ఆరోగ్య బీమాతో ఉచిత హెల్త్ చెకప్‌లు
సాధారణంగా చాలా మటుకు ఆరోగ్య బీమా పాలసీల్లో పాలసీదారు నాలుగేళ్లకోసారి ఉచిత మెడికల్ చెకప్ చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పాతిక శాతం మించదు. ఎందుకంటే చాలా మందికి దీని గురించి తెలియకపోవడం.. తెలిసినా ప్రొసీజర్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడం ఇందుకు కారణం. టెస్టుల్లో ఏదైనా తేడా ఉందని బైటపడితే మళ్లీ బీమా ప్రీమియంలు పెరిగిపోతాయేమోనన్న భయం మరో కారణం.
అయితే, ఇలాంటి ఉచిత హెల్త్ చెకప్‌లనేవి.. పాలసీదారులు తమ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఉద్దేశించినవి మాత్రమే తప్ప ప్రీమియంలతో వీటికి సంబంధమేమీ లేదు. ఇక, ఇందుకు సంబంధించిన ప్రొసీజరు ఒక్కొక్క కంపెనీలో ఒక్కో రకంగా ఉంటుంది. హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకున్నప్పుడు బీమా కంపెనీ టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి తెలియజేయొచ్చు.
లేదా సమీపంలోని బ్రాంచీలో తెలియజేయొచ్చు. ఆ తర్వాత పాలసీదారుకి అనువైన తేదీ, సమయం మొదలైన వాటిని బీమా కంపెనీ ఒకసారి నిర్ధారణ చేసుకుంటుంది. అటు పైన ఆథరైజేషన్ లెటరు ఇస్తుంది. చెకప్‌కి వెళ్లినప్పుడు హెల్త్ కార్డుతో పాటు దీన్ని కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. చెల్లింపుల ప్రక్రియ సజావుగా, సులువుగా జరిగిపోవాలంటే..టెస్టుల కోసం బీమా కంపెనీ ప్యానెల్‌లో ఉన్న డయాగ్నాస్టిక్ సెంటర్ లేదా ఆస్పత్రిని ఎంచుకోవడం మంచిది.
కంపెనీ ప్యానెల్‌లో ఉన్న సెంటర్లలోనైతే పాలసీదారు చేతి నుంచి కట్టనక్కర్లేదు. నిర్దిష్ట రేట్లను బీమా కంపెనీయే డయాగ్నాస్టిక్ సెంటరుకు కట్టేస్తుంది. అలా కాకుండా పాలసీదారు వేరే చోట పరీక్షలు చేయించుకోవాలనుకున్న పక్షంలో ముందుగా డబ్బు కట్టేసి చేయించేసుకుంటే.. అటు తర్వాత కంపెనీ నుంచి రీయింబర్స్‌మెంటు పొందవచ్చు. కన్సల్టేషన్, ఈసీజీ, బ్లడ్ కౌంట్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలు, ఛాతీ ఎక్స్-రే మొదలైన పరీక్షలు దీని కింద చేయించుకోవచ్చు.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వరుసగా నాలుగేళ్ల పాటు ఎటువంటి క్లెయిము చేయకపోతేనే ఈ ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం ఇస్తున్నాయి చాలా మటుకు కంపెనీలు. అంటే, అయిదో సంవత్సరంలో ఈ ప్రయోజనం పొందవచ్చు. అయి తే, కొన్ని సంస్థలు.. ప్రతీ సంవత్సరం, అది కూడా క్లెయిమ్ చేసినా ఇస్తున్నాయి.
కాబట్టి ఈ విషయాల గురించి బీమా కంపెనీని అడిగి తెలుసుకోవాలి. అలా గే, ఉచిత చెకప్ కదా అని ఎంత ఖర్చయినా చేయించుకోవచ్చనుకుంటే కుదరదు. ఇందుకయ్యే ఖర్చు.. బీమా కవరేజీలో ఇంత శాతానికి మించకూడదు. కొన్ని కంపెనీల్లో ఇది సమ్ అష్యూర్డ్‌లో దాదాపు ఒక్క శాతం స్థాయిలో లేదా రూ.5,000 రేంజిలో ఉంటోంది.