కొండలా కొవ్వు కాలేయానికి ముప్పు | World Liver Day Special Story | Sakshi
Sakshi News home page

కొండలా కొవ్వు కాలేయానికి ముప్పు

Published Thu, Apr 18 2019 8:00 AM | Last Updated on Thu, Apr 18 2019 8:00 AM

World Liver Day Special Story - Sakshi

జీవనశైలి మార్పులు, అసంబద్ధఆహారపు అలవాట్లతో కాలేయం పనితీరు దెబ్బతింటోంది. మనిషిఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి చేస్తే కాలేయానికి ‘కొవ్వు’ ముప్పుగా పరిణమిస్తోంది. సాధారణంగా హెపటైటీస్‌–బి,హెపటైటీస్‌–సి ఇన్‌ఫెక్షన్లతో పాటు అతిగా మద్యం తాగేవారు ఎక్కువగా ‘ఫ్యాటీ లివర్‌’ సమస్యలతో బాధపడుతుంటారు. కానీ ప్రస్తుతం జీవనశైలి,ఆహారపు అలవాట్లలో మార్పులకు తోడు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, కొన్ని రకాల నాటు మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో ఎలాంటి దురలవాట్లు లేని వారు కూడా ‘నాన్‌ ఆల్కాహాలిక్‌ ఫ్యాటీ లివర్‌’ సమస్యతో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

సాక్షి, సిటీబ్యూరో  :బాధితుల్లో 12.22 శాతం మంది 30 ఏళ్లలోపు వారుంటే... 40 ఏళ్లలోపు వారు 25.8 శాతం, 50 ఏళ్లలోపు వారు 28.10 శాతం, 60 ఏళ్లలోపు వారు 21.74 శాతం ఉండడం గమనార్హం. తొలి దశలో మేల్కొనకపోవడంతో కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిని మార్పిడి చికిత్సలకు వెళ్లాల్సి వస్తోంది. జీవన్‌దాన్‌ ద్వారా బ్రెయిన్‌డెత్‌ బాధితుల నుంచి కాలేయం సేకరించి ఇప్పటి వరకు 612 కాలేయ మార్పిడి చికిత్సలు చేయగా, నగరంలోనే అత్యధికంగా ఒక్క గ్లోబల్‌ ఆస్పత్రిలోనే 700 పైగా లైవ్‌ కాలేయ మార్పిడి చికిత్సలు జరగడం విశేషం. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా ఈ జబ్బుల బారినపడుతుండడం గమనార్హం.  

బాధితుల ఎదురుచూపు..  
కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు కాలేయ మార్పిడి చికిత్స చేయాల్సిందే. అయితే ఇది చాలా ఖర్చుతో కూడిన వైద్యం కావడంతో చాలా మంది చికిత్సకు వెనకాడుతున్నారు. ప్రభుత్వం ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చినప్పటికీ... ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతూ కాలేయ మార్పిడి చికిత్స కోసం తెలంగాణలో 2,833 మందికి పైగా రోగులు జీవన్‌దాన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. రోగుల నిష్పత్తికి అనుగుణంగా దాతలు లేకపోవడంతో చాలా మంది చికిత్సకు నోచుకోకుండానే మరణిస్తున్నారు.  

ప్రభుత్వాస్పత్రుల్లో అంతంతే..  
కుటుంబసభ్యుల్లో ఎవరైనా బాధితుడికి తమ కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చినా... వయసు, బ్లడ్‌గ్రూప్‌ మ్యాచింగ్‌ కావడం లేదు. ఒకవేళ మ్యాచ్‌ అయినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా లైవ్‌ డోనర్‌ సర్జరీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో చికిత్సలు జరగడం లేదు. ఫలితంగా ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేకపోవడంతో బాధితులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

వ్యాయామం చేయాలి.. 
ఒకప్పుడు ధనవంతుల్లో మాత్రమే ఈ ఫ్యాటీ లివర్‌ సమస్యలు వెలుగు చూసేవి. ప్రస్తుతం వారిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆహారం మితంగా తీసుకుంటూ శరీరానికి అవసరమైన వ్యాయామం చేస్తూ జీవనశైలిని మార్చుకుంటున్నారు. కానీ మధ్యతరగతి ప్రజల్లో ఇప్పటికీ సరైన ఆరోగ్య స్పృహ లేదు. ఏది పడితే అది తినడం, దాన్ని అరిగించుకునేందుకు కనీస  