అమ్మ వద్దన్నా... నువ్వు వినకు
ఈ నెల 14న మదర్స్ డే
చిన్నప్పుడు స్నానం చేయమంటే అల్లరి చేసేవాళ్లం. అన్నం తినమంటే గొడవ చేసేవాళ్లం. స్కూలుకు వెళ్లమంటే మొండికేసేవాళ్లం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానంటే ఏడ్చి గీపెట్టేవాళ్లం. అమ్మ అన్నీ మన మంచి కోసమే చెప్పేది. కానీ మనం వద్దనే వాళ్లం. ఇవాళ అమ్మ వద్దనవచ్చు. అనవచ్చేంటీ... వద్దనే అంటుంది. ఈసారి మనం గారం చేద్దాం. అమ్మకు మంచి హెల్త్ చెకప్ చేయిద్దాం. ఆదివారం మదర్స్ డే. దాన్ని మన లైఫ్‌లో మోస్ట్ హ్యాపీడేగా మారుద్దాం. అమ్మ రుణం తీర్చుకుందాం. అమ్మ వద్దంటుంది. నువ్వు గారం చెయ్యి!
పాప్ స్మియర్
సర్వైకల్ క్యాన్సర్‌ను తెలుసుకోడానికి చేయించే పరీక్ష ఇది. సర్విక్స్ అనేది తల్లి గర్భసంచిలోని ఒక భాగం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్లలోనూ అత్యంత ఎక్కువగా వచ్చేది ఇదే. పైగా దీనికి ప్రీ–క్యాన్సర్ దశ చాలా సుదీర్ఘకాలం పాటు ఉంటుంది. అందుకే పదేళ్ల ముందుగా కూడా దీన్ని కనుగొనేందుకు అవకాశం ఉంది. అలా ముందుగానే కనుక్కుంటే సర్వైకల్ క్యాన్సర్‌ను తప్పక నయం చేయవచ్చు. అందుకే 35 ఏళ్లు దాటాక క్రమం తప్పకుండా మహిళలకు ఈ పరీక్ష చేయించాలి. డాక్టర్ సూచించిన వ్యవధిని పాటించాలి. ఇది ఏ మాత్రం నొప్పి లేకుండా చేసే పరీక్ష.
మామోగ్రామ్
మహిళల్లో సాధారణంగానూ, ఎక్కువగానూ కనిపించే బ్రెస్ట్‌క్యాన్సర్‌ను కనుగొనే పరీక్ష ఇది. దీన్ని తొలిదశలోనే కనుగొంటే రొమ్మును తొలగించనవసరం లేకుండానే (మాసెక్టమీ చేయకుండానే) చికిత్స అందించడానికి అవకాశం ఉంది. ఇది కూడా నొప్పి లేని సులువైన పరీక్ష. అమ్మకు 40 ఏళ్లు దాటినప్పటి నుంచి తప్పక చేయించాల్సిన పరీక్ష ఇది. మహిళల రొమ్ములో గడ్డలాంటిది ఏదైనా తగులుతూ ఉన్నా, రొమ్ములలో నొప్పి, సలపరం ఉన్నా, కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలా ఉన్నా తప్పక చేయించాల్సిన పరీక్ష ఇది.
బోన్‌డెన్సిటీ టెస్ట్
యాభై ఏళ్లు వయసు పైబడ్డ మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సాధారణం. ఆస్టియోపోరోసిస్ వస్తే ఎముకలు పెళుసుగా మారి, సులువుగా విరుగుతుంటాయి. మెనోపాజ్ దాటాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ సమస్య వస్తుంది. 60 ఏళ్లు దాటిన మహిళల్లో 50%, 80 ఏళ్లు దాటినవారిలో 90% మహిళల్లో ఇది కనిపిస్తుంది. బోన్‌డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియోపోరోసిస్‌ను కనుక్కోవచ్చు. ఇందులో మణికట్టు, వెన్నుముక, తుంటిఎముక భాగాలను ఈ బోన్‌డెన్సిటో మీటర్ (డెక్సా స్కాన్)తో పరీక్షిస్తారు. ఆస్టియోపోరోసిస్‌ను నివారించడానికి వ్యాయామం, ఆహారంలో క్యాల్షియం చాలా ముఖ్యం.
టీ3, టీ4, టీఎస్‌హెచ్
థైరాయిడ్ సమస్య తెలుసుకోవడం కోసం చేసే పరీక్ష ఇది. థైరాయిడ్‌మస్యల్లో మొదటిది హైపోథైరాయిడిజమ్. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం. మరొక సమస్య చాలా తక్కువగా పనిచేయడం, అది హైపోథైరాయిడిజమ్. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఈ కండిషన్ కనిపించినప్పటికీ మహిళల్లోనే ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హైపోథైరాయిడిజమ్ కనిపిస్తుంది. తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ పాళ్లు తగ్గుతున్నాయేమోనని గమనించాలి. ఇక థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య హైపర్‌థైరాయిడిజమ్. ఇది వచ్చిన మహిళలు సన్నగా మారడం, బరువు తగ్గడం, జుట్టు రాలిపోవడం, రాత్రివేళల్లో నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. పైన పేర్కొన్న థైరాయిడ్ సంబంధిత సమస్యలను తెలుసుకోవడం కోసం టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష చాలా ముఖ్యం.
యూరిన్ టెస్ట్
మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు ఎక్కువ. అందుకే మూత్ర పరీక్ష మహిళలకు చాలా అవసరం. ఇన్ఫెక్షన్లను తెలుసుకునేందుకు మాత్రమేగాక మరికొన్ని ఇతర సమాచారాలు తెలుసుకునేందుకు సైతం మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ తీవ్రత వంటివి తెలుసుకునేందుకు కూడా మూత్ర పరీక్ష చేయాల్సి ఉంటుంది.
ఊపిరితిత్తుల టెస్ట్
నిన్నమొన్నటి వరకు మహిళలు కట్టెల పొయ్యి దగ్గర చిక్కటి పొగలో వంట చేసేవారు. రెండు దశాబ్దాల నుంచి గ్యాస్ వచ్చింది. ఇప్పటికీ చాలా మారుమూల ప్రదేశాల్లో గ్యాస్ సౌకర్యం లేని ప్రాంతాలున్నాయి. అందుకే అక్కడి మహిళల్లో ఊపిరితిత్తులను ప్రభావం చేసే ఆస్తమా, సీఓపీడీ, ఇతర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులకు ఆస్కారం ఎక్కువ. అందుకే ఊపిరితిత్తుల సామర్థ్యాలను తెలుసుకునే పీఎఫ్‌టీ, స్పైరోమెట్రీ వంటివి చేయించడం అవసరం కావచ్చు.
డెంటల్ చెకప్
యాభై ఏళ్లు దాటిన మహిళలలో దంతాలు, చిగుర్లు, ఓరల్ హెల్త్‌కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగానే ప్రతి ఒక్కరూ ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం మంచిదని డెంటిస్టులు సలహా ఇస్తుంటారు. అలాంటప్పుడు ఒక వయసు దాటిన మహిళలకు నోటి పరీక్షలు ఎంతగా అవసరమో చెప్పనక్కర్లేదు. పైగా నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్) బాగా ఉంటే గుండెజబ్బులు రాకపోవడం మొదలుకొని అన్ని అవయవాల ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది.
అమ్మకు గుండె పరీక్షలు
ఈసీజీ : అమ్మకు ఛాతీ నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తే వెంటనే చేయించాల్సిన మొదటి పరీక్ష ఇది. అయితే చిన్న గుండెపోటును ఈసీజీ ద్వారా గుర్తించడం సాధ్యం కాదు. ఈ రోజుల్లో ఈసీజీ మెషిన్లోని కంప్యూటరు కొన్ని క్లూస్ ఇస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈసీజీలో మార్పులు చోటుచేసుకోడానికి కొంత సమయం పడుతుంది. అంటే గుండెపోటు వచ్చిన వెంటనే తీసిన ఈసీజీలో అది నమోదు కాకపోవచ్చు కూడా. అందుకే ఒక్క ఈసీజీ ఆధారంగానే గుండెపోటు వచ్చిందా లేదా అన్నది నిర్ధారణ చేయలేం. గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. కానీ కొందరు ఛాతీనొప్పి వచ్చాక ఈసీజీ తీసినా రిపోర్టు ఇవడానికి 12–24 గంటల సమయం తీసుకుంటారు. గుండెనొప్పి అని అనుమానించినప్పుడు అలాంటి పరీక్షకేంద్రాల్లో ఈసీజీ తీయించుకోవడం సరికాదు.
ఎకో పరీక్ష : సాధారణంగా గుండెపోటును అనుమానించినప్పుడు ఎకో పరీక్ష చేయడం అన్ని చోట్లా కుదరదు. ఎందుకంటే ఆ పరీక్ష చేయడానికి హృద్రోగనిపుణలకు మాత్రమే తర్ఫీదు ఉంటుంది. కాబట్టి కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే ఆ పరీక్ష చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో ఛాతీ నొప్పి వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ వద్దకు మాత్రమే వెళ్తారనే గ్యారంటీ లేదు. ప్రత్యేకంగా చిన్న నగరాలు మొదలుకొని పట్టణాల వరకు ఆ అవకాశం కాస్తంత తక్కువ. అయితే గుండెజబ్బు వల్ల ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకునేందుకు ఎకో పరీక్షలో అవకాశాలు 95 శాతం కంటే ఎక్కువ.
యాంజియోగ్రామ్ : గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష చేయిస్తే మంచిది. ఇందులో గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి కచ్చితంగా తెలుస్తాయి. కానీ ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువ. ఇదివరకటి రోజుల్లో ఈ పరీక్ష వల్ల కొన్ని కాంప్లికేషన్లు వచ్చేవి. కానీ ఈరోజుల్లో ఈ పరీక్ష చాలా సులువు. ఇబ్బందులూ అంతగా ఉండవు. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి.
టీఎమ్‌టీ పరీక్ష : సాధారణంగా ట్రెడ్ మిల్ టెస్ట్ అని పిలిచే దీన్నే కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్ అని కూడా అంటారు. ట్రెడ్ మిల్ అనే పరికరం మీద వేగంగా నడవడం ద్వారా గుండెపై ఒత్తిడి కలిగించి చేసే పరీక్ష ఇది. నడక లేదా ఇతర శారీరక శ్రమ సమయంలో గుండె పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే పరీక్ష ఇది.
ఈస్ట్రోజెన్ టెస్ట్
తమకు 45 ఏళ్లు వచ్చాక రుతుక్రమం ఆగిపోవడం కూడా మహిళల్లో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఆ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్ స్వింగింగ్), ఆస్టియోపోరోసిస్‌తో ఎముకలు బలహీనం కావడం, గుండెజబ్బులకు గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. రుతుక్రమం (మెనోపాజ్) ఆగిన మహిళల్లో ఏవైనా తేడాలు / సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స చేయించాలి. ఇలాంటి వారికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) వంటి చికిత్సలను డాక్టర్లు సూచిస్తారు.
సీబీపీ రక్త పరీక్ష
మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. మనదేశంలో దాదాపు 85 శాతం మహిళల్లో రక్తహీనత ఉందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్ల యుక్తవయసు వచ్చే నాటికి ఆమెకు రుతుస్రావం మొదలై రక్తస్రావం జరుగుతుంటుంది కాబట్టి మహిళల్లో రక్తహీనత చాలా సాధారణమైన సమస్య. కాబట్టి మహిళల్లో నిర్వహించాల్సిన ముఖ్యమైన పరీక్ష ఇది. ఇక ఒక్క హిమోగ్లోబిన్ మాత్రమే కాదు... దానితో పాటు రక్తంలోని మిగతా అంశాలైన తెల్లరక్తకణాల్లోని బేసోఫిల్స్, ఇజినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ వంటి వాటిని కూడా లెక్కించి, అవన్నీ నార్మల్‌గానే ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవడం ఈ పరీక్షతో సాధ్యమవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే రక్తాన్ని గడ్డకట్టించి ప్రాణాలు కాపాడే ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా ఈ పరీక్షలో తెలుస్తుంది. రక్తంలోని దాదాపుగా అన్ని అంశాలనూ తెలుసుకునేందుకు ఉపకరించే పరీక్ష... ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్.
క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే పాప్ స్మియర్, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రామ్ పరీక్షలు కాకుండా... ఇతర రకాల క్యాన్సర్లను తెలపడం కోసం ప్రాథమికంగా చేసే కొన్ని రక్తపరీక్షలు కూడా చేయించడం మేలు. ఉదాహరణకు సెర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకునే పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) పరీక్షలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును తెలుసుకునే లో–డోస్ హెలికల్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ పరీక్షల వంటివి ఇందుకు ఉదాహరణలు. ఇక లక్షణాలను బట్టి పెద్దపేగు, మలద్వారం వద్ద ఏర్పడే క్యాన్సర్ ముప్పులను తెలుసుకోడానికి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ (ఎఫ్‌ఓబీటీ) వంటివి కూడా చేయించాల్సిరావచ్చు. రక్తసంబంధిత క్యాన్సర్లను తెలుసుకోవడం కోసం కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) వంటివి అవసరం కావచ్చు.
విటమిన్ బి 12 టెస్ట్
నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్రరక్తకణాల తయారీకి విటమిన్ బి12 తప్పనిసరి. నిజానికి విటమిన్‌లు మన శరీర పోషణకు చాలా ముఖ్యమైనవి. విటమిన్ బి12 నీళ్లలో కరిగే విటమిన్. దీన్ని సైనకోబాలమిన్ అంటారు. శరీరంలో దీని మోతాదు తగ్గడాన్ని హైపోకోబాలమినియా అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారం నుంచి విటమిన్ బి12ను గ్రహించే శక్తి తగ్గుతుంది. అది విటమిన్ బి12 లోపానికి దారితీస్తుంది. దాంతో మెదడు చురుగ్గా పనిచేయకపోవడం, అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి ఒకవేళ మహిళల్లో నీరసం, నిస్సత్తువ, నడుము–కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ బి12 ఉందేమో తెలుసుకునే రక్తపరీక్ష చేయించాలి.
లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్
రక్తంలో కొవ్వుల పాళ్లు అవసరమైన మోతాదులకు మించితే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు. పైగా 45 ఏళ్లు దాటిన వారిలో రిస్క్ ఎక్కువ. శరీరంలోని కొవ్వులు, కొలెస్ట్రాల్ పాళ్లు తెలుసుకోడానికి లిపిడ్ ప్రొఫైల్ రక్తపరీక్ష చేస్తారు. ఇందులో శరీరంలోని ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి అనేక కొవ్వుల పాళ్లు తెలుస్తాయి. చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్) ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇక హెచ్‌డీఎల్ అనేది మన రక్తనాళాల్లో కొవ్వును చేరకుండా చేస్తుంది. కాబట్టి మంచికొలెస్ట్రాల్‌గా పరిగణించే హెచ్‌డీఎల్ నిర్ణీత మోతాదులో ఉండాలి. ఇక ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు ఎల్‌డీఎల్ లాగే హాని చేసేవి. లిపిడ్ పరీక్షల ఫలితాలకు అనుగుణంగా డాక్టర్ సూచించే ఆహార మార్పులు, న్యూట్రిషన్ సూచనలు తమ తల్లులు అనుసరించేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విటమిన్ – డి టెస్ట్
అనాది నుంచి పురుషులతో పోలిస్తే మహిళలు ఆరుబయటి గాలికీ, ఆరుబయటి వాతావరణానికి ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశాలు తక్కువ. దాంతో మహిళల్లో విటమిన్–డి పాళ్లు తగ్గడానికి అనువైన పరిస్థితులు అన్ని చోట్లా నెలకొని ఉన్నాయి. పైగా ఇటీవల విటమిన్–డి లోపం ఉండటం సర్వసాధారణంగా మారింది. అందుకే ఈ లోపాన్ని తెలుసుకునేందుకు అవసరమైన రక్తపరీక్ష కూడా చేయించడం చాలా ముఖ్యం.
షుగర్ టెస్ట్
చక్కెర వ్యాధిని గుర్తించడానికి కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి: ఫాస్టింగ్ సుగర్ టెస్ట్... దీన్ని చేయించడానికి ముందర కనీసం ఎనిమిది గంటల సేపు ఏమీ తినకుండా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ర్యాండమ్ సుగర్ టెస్ట్ తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు. ఇవి కాకుండా, బ్లడ్ సుగర్ పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) కూడా చేస్తారు. షుగర్ వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మూత్ర పరీక్ష కూడా చేస్తారు. యాభై ఏళ్లు దాటిన తర్వాత మహిళలకు తప్పనిసరిగా క్రమం తప్పకుండా షుగర్ పరీక్షలు చేయించడం అవసరం. పిల్లలుగా మన తల్లికి మనం చేయించాల్సిన పరీక్షల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇవి గాక క్రమం తప్పకుండా చేసే రక్తపోటు కొలవడం (బీపీ రీడింగ్) మొదలుకొని... ఆయా మహిళల అవసరం మేరకు చేసే ప్రత్యేక పరీక్షల వరకు వారి వారి అవసరాల మేరకు చేయించాల్సిన బాధ్యత మనదే.
కడుపులోని అవయవాల కోసం
అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష
అత్యంత ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉండే శబ్ద తరంగాలను శరీరంలోకి పంపి ఈ పరీక్ష చేస్తారు. ఆ తరంగాలు వల్ల ఏర్పడ్డ ప్రతిబింబం (ఇమేజ్)తో శరీరంలోని అంతర్గత అవయవాలను చూసి, వాటిని విశ్లేషిస్తారు. తద్వారా లోపలి అవయవాల పనితీరును తెలుసుకునే పరీక్ష ఇది. దీని ద్వారా కడుపులోని అవయవాలైన కాలేయం, గాల్‌బ్లాడర్, పాంక్రియాస్, కిడ్నీ, అపెండిక్స్ వంటి భాగాలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి వీలవుతుంది. కడుపు భాగంలో ఉండే అవయవాలలో ఎక్కడైనా రక్తం గడ్డకట్టుకుపోయి ఉండటం, గాల్ బ్లాడర్‌లోని రాళ్లు, పాంక్రియాటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు, లివర్ క్యాన్సర్, అపెండిసైటిస్, కడుపులో ఉండే గడ్డల వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు.
– డాక్టర్ శైలజ, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్, నాంపల్లి, హైదరాబాద్