వృద్ధులకు ఆరోగ్య ధీమా | Health assertive to the elderly | Sakshi
Sakshi News home page

వృద్ధులకు ఆరోగ్య ధీమా

Published Sun, Jan 11 2015 2:03 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

వృద్ధులకు ఆరోగ్య ధీమా - Sakshi

వృద్ధులకు ఆరోగ్య ధీమా

వైద్య చికిత్సలకయ్యే ఖర్చు భారీగా పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ఆరోగ్య బీమా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు, అత్తమామల విషయంలో మరింత ఆరోగ్య ధీమా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఆర్‌డీఏ పెద్దవాళ్ల ఆరోగ్య బీమా విషయంలో కొన్ని కీలక సంస్కరణలు చేసింది.

సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రీమియం భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవచ్చు. ఈ విషయాలపై అవగాహన కల్పించేదే ప్రాఫిట్ ముఖ్య కథనం.

 
ఇప్పుడు అందరికీ ముఖ్యంగా వయోవృద్ధులకు కూడా ఆరోగ్య బీమా రక్షణను ఐఆర్‌డీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొంత కాలంగా వయసు పెరిగిన వారు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఐఆర్‌డీఏ పరిష్కరించింది. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి పాలసీ లభించేదే కాదు. ఒకవేళ ఒకటి రెండు కంపెనీలు ఇచ్చినా ప్రీమియం అందుబాటు ధరలో ఉండేది కాదు.

ఇప్పుడు ఇక ఈ సమస్య లేదు. సరైన కారణం చూపించకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం జారీ చేయకపోవడం, ప్రీమియం పెంచడం వంటివి చేయడానికి వీలులేదు. అలాగే చాలా బీమా కంపెనీలు 45 ఏళ్లు దాటిన తర్వాత తీసుకునే పాలసీదారులకు ముందుగానే అన్ని ఆరోగ్య పరీక్షలు జరిపించేవారు. ఈ పరీక్షల వ్యయంలో కొంత మొత్తాన్ని కొన్ని కంపెనీలు భరిస్తే మరికొన్ని కంపెనీలు ఒక్క పైసా కూడా చెల్లించేవి కావు.

ఇప్పుడు ఈ విషయంలో కూడా ఐఆర్‌డీఏ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. 45 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పాలసీ మంజూరు చేస్తే ఆ వ్యయంలో 50% బీమా కంపెనీ భరించాల్సి ఉంటుంది. అంతేకాదు వైద్య పరీక్షల తర్వాత పాలసీ మంజూరు చేశారు కాబట్టి క్లెయిమ్‌లను తిరస్కరించడానికి అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు 65 ఏళ్ళ వారి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు.

ఈ నిబంధనలు మారిన తర్వాత చాలా కంపెనీలు వృద్ధులకు ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాయి. కొన్ని కంపెనీలు అయితే 70-80 ఏళ్ల వారికి కూడా పాలసీలు అందిస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం రేట్లు పెరుగుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడం మంచిది. ఒకవేళ వయసు పెరిగిన తర్వాత తీసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. ఇంటిలోని పెద్ద వయసు వారి పేరు మీద పాలసీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
 
వ్యక్తిగతానికి దూరం..
తల్లిదండ్రులు, అత్తమామల పేరు మీద పాలసీ తీసుకోవాలనుకుంటే వ్యక్తిగత పాలసీల కంటే గ్రూపు పాలసీలకేసే మొగ్గు చూపండి. ఈ వయ సులో వ్యక్తిగత పాలసీలు తీసుకుంటే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు పనిచేస్తున్న కంపెనీ ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ అందిస్తుంటే అందులో వీరికి కూడా బీమా రక్షణ కల్పించే అవకాశం ఉందా లేదా అని అడిగి తెలుసుకోండి.

