కాలేయం  సైజు  పెరిగింది... ఎందుకు?  | Family health counseling 20-02-2019 | Sakshi
Sakshi News home page

కాలేయం  సైజు  పెరిగింది... ఎందుకు? 

Published Wed, Feb 20 2019 12:32 AM | Last Updated on Wed, Feb 20 2019 12:32 AM

Family health counseling 20-02-2019 - Sakshi

గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్‌

నా వయసు 37 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద గత పదిరోజుల నుంచి విపరీతంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్‌ సైజు పెరిగిందని చెప్పారు. లివర్‌ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. నాకు తగిన సలహా ఇవ్వండి.  – కె. మల్లారెడ్డి, ఇల్లందు 
మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్‌ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్‌ సైజ్‌ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్‌ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్నిరకాల వైరల్‌ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్‌–బి, హెపటైటిస్‌–సి వంటి ఇన్ఫెక్షన్స్‌ వల్ల కూడా లివర్‌ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ.  ముందుగా మీలో లివర్‌ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష చేయించండి. మీకు కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతోపాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. 

గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు  ఉన్నాయి...  చికిత్స  ఏమిటి? 
నేను వారం కిందట మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌లో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. అయితే నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. ఇలా రాళ్లు ఉన్నవారికి ఆపరేషన్‌ అవసరమవుతుందని కొందరు భయపెడుతున్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా చెప్పండి.  – డి. శ్రీనివాసరావు, చిట్యాల 
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీకు ‘ఎసింప్టమాటిక్‌ గాల్‌ స్టోన్‌ డిసీజ్‌’ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి, వ్యాధి లక్షణాలే ఏమీ లేనివారిలో ఏడాదికి వందమందిలో సుమారు ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. మీకు వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు కాబట్టి ఆపరేషన్‌ అవసరం లేదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఒకసారి మీకు దగ్గర్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిస్తే, వారు మీ కండిషన్‌ను ప్రత్యక్షంగా చూసి తగిన సలహా ఇస్తారు.

కడుపులోకి  నీరు వస్తోంది.. ఏం  చేయాలి? 
నా వయసు 56 ఏళ్లు. నేను రోజూ ఆల్కహాల్‌ తీసుకుంటాను. ఇటీవల నాకు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్నడాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్‌ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్‌. జగన్నాథం, మంచిర్యాల 
మీకు లివర్‌ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్‌ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్‌ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్‌ ఫంక్షన్‌ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్‌ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. ఆ రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదిస్తే మీకు తగిన చికిత్స అందిస్తారు.

ఎసిడిటీ  ఎంతకూ  తగ్గడం లేదు... పరిష్కారం చెప్పండి.
నా వయసు 46 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. ఆరు నెలలుగా మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేదు. దీనికితోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – జి. జగదీశ్వరప్రసాద్, కాకినాడ 
మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం రాయలేదు. ఇక రెండో అంశం మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ కావచ్చని  అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది.
డాక్టర్‌ భవానీరాజు
సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,  బంజారా హాస్పిటల్స్, కేర్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement