నా వయసు 46 ఏళ్లు. నాలుగు నెలల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాను. అది క్రమంగా ఎడమ తొడ నుంచి కాలి కిందికి దిగుతూ కాలి బొటనవేలి వరకూ పాకుతోంది. నిలబడ్డా, నడుస్తున్నా నొప్పి పెరుగుతోంది. పట్టుమని పదినిమిషాలు కూడా నడవలేకపోతున్నాను. లక్షణాలు చెబుతుంటే అది సయాటికా అని, సర్జరీ చేయించాల్సి ఉంటుందని తెలిసినవాళ్లు చెబుతున్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు పరిష్కారం చెప్పండి. – ఎమ్. దయానంద్, చిత్తూరు
మీకు నడుము భాగంలో నొప్పి వచ్చి అది కిందికి పాకుతోందంటే వెన్నెముక కింది భాగంలోని వెన్నుపూసల (ఎల్5 లేదా ఎస్1) వల్ల నరాలు ఒత్తిడికి లోనవుతున్నాయని అర్థం. మన వెన్నుపూసల మధ్య ఘర్షణ తగ్గించేందుకు డిస్క్ అనే మెత్తటి భాగం ఉంటుంది. ఈ డిస్క్ భాగం... తన స్థానాన్నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ఈ కండిషన్ వస్తుంటుంది. దీన్నే ‘డిస్క్ ప్రొలాప్స్’ అంటారు. అరుదైన సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు, ట్యూమర్లు ఆ భాగానికి యాక్సిడెంట్‌లో దెబ్బతగలడం వంటివి ఇందుకు కారణం కావచ్చు. సాధారణంగా డిస్క్‌ప్రొలాప్స్ ఏర్పడ్డ 95 శాతం కేసుల్లో కేవలం విశ్రాంతి, కామన్‌గా వాడే మందులు, మన రోజువారీ పని భంగిమల మార్పు (పోష్చర్ మాడిఫికేషన్), కండరాలను కొన్ని వ్యాయామాలతో బలపరచడంతో మూణ్ణెల్లలోనే అది తగ్గిపోతుంది. అయితే నరం సప్లై అయ్యే భాగానికి తగిన స్పందనలు తెలియక, అక్కడి కండరం బలహీనం కావడం, చచ్చుబడటం లేదా కొన్నిసార్లు మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలు, మందులు వేసుకుంటున్నా అదుపులోకి రాని తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మారై వంటి పరీక్షలు చేయించి, సర్జరీ అవసరమని నిర్ధారణ జరిగితేనే శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు. ఇక శస్త్రచికిత్స అవసరమని తేలిన రోగుల్లోనూ దాదాపు 95 శాతానికి పైగా కేసుల్లో ఇది చాలా సురక్షితమైన సర్జరీ. ఏదైనా కాంప్లికేషన్లు వచ్చే అవకాశం కూడా కేవలం 1 శాతం కంటే తక్కువ. నిపుణులైన సర్జన్లు నిర్వహిస్తే ఈ మాత్రం అవకాశం కూడా ఉండదు. పైగా సర్జరీ తర్వాత ఒక రోజులోనే నడవడం సాధ్యమవుతుంది. కాబట్టి మీ సమస్య గురించి ఆందోళన పడకుండా మీరు వెంటనే అనుభవజ్ఞులైన న్యూరాలజీ నిపుణులను సంప్రదించండి.
Comments
Please login to add a commentAdd a comment