ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్‌సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.
ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది.
Comments
Please login to add a commentAdd a comment