కాఫీ, టీలను పూర్తిగా మానేయడం ►పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం ►బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం ►భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి ►తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. ►పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. గాల్ బ్లాడర్‌లో రాళ్లు...సలహా ఇవ్వండి నేను నెల రోజుల క్రితం కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు అసింప్టమాటిక్ గాల్‌స్టోన్ డిసీజ్ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారి ఓ ఏడాదికి నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. కాబట్టి మీకు వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటే, ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు. తరచూ కడుపునొప్పి..మందులు వేసుకుంటేనే తగ్గుతోంది.. నా వయసు 37 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. మల విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. కొన్నిసార్లు మలబద్ధకం, మరికొన్నిసార్లు విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. మీరు రాసిన లక్షణాలను బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన చెందుతుండే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య తగ్గుతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, బంజారా హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
కాలేయం సైజు పెరిగింది... ఎందుకు?
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 37 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద గత పదిరోజుల నుంచి విపరీతంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. నాకు తగిన సలహా ఇవ్వండి. – కె. మల్లారెడ్డి, ఇల్లందు మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్నిరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతోపాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయి... చికిత్స ఏమిటి? నేను వారం కిందట మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌లో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. అయితే నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. ఇలా రాళ్లు ఉన్నవారికి ఆపరేషన్ అవసరమవుతుందని కొందరు భయపెడుతున్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా చెప్పండి. – డి. శ్రీనివాసరావు, చిట్యాల మీరు చెప్పిన వివరాల ప్రకారం మీకు ‘ఎసింప్టమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్’ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి, వ్యాధి లక్షణాలే ఏమీ లేనివారిలో ఏడాదికి వందమందిలో సుమారు ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. మీకు వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఒకసారి మీకు దగ్గర్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిస్తే, వారు మీ కండిషన్‌ను ప్రత్యక్షంగా చూసి తగిన సలహా ఇస్తారు. కడుపులోకి నీరు వస్తోంది.. ఏం చేయాలి? నా వయసు 56 ఏళ్లు. నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. ఇటీవల నాకు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్నడాక్టర్ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్. జగన్నాథం, మంచిర్యాల మీకు లివర్ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. ఆ రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదిస్తే మీకు తగిన చికిత్స అందిస్తారు. ఎసిడిటీ ఎంతకూ తగ్గడం లేదు... పరిష్కారం చెప్పండి. నా వయసు 46 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. ఆరు నెలలుగా మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేదు. దీనికితోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – జి. జగదీశ్వరప్రసాద్, కాకినాడ మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం రాయలేదు. ఇక రెండో అంశం మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, బంజారా హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు..
-
శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు..
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సిట్ కార్యాలయంలో బుధవారం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు. బీపీ, పల్స్‌రేటు బాగానే ఉన్నట్టు తెలిపారు. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి నిందితుడి కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడుకు చెందిన నాగూర్ వలి కుటుంబాన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగూర్ వలి ఇచ్చిన సమాచారంతో మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిందితుడిని చూడాలంటూ అతని తల్లిదండ్రులు కోరడంతో వారిని పోలీసులు విశాఖకు తీసుకెళ్లారు. సంబంధిత కథనాలు: ఆ 4 వాక్యాల కోసం.. పెద్దల ‘షో’ శ్రీను.. కొత్త సీను వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; కదులుతున్న టీడీపీ డొంక -
నేడు సాయంత్రం హైదరాబాద్‌కు కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. కంటి, పంటి వైద్య పరీక్షల కోసం ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఈ రోజు ఉదయం కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే నిజాముద్దీన్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు దంత పరీక్షలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండనున్న నేపథ్యంలో.. వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
సయాటికా అంటున్నారు... సర్జరీ తప్పదా?
నా వయసు 46 ఏళ్లు. నాలుగు నెలల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాను. అది క్రమంగా ఎడమ తొడ నుంచి కాలి కిందికి దిగుతూ కాలి బొటనవేలి వరకూ పాకుతోంది. నిలబడ్డా, నడుస్తున్నా నొప్పి పెరుగుతోంది. పట్టుమని పదినిమిషాలు కూడా నడవలేకపోతున్నాను. లక్షణాలు చెబుతుంటే అది సయాటికా అని, సర్జరీ చేయించాల్సి ఉంటుందని తెలిసినవాళ్లు చెబుతున్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు పరిష్కారం చెప్పండి. – ఎమ్. దయానంద్, చిత్తూరు మీకు నడుము భాగంలో నొప్పి వచ్చి అది కిందికి పాకుతోందంటే వెన్నెముక కింది భాగంలోని వెన్నుపూసల (ఎల్5 లేదా ఎస్1) వల్ల నరాలు ఒత్తిడికి లోనవుతున్నాయని అర్థం. మన వెన్నుపూసల మధ్య ఘర్షణ తగ్గించేందుకు డిస్క్ అనే మెత్తటి భాగం ఉంటుంది. ఈ డిస్క్ భాగం... తన స్థానాన్నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ఈ కండిషన్ వస్తుంటుంది. దీన్నే ‘డిస్క్ ప్రొలాప్స్’ అంటారు. అరుదైన సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు, ట్యూమర్లు ఆ భాగానికి యాక్సిడెంట్లో దెబ్బతగలడం వంటివి ఇందుకు కారణం కావచ్చు. సాధారణంగా డిస్క్‌ప్రొలాప్స్ ఏర్పడ్డ 95 శాతం కేసుల్లో కేవలం విశ్రాంతి, కామన్‌గా వాడే మందులు, మన రోజువారీ పని భంగిమల మార్పు (పోష్చర్ మాడిఫికేషన్), కండరాలను కొన్ని వ్యాయామాలతో బలపరచడంతో మూణ్ణెల్లలోనే అది తగ్గిపోతుంది. అయితే నరం సప్లై అయ్యే భాగానికి తగిన స్పందనలు తెలియక, అక్కడి కండరం బలహీనం కావడం, చచ్చుబడటం లేదా కొన్నిసార్లు మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలు, మందులు వేసుకుంటున్నా అదుపులోకి రాని తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మారై వంటి పరీక్షలు చేయించి, సర్జరీ అవసరమని నిర్ధారణ జరిగితేనే శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు. ఇక శస్త్రచికిత్స అవసరమని తేలిన రోగుల్లోనూ దాదాపు 95 శాతానికి పైగా కేసుల్లో ఇది చాలా సురక్షితమైన సర్జరీ. ఏదైనా కాంప్లికేషన్లు వచ్చే అవకాశం కూడా కేవలం 1 శాతం కంటే తక్కువ. నిపుణులైన సర్జన్లు నిర్వహిస్తే ఈ మాత్రం అవకాశం కూడా ఉండదు. పైగా సర్జరీ తర్వాత ఒక రోజులోనే నడవడం సాధ్యమవుతుంది. కాబట్టి మీ సమస్య గురించి ఆందోళన పడకుండా మీరు వెంటనే అనుభవజ్ఞులైన న్యూరాలజీ నిపుణులను సంప్రదించండి. -
గాల్‌బ్లాడర్‌లో రాళ్లు... ఆపరేషన్ తప్పదా?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నేను నెల రోజుల కిందట జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. సలహా ఇవ్వండి. – సందీప్తి, వరంగల్లు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నవారందరికీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదనేది వాస్తవం. కానీ మీ స్థితిగతులను బట్టి, మీ అవగాహన బట్టి, మీరు ఉండే ప్రాంతంలోని ఆరోగ్య వ్యవస్థ... అంటే స్కిల్డ్ సర్జన్, హాస్పిటల్ ఉందా లేదా అనే అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ విషయంలో రోగికి సలహా లేదా సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా దూరప్రయాణాలు చేయాలనుకునేవారికి, హైరిస్క్ పేషెంట్స్కీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి... నొప్పి వంటి ఇతరత్రా ఇబ్బందులు లేకపోయినా ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. పేగుల్లో టీబీ... తగ్గుతుందా? నా వయసు 28 ఏళ్లు. కడుపునొప్పి వస్తోంది. బరువు కూడా తగ్గుతున్నాను. దాంతో వైద్యపరీక్షలు చేయించుకున్నాను. చిన్నపేగుల్లో టీబీ ఉందని డాక్టర్ అన్నారు. ఆరు నెలలుగా మందులు వాడుతున్నాను. ఇది పూర్తిగా నయమవుతుందా? తెలియజేయండి. – నితీష్, నరసరావుపేట చిన్నపేగులో టీబీ వచ్చినా మందుల ద్వారా తగ్గించవచ్చు. దానికి ఆరునెలల పాటు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా అందరికీ తగ్గిపోతుంది. కొంతమందిలో టీబీకి సంబంధించి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ పెరగడం వల్ల తగ్గకపోవచ్చు. ఇటువంటివారికి ఇప్పటివరకూ ఇస్తున్న మందులు మార్చి, మరో స్థాయి మందులు (సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్) చాలాకాలం పాటు కొనసాగిస్తారు. ఈ మందులు వేసుకున్నవారిలో కొంతమందికి చిన్నపేగులో ఉన్న పూత దెబ్బతినడం వల్ల కడుపునొప్పి పెరిగే అవకాశం ఉంది. వీరికి సర్జరీ ద్వారా చిన్నపేగులోని కొంతభాగాన్ని తీసివేసి మళ్లీ పేగును సరిదిద్దాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్‌ను ల్యాపరోస్కోపీ పద్ధతి ద్వారా చేయవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ అడ్డాల కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సంజీవని పెబెల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్, గుంటూరు -
మళ్లీ అమెరికాకు రజనీ.. హెల్త్ చెకప్ కోసమేనా..?
మరోసారి హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన రజనీ. ఇటీవల కాలా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసిన రజనీకాంత్ కూతురితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు రజనీ అక్కడే ఉండనున్నారట. గతంలో కబాలి, 2.0 సినిమాల షూటింగ్ గ్యాప్ లోనూ రజనీ ఇలాగే అమెరికా వెళ్లి వచ్చారు. అయితే మరోసారి చెకప్ కోసం వెళ్తున్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిందేమి లేదంటున్నారు సన్నిహితులు. 2011లో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ సమయంలో తొలుత చెన్నైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సింగపూర్‌కు వెళ్లి అక్కడ ఉన్న ప్రఖ్యాత మౌంట్ ఎలిజబెత్ హాస్పటల్లో చేరి పదిహేను రోజుల ట్రీట్మెంట్ తరువాత తిరిగి ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి కొద్దిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై రకరకాలైన పుకార్లు వినిపించగా, వాటిని కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. తాజాగా మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లటంతో రజనీ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మ వద్దన్నా... నువ్వు వినకు
ఈ నెల 14న మదర్స్ డే చిన్నప్పుడు స్నానం చేయమంటే అల్లరి చేసేవాళ్లం. అన్నం తినమంటే గొడవ చేసేవాళ్లం. స్కూలుకు వెళ్లమంటే మొండికేసేవాళ్లం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానంటే ఏడ్చి గీపెట్టేవాళ్లం. అమ్మ అన్నీ మన మంచి కోసమే చెప్పేది. కానీ మనం వద్దనే వాళ్లం. ఇవాళ అమ్మ వద్దనవచ్చు. అనవచ్చేంటీ... వద్దనే అంటుంది. ఈసారి మనం గారం చేద్దాం. అమ్మకు మంచి హెల్త్ చెకప్ చేయిద్దాం. ఆదివారం మదర్స్ డే. దాన్ని మన లైఫ్‌లో మోస్ట్ హ్యాపీడేగా మారుద్దాం. అమ్మ రుణం తీర్చుకుందాం. అమ్మ వద్దంటుంది. నువ్వు గారం చెయ్యి! పాప్ స్మియర్ సర్వైకల్ క్యాన్సర్‌ను తెలుసుకోడానికి చేయించే పరీక్ష ఇది. సర్విక్స్ అనేది తల్లి గర్భసంచిలోని ఒక భాగం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్లలోనూ అత్యంత ఎక్కువగా వచ్చేది ఇదే. పైగా దీనికి ప్రీ–క్యాన్సర్ దశ చాలా సుదీర్ఘకాలం పాటు ఉంటుంది. అందుకే పదేళ్ల ముందుగా కూడా దీన్ని కనుగొనేందుకు అవకాశం ఉంది. అలా ముందుగానే కనుక్కుంటే సర్వైకల్ క్యాన్సర్‌ను తప్పక నయం చేయవచ్చు. అందుకే 35 ఏళ్లు దాటాక క్రమం తప్పకుండా మహిళలకు ఈ పరీక్ష చేయించాలి. డాక్టర్ సూచించిన వ్యవధిని పాటించాలి. ఇది ఏ మాత్రం నొప్పి లేకుండా చేసే పరీక్ష. మామోగ్రామ్ మహిళల్లో సాధారణంగానూ, ఎక్కువగానూ కనిపించే బ్రెస్ట్‌క్యాన్సర్‌ను కనుగొనే పరీక్ష ఇది. దీన్ని తొలిదశలోనే కనుగొంటే రొమ్మును తొలగించనవసరం లేకుండానే (మాసెక్టమీ చేయకుండానే) చికిత్స అందించడానికి అవకాశం ఉంది. ఇది కూడా నొప్పి లేని సులువైన పరీక్ష. అమ్మకు 40 ఏళ్లు దాటినప్పటి నుంచి తప్పక చేయించాల్సిన పరీక్ష ఇది. మహిళల రొమ్ములో గడ్డలాంటిది ఏదైనా తగులుతూ ఉన్నా, రొమ్ములలో నొప్పి, సలపరం ఉన్నా, కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలా ఉన్నా తప్పక చేయించాల్సిన పరీక్ష ఇది. బోన్డెన్సిటీ టెస్ట్ యాభై ఏళ్లు వయసు పైబడ్డ మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సాధారణం. ఆస్టియోపోరోసిస్ వస్తే ఎముకలు పెళుసుగా మారి, సులువుగా విరుగుతుంటాయి. మెనోపాజ్ దాటాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ సమస్య వస్తుంది. 60 ఏళ్లు దాటిన మహిళల్లో 50%, 80 ఏళ్లు దాటినవారిలో 90% మహిళల్లో ఇది కనిపిస్తుంది. బోన్డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియోపోరోసిస్‌ను కనుక్కోవచ్చు. ఇందులో మణికట్టు, వెన్నుముక, తుంటిఎముక భాగాలను ఈ బోన్‌డెన్సిటో మీటర్ (డెక్సా స్కాన్)తో పరీక్షిస్తారు. ఆస్టియోపోరోసిస్‌ను నివారించడానికి వ్యాయామం, ఆహారంలో క్యాల్షియం చాలా ముఖ్యం. టీ3, టీ4, టీఎస్‌హెచ్ థైరాయిడ్ సమస్య తెలుసుకోవడం కోసం చేసే పరీక్ష ఇది. థైరాయిడ్మస్యల్లో మొదటిది హైపోథైరాయిడిజమ్. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం. మరొక సమస్య చాలా తక్కువగా పనిచేయడం, అది హైపోథైరాయిడిజమ్. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఈ కండిషన్ కనిపించినప్పటికీ మహిళల్లోనే ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హైపోథైరాయిడిజమ్ కనిపిస్తుంది. తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ పాళ్లు తగ్గుతున్నాయేమోనని గమనించాలి. ఇక థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య హైపర్‌థైరాయిడిజమ్. ఇది వచ్చిన మహిళలు సన్నగా మారడం, బరువు తగ్గడం, జుట్టు రాలిపోవడం, రాత్రివేళల్లో నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. పైన పేర్కొన్న థైరాయిడ్ సంబంధిత సమస్యలను తెలుసుకోవడం కోసం టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష చాలా ముఖ్యం. యూరిన్ టెస్ట్ మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు ఎక్కువ. అందుకే మూత్ర పరీక్ష మహిళలకు చాలా అవసరం. ఇన్ఫెక్షన్లను తెలుసుకునేందుకు మాత్రమేగాక మరికొన్ని ఇతర సమాచారాలు తెలుసుకునేందుకు సైతం మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ తీవ్రత వంటివి తెలుసుకునేందుకు కూడా మూత్ర పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల టెస్ట్ నిన్నమొన్నటి వరకు మహిళలు కట్టెల పొయ్యి దగ్గర చిక్కటి పొగలో వంట చేసేవారు. రెండు దశాబ్దాల నుంచి గ్యాస్ వచ్చింది. ఇప్పటికీ చాలా మారుమూల ప్రదేశాల్లో గ్యాస్ సౌకర్యం లేని ప్రాంతాలున్నాయి. అందుకే అక్కడి మహిళల్లో ఊపిరితిత్తులను ప్రభావం చేసే ఆస్తమా, సీఓపీడీ, ఇతర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులకు ఆస్కారం ఎక్కువ. అందుకే ఊపిరితిత్తుల సామర్థ్యాలను తెలుసుకునే పీఎఫ్‌టీ, స్పైరోమెట్రీ వంటివి చేయించడం అవసరం కావచ్చు. డెంటల్ చెకప్ యాభై ఏళ్లు దాటిన మహిళలలో దంతాలు, చిగుర్లు, ఓరల్ హెల్త్‌కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగానే ప్రతి ఒక్కరూ ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం మంచిదని డెంటిస్టులు సలహా ఇస్తుంటారు. అలాంటప్పుడు ఒక వయసు దాటిన మహిళలకు నోటి పరీక్షలు ఎంతగా అవసరమో చెప్పనక్కర్లేదు. పైగా నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్) బాగా ఉంటే గుండెజబ్బులు రాకపోవడం మొదలుకొని అన్ని అవయవాల ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. అమ్మకు గుండె పరీక్షలు ఈసీజీ : అమ్మకు ఛాతీ నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తే వెంటనే చేయించాల్సిన మొదటి పరీక్ష ఇది. అయితే చిన్న గుండెపోటును ఈసీజీ ద్వారా గుర్తించడం సాధ్యం కాదు. ఈ రోజుల్లో ఈసీజీ మెషిన్లోని కంప్యూటరు కొన్ని క్లూస్ ఇస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈసీజీలో మార్పులు చోటుచేసుకోడానికి కొంత సమయం పడుతుంది. అంటే గుండెపోటు వచ్చిన వెంటనే తీసిన ఈసీజీలో అది నమోదు కాకపోవచ్చు కూడా. అందుకే ఒక్క ఈసీజీ ఆధారంగానే గుండెపోటు వచ్చిందా లేదా అన్నది నిర్ధారణ చేయలేం. గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. కానీ కొందరు ఛాతీనొప్పి వచ్చాక ఈసీజీ తీసినా రిపోర్టు ఇవడానికి 12–24 గంటల సమయం తీసుకుంటారు. గుండెనొప్పి అని అనుమానించినప్పుడు అలాంటి పరీక్షకేంద్రాల్లో ఈసీజీ తీయించుకోవడం సరికాదు. ఎకో పరీక్ష : సాధారణంగా గుండెపోటును అనుమానించినప్పుడు ఎకో పరీక్ష చేయడం అన్ని చోట్లా కుదరదు. ఎందుకంటే ఆ పరీక్ష చేయడానికి హృద్రోగనిపుణలకు మాత్రమే తర్ఫీదు ఉంటుంది. కాబట్టి కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే ఆ పరీక్ష చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో ఛాతీ నొప్పి వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ వద్దకు మాత్రమే వెళ్తారనే గ్యారంటీ లేదు. ప్రత్యేకంగా చిన్న నగరాలు మొదలుకొని పట్టణాల వరకు ఆ అవకాశం కాస్తంత తక్కువ. అయితే గుండెజబ్బు వల్ల ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకునేందుకు ఎకో పరీక్షలో అవకాశాలు 95 శాతం కంటే ఎక్కువ. యాంజియోగ్రామ్ : గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష చేయిస్తే మంచిది. ఇందులో గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి కచ్చితంగా తెలుస్తాయి. కానీ ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువ. ఇదివరకటి రోజుల్లో ఈ పరీక్ష వల్ల కొన్ని కాంప్లికేషన్లు వచ్చేవి. కానీ ఈరోజుల్లో ఈ పరీక్ష చాలా సులువు. ఇబ్బందులూ అంతగా ఉండవు. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. టీఎమ్‌టీ పరీక్ష : సాధారణంగా ట్రెడ్ మిల్ టెస్ట్ అని పిలిచే దీన్నే కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్ అని కూడా అంటారు. ట్రెడ్ మిల్ అనే పరికరం మీద వేగంగా నడవడం ద్వారా గుండెపై ఒత్తిడి కలిగించి చేసే పరీక్ష ఇది. నడక లేదా ఇతర శారీరక శ్రమ సమయంలో గుండె పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే పరీక్ష ఇది. ఈస్ట్రోజెన్ టెస్ట్ తమకు 45 ఏళ్లు వచ్చాక రుతుక్రమం ఆగిపోవడం కూడా మహిళల్లో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఆ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్ స్వింగింగ్), ఆస్టియోపోరోసిస్‌తో ఎముకలు బలహీనం కావడం, గుండెజబ్బులకు గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. రుతుక్రమం (మెనోపాజ్) ఆగిన మహిళల్లో ఏవైనా తేడాలు / సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స చేయించాలి. ఇలాంటి వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) వంటి చికిత్సలను డాక్టర్లు సూచిస్తారు. సీబీపీ రక్త పరీక్ష మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. మనదేశంలో దాదాపు 85 శాతం మహిళల్లో రక్తహీనత ఉందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్ల యుక్తవయసు వచ్చే నాటికి ఆమెకు రుతుస్రావం మొదలై రక్తస్రావం జరుగుతుంటుంది కాబట్టి మహిళల్లో రక్తహీనత చాలా సాధారణమైన సమస్య. కాబట్టి మహిళల్లో నిర్వహించాల్సిన ముఖ్యమైన పరీక్ష ఇది. ఇక ఒక్క హిమోగ్లోబిన్ మాత్రమే కాదు... దానితో పాటు రక్తంలోని మిగతా అంశాలైన తెల్లరక్తకణాల్లోని బేసోఫిల్స్, ఇజినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ వంటి వాటిని కూడా లెక్కించి, అవన్నీ నార్మల్‌గానే ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవడం ఈ పరీక్షతో సాధ్యమవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే రక్తాన్ని గడ్డకట్టించి ప్రాణాలు కాపాడే ప్లేట్లెట్స్ సంఖ్య కూడా ఈ పరీక్షలో తెలుస్తుంది. రక్తంలోని దాదాపుగా అన్ని అంశాలనూ తెలుసుకునేందుకు ఉపకరించే పరీక్ష... ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే పాప్ స్మియర్, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రామ్ పరీక్షలు కాకుండా... ఇతర రకాల క్యాన్సర్లను తెలపడం కోసం ప్రాథమికంగా చేసే కొన్ని రక్తపరీక్షలు కూడా చేయించడం మేలు. ఉదాహరణకు సెర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకునే పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) పరీక్షలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును తెలుసుకునే లో–డోస్ హెలికల్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ పరీక్షల వంటివి ఇందుకు ఉదాహరణలు. ఇక లక్షణాలను బట్టి పెద్దపేగు, మలద్వారం వద్ద ఏర్పడే క్యాన్సర్ ముప్పులను తెలుసుకోడానికి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ (ఎఫ్ఓబీటీ) వంటివి కూడా చేయించాల్సిరావచ్చు. రక్తసంబంధిత క్యాన్సర్లను తెలుసుకోవడం కోసం కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) వంటివి అవసరం కావచ్చు. విటమిన్ బి 12 టెస్ట్ నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్రరక్తకణాల తయారీకి విటమిన్ బి12 తప్పనిసరి. నిజానికి విటమిన్లు మన శరీర పోషణకు చాలా ముఖ్యమైనవి. విటమిన్ బి12 నీళ్లలో కరిగే విటమిన్. దీన్ని సైనకోబాలమిన్ అంటారు. శరీరంలో దీని మోతాదు తగ్గడాన్ని హైపోకోబాలమినియా అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారం నుంచి విటమిన్ బి12ను గ్రహించే శక్తి తగ్గుతుంది. అది విటమిన్ బి12 లోపానికి దారితీస్తుంది. దాంతో మెదడు చురుగ్గా పనిచేయకపోవడం, అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి ఒకవేళ మహిళల్లో నీరసం, నిస్సత్తువ, నడుము–కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ బి12 ఉందేమో తెలుసుకునే రక్తపరీక్ష చేయించాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ రక్తంలో కొవ్వుల పాళ్లు అవసరమైన మోతాదులకు మించితే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు. పైగా 45 ఏళ్లు దాటిన వారిలో రిస్క్ ఎక్కువ. శరీరంలోని కొవ్వులు, కొలెస్ట్రాల్ పాళ్లు తెలుసుకోడానికి లిపిడ్ ప్రొఫైల్ రక్తపరీక్ష చేస్తారు. ఇందులో శరీరంలోని ఎల్డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి అనేక కొవ్వుల పాళ్లు తెలుస్తాయి. చెడు కొలెస్ట్రాల్(ఎల్డీఎల్) ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇక హెచ్‌డీఎల్ అనేది మన రక్తనాళాల్లో కొవ్వును చేరకుండా చేస్తుంది. కాబట్టి మంచికొలెస్ట్రాల్గా పరిగణించే హెచ్‌డీఎల్ నిర్ణీత మోతాదులో ఉండాలి. ఇక ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు ఎల్డీఎల్ లాగే హాని చేసేవి. లిపిడ్ పరీక్షల ఫలితాలకు అనుగుణంగా డాక్టర్ సూచించే ఆహార మార్పులు, న్యూట్రిషన్ సూచనలు తమ తల్లులు అనుసరించేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విటమిన్ – డి టెస్ట్ అనాది నుంచి పురుషులతో పోలిస్తే మహిళలు ఆరుబయటి గాలికీ, ఆరుబయటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు తక్కువ. దాంతో మహిళల్లో విటమిన్–డి పాళ్లు తగ్గడానికి అనువైన పరిస్థితులు అన్ని చోట్లా నెలకొని ఉన్నాయి. పైగా ఇటీవల విటమిన్–డి లోపం ఉండటం సర్వసాధారణంగా మారింది. అందుకే ఈ లోపాన్ని తెలుసుకునేందుకు అవసరమైన రక్తపరీక్ష కూడా చేయించడం చాలా ముఖ్యం. షుగర్ టెస్ట్ చక్కెర వ్యాధిని గుర్తించడానికి కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి: ఫాస్టింగ్ సుగర్ టెస్ట్... దీన్ని చేయించడానికి ముందర కనీసం ఎనిమిది గంటల సేపు ఏమీ తినకుండా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ర్యాండమ్ సుగర్ టెస్ట్ తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు. ఇవి కాకుండా, బ్లడ్ సుగర్ పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) కూడా చేస్తారు. షుగర్ వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మూత్ర పరీక్ష కూడా చేస్తారు. యాభై ఏళ్లు దాటిన తర్వాత మహిళలకు తప్పనిసరిగా క్రమం తప్పకుండా షుగర్ పరీక్షలు చేయించడం అవసరం. పిల్లలుగా మన తల్లికి మనం చేయించాల్సిన పరీక్షల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇవి గాక క్రమం తప్పకుండా చేసే రక్తపోటు కొలవడం (బీపీ రీడింగ్) మొదలుకొని... ఆయా మహిళల అవసరం మేరకు చేసే ప్రత్యేక పరీక్షల వరకు వారి వారి అవసరాల మేరకు చేయించాల్సిన బాధ్యత మనదే. కడుపులోని అవయవాల కోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష అత్యంత ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉండే శబ్ద తరంగాలను శరీరంలోకి పంపి ఈ పరీక్ష చేస్తారు. ఆ తరంగాలు వల్ల ఏర్పడ్డ ప్రతిబింబం (ఇమేజ్)తో శరీరంలోని అంతర్గత అవయవాలను చూసి, వాటిని విశ్లేషిస్తారు. తద్వారా లోపలి అవయవాల పనితీరును తెలుసుకునే పరీక్ష ఇది. దీని ద్వారా కడుపులోని అవయవాలైన కాలేయం, గాల్‌బ్లాడర్, పాంక్రియాస్, కిడ్నీ, అపెండిక్స్ వంటి భాగాలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి వీలవుతుంది. కడుపు భాగంలో ఉండే అవయవాలలో ఎక్కడైనా రక్తం గడ్డకట్టుకుపోయి ఉండటం, గాల్ బ్లాడర్లోని రాళ్లు, పాంక్రియాటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు, లివర్ క్యాన్సర్, అపెండిసైటిస్, కడుపులో ఉండే గడ్డల వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు. – డాక్టర్ శైలజ, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్, నాంపల్లి, హైదరాబాద్ -
కబడ్డీ క్రీడాకారులకు వైద్య సేవలు
బాలాజీచెరువు (కాకినాడ) : ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సామర్లకోటలోని పల్లంబీడు మైదానంలో గురువారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి స్త్రీ, పురుషుల విభాగాల నుంచి 26 జట్లు విచ్చేశాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూకే నుంచి స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ పీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ సురేంద్ర, డాక్టర్ దీపక్‌ల వైద్య బృందం క్రీడాకారులకు ప్రాథమిక వైద్యచికిత్సను అందించనున్నారు. క్రీడాకారులు ఆహారం, ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించనున్నారు. -
ముద్రగడ షుగర్ లెవల్స్ డౌన్!
కిర్లంపూడి: ఆమరణ దీక్ష చేపట్టిన ముద్రగడ దంపతులకు డాక్టర్లు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడ పద్మనాభానికి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు, అధికారులు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ నేత చేపట్టిన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేతలు, ప్రజల నుంచి విశేషమైన మద్ధతు లభిస్తోంది. గరిటెలతో ఖాళీ కంచాలు మోగిస్తూ శబ్ధం చేస్తూ ముద్రగడ దంపతులు, కుటుంబసభ్యులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు 13 జిల్లాల నుంచి మంచి స్పందన వస్తోంది. కృష్ణా జిల్లాలో ముద్రగడ దీక్షకు మద్దతుగా కలిదిండిలో వివేకానంద ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైకలూరు ఇంఛార్జ్ డీఎన్ఆర్ ముద్రగడ ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేబీరోడ్డులో వంగవీటి రంగా విగ్రహం వద్ద ఖాళీ కంచాలతో మద్దతుదారులు నిరసన చేస్తున్నారు. -
ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు
కాకినాడ: కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడకు బీపీ 160/110, షుగర్ లెవల్స్ 178 ఉండగా.. ప్రస్తుతం ఆయన బరువు 86 కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ 180/110, షుగర్ లెవల్స్ 120గా ఉండగా.. ఆమె బరువు 78 కేజీలుగా వైద్యులు నిర్ధారించారు. నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి కాకినాడ సమీపంలోని కిర్లంపుడిలో ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఆయన ఇంటిగేట్లను పోలీసులు మూసివేశారు. అయితే ఆయన మద్ధతుదారులు మాత్రం తమ నేత ఇంటి గేట్లు తెరిచేందుకు యత్నిస్తున్నారు. -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
క్రియాటిన్కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి? నా వయసు 42. నాది డెస్క్ జాబ్ కావడం వల్ల రోజుకు కనీసం 10 -12 గంటలకు పైగా కూర్చుని పని చేయవలసి వస్తుంది. ఇటీవల కాజువల్‌గా హెల్త్ చెకప్ జరిగినప్పుడు, క్రియాటినిన్ 1.7 ఉన్నట్లుగా రిపోర్టు వచ్చింది. కిడ్నీ స్పెషలిస్ట్‌కు తప్పక చూపించాల్సిందిగా మా కంపెనీ డాక్టర్ సలహా ఇచ్చారు. క్రియాటినిన్కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి? క్రియాటినిన్ తగ్గడానికి ఏవైనా మార్గాలుంటే చెప్పండి. - డిబి., హైదరాబాద్ మూత్రపిండాల (కిడ్నీ) పనితీరును తెలుసుకోవడానికి చేసే పరీక్షల్లో క్రియాటినిన్, బ్లడ్ యూరియా చాలా ముఖ్యమైనవి. సాధారణంగా శరీరంలో క్రియాటినిన్ పరిమాణం 0.5 ఎంజీ/డీఎల్ నుంచి 1.2 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అదే బ్లడ్ యూరియా అయితే 20 ఎంజీ/డీఎల్ నుంచి 40 ఎంజీ/డీఎల్ ఉండవచ్చు. ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం 1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు సామర్థ్యం తగ్గినదానికి ఒక సూచనగా పరిగణించాలి. అదే క్రియాటినిన్ పరిమాణం 4 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు 80 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గినట్లుగా భావించాలి. శరీరంలో క్రియాటినిన్ పెరగడానికి ప్రధానమైన కొన్ని కారణాలు... హైబీపీ, డయాబెటిస్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్రంథి వాపు, నొప్పి నివారణ మందులు దీర్ఘకాలంపాటు వాడటం, ఉప్పు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవడం వంటివి. ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా వస్తే కేవలం కిడ్నీకి సంబంధించిన పరీక్షలే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి కూడా చెక్ చేయించుకుని కిడ్నీ స్పెషలిస్ట్‌ను కలవాలి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో క్రియాటినిన్ పరిమాణం పెరగకుండా ఉండాలంటే రోజూ 3-4 లీటర్ల నీటిని తాగుతూ, అరగంటకు తగ్గకుండా ఒళ్లు అలిసేలా వ్యాయామం చేస్తూ, మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. మీరు చెప్పిన విధంగా అదేపనిగా గంటలు గంటలు కూర్చుండటం వల్ల క్రియాటినిన్ పెరుగుతుందనే అంశంపై ఇంకా శాస్త్రీయమైన నిరూపణలేమీ లేనప్పటికీ, మీరు వైర్లెస్ ఇంటర్నెట్ ఉపయోగాన్ని వీలైనంతగా తగ్గించడం, బాగా వేడిని వెలువరించే ల్యాప్‌టాప్‌లను శరీరానికి వీలైనంత దూరంగా ఉంచి ఉపయోగిస్తే మంచిది. మధ్య మధ్య వీలైనంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. -
ఆరోగ్య బీమాతో ఉచిత హెల్త్ చెకప్‌లు
సాధారణంగా చాలా మటుకు ఆరోగ్య బీమా పాలసీల్లో పాలసీదారు నాలుగేళ్లకోసారి ఉచిత మెడికల్ చెకప్ చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పాతిక శాతం మించదు. ఎందుకంటే చాలా మందికి దీని గురించి తెలియకపోవడం.. తెలిసినా ప్రొసీజర్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడం ఇందుకు కారణం. టెస్టుల్లో ఏదైనా తేడా ఉందని బైటపడితే మళ్లీ బీమా ప్రీమియంలు పెరిగిపోతాయేమోనన్న భయం మరో కారణం. అయితే, ఇలాంటి ఉచిత హెల్త్ చెకప్లనేవి.. పాలసీదారులు తమ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఉద్దేశించినవి మాత్రమే తప్ప ప్రీమియంలతో వీటికి సంబంధమేమీ లేదు. ఇక, ఇందుకు సంబంధించిన ప్రొసీజరు ఒక్కొక్క కంపెనీలో ఒక్కో రకంగా ఉంటుంది. హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకున్నప్పుడు బీమా కంపెనీ టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి తెలియజేయొచ్చు. లేదా సమీపంలోని బ్రాంచీలో తెలియజేయొచ్చు. ఆ తర్వాత పాలసీదారుకి అనువైన తేదీ, సమయం మొదలైన వాటిని బీమా కంపెనీ ఒకసారి నిర్ధారణ చేసుకుంటుంది. అటు పైన ఆథరైజేషన్ లెటరు ఇస్తుంది. చెకప్‌కి వెళ్లినప్పుడు హెల్త్ కార్డుతో పాటు దీన్ని కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. చెల్లింపుల ప్రక్రియ సజావుగా, సులువుగా జరిగిపోవాలంటే..టెస్టుల కోసం బీమా కంపెనీ ప్యానెల్లో ఉన్న డయాగ్నాస్టిక్ సెంటర్ లేదా ఆస్పత్రిని ఎంచుకోవడం మంచిది. కంపెనీ ప్యానెల్లో ఉన్న సెంటర్లలోనైతే పాలసీదారు చేతి నుంచి కట్టనక్కర్లేదు. నిర్దిష్ట రేట్లను బీమా కంపెనీయే డయాగ్నాస్టిక్ సెంటరుకు కట్టేస్తుంది. అలా కాకుండా పాలసీదారు వేరే చోట పరీక్షలు చేయించుకోవాలనుకున్న పక్షంలో ముందుగా డబ్బు కట్టేసి చేయించేసుకుంటే.. అటు తర్వాత కంపెనీ నుంచి రీయింబర్స్‌మెంటు పొందవచ్చు. కన్సల్టేషన్, ఈసీజీ, బ్లడ్ కౌంట్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలు, ఛాతీ ఎక్స్-రే మొదలైన పరీక్షలు దీని కింద చేయించుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వరుసగా నాలుగేళ్ల పాటు ఎటువంటి క్లెయిము చేయకపోతేనే ఈ ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం ఇస్తున్నాయి చాలా మటుకు కంపెనీలు. అంటే, అయిదో సంవత్సరంలో ఈ ప్రయోజనం పొందవచ్చు. అయి తే, కొన్ని సంస్థలు.. ప్రతీ సంవత్సరం, అది కూడా క్లెయిమ్ చేసినా ఇస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల గురించి బీమా కంపెనీని అడిగి తెలుసుకోవాలి. అలా గే, ఉచిత చెకప్ కదా అని ఎంత ఖర్చయినా చేయించుకోవచ్చనుకుంటే కుదరదు. ఇందుకయ్యే ఖర్చు.. బీమా కవరేజీలో ఇంత శాతానికి మించకూడదు. కొన్ని కంపెనీల్లో ఇది సమ్ అష్యూర్డ్‌లో దాదాపు ఒక్క శాతం స్థాయిలో లేదా రూ.5,000 రేంజిలో ఉంటోంది. -
మళ్లీ అమెరికా వెళ్తున్న సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. బుధవారం రాత్రి పది గంటలకు బయల్దేరి ఆమె మరోసారి వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నారు. 2011, ఆగస్టు 5న సోనియాకు అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆమె అనారోగ్యం ఏమిటన్న విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా ఉంచాయి. కాగా ఆగస్టులో ఆహార బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంలో తీవ్ర అలసట, ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురైన సోనియాను ఎయిమ్స్‌కు తరలించారు. తర్వాత, సెప్టెంబర్ 2న ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆమె 11వ తేదీన తిరిగి ఢిల్లీకి వచ్చారు. ఈసారి మళ్లీ అదే నెలలో ఆమె అమెరికా వెళ్తున్నారు. ఇలా వరుసగా వైద్య పరీక్షల నిమిత్తం సోనియాగాంధీ అమెరికాకు వెళ్తుండటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి పట్ల కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.