ఒకవేళ లేకపోతే వివిధ కంపెనీలు అందిస్తున్న ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను తీసుకోండి. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు ఒకే పాలసీ కింద ఆరు నుంచి ఎనిమిది మంది రక్త సంబంధీకులకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. అదే మ్యాక్స్‌బూపా వంటి మరికొన్ని కంపెనీలు అయితే ఏకంగా 13 మంది రక్త సంబంధీకుల వరకు కూడా బీమా కల్పిస్తున్నాయి. ఇలా కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒకే పాలసీ తీసుకోవడం వల్ల అందరికీ ఆరోగ్య బీమా రక్షణతో పాటు, చెల్లించే ప్రీమియంలో 50-60% తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది.
 
కో-పేమెంట్...
ఒకవేళ కుటుంబమంతా కలసి ఒకే పాలసీ తీసుకునే అవకాశం లేని వారికి ప్రీమియం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అనేది ఒక చక్కటి మార్గం. ఈ ఆప్షన్‌లో క్లెయిమ్ భారాన్ని ఇద్దరూ భరించాల్సి ఉంటుంది. కో-పేమెంట్ అంటే క్లెయిమ్ మొత్తం బీమా కంపెనీ చెల్లించకుండా కొంత మొత్తం మీరు చెల్లించాల్సి ఉంటుంది.  సాధారణంగా కంపెనీలు 10 నుంచి 20% కో-పేమెంట్‌గా నిర్ణయిస్తాయి. ఉదాహరణకి మీరు తీసుకున్న పాలసీలో కో-పేమెంట్ 20 శాతంగా ఉందనుకుందాం.

ఇప్పుడు మీ క్లెయిమ్ మొత్తం రెండు లక్షలు అయితే అందులో బీమా కంపెనీ కేవలం రూ.1.60 లక్షలే చెల్లిస్తుంది. మిగిలిన రూ.40 వేలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కో-పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం వలన ఆ మేరకు ప్రీమియం భారం కొంత మేర తగ్గుతుంది. అంతేకాదు కో-పేమెంట్ ఆప్షన్‌లో మీకు భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి అనవసర చికిత్సా వ్యయాలు ఉండవన్న భావనతో బీమా కంపెనీలు ఈ ఆప్షన్‌కు పెద్ద పీట వేస్తున్నాయి.
 
అప్పటికే వ్యాధులు ఉంటే...
ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ, షుగర్లు వంటి ఆర్యోగ సమస్యలు సహజం. అందులో వయసు పెరిగిన వారికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండటం అంతే అత్యంత సహజం. పాలసీ తీసుకునే సమయానికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి గురించి తప్పకుండా ముందే తెలియచేయండి. దీనివల్ల క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఉండవు. అంతే కాదు ఇప్పుడు చాలా బీమా కంపెనీలు అప్పటికే ఉన్న వ్యాధులకు వివిధ నిబంధనలతో కూడిన బీమా రక్షణను అందిస్తున్నాయి.

కొన్ని బీమా కంపెనీలు అప్పటికే ఉన్న వ్యాధుల చికిత్సా వ్యయంలో సగం భారాన్ని భరిస్తుంటే, మరికొన్ని కంపెనీలు రెండు మూడేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత బీమా రక్షణ కల్పిస్తున్నాయి. ఉదాహరణకు స్టార్ హెల్త్ అందిస్తున్న రెడ్‌కార్పెట్ పాలసీ మొదటి ఏడాది నుంచే అప్పటికే ఉన్న వ్యాధులకూ బీమా రక్షణ అందిస్తోంది. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందే అప్పటికే ఉన్న వ్యాధుల క్లెయిమ్ విషయంలో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడం మర్చిపోవద్దు.
 
క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ మరవద్దు
కొన్ని తీవ్రమైన వ్యాధుల్లో చికిత్సా వ్యయంతో సంబంధం లేకుండా తీసుకున్న బీమా రక్షణ మొత్తాన్ని పొందవచ్చు. ఇందుకోసం మీరు కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రైడర్‌లో ఎనిమిది నుంచి 10 తీవ్రమైన వ్యాధులకు బీమా రక్షణ లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement