మళ్లీ అమెరికా వెళ్తున్న సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. బుధవారం రాత్రి పది గంటలకు బయల్దేరి ఆమె మరోసారి వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నారు. 2011, ఆగస్టు 5న సోనియాకు అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆమె అనారోగ్యం ఏమిటన్న విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా ఉంచాయి.
కాగా ఆగస్టులో ఆహార బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంలో తీవ్ర అలసట, ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురైన సోనియాను ఎయిమ్స్‌కు తరలించారు. తర్వాత, సెప్టెంబర్ 2న ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆమె 11వ తేదీన తిరిగి ఢిల్లీకి వచ్చారు. ఈసారి మళ్లీ అదే నెలలో ఆమె అమెరికా వెళ్తున్నారు. ఇలా వరుసగా వైద్య పరీక్షల నిమిత్తం సోనియాగాంధీ అమెరికాకు వెళ్తుండటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి పట్ల కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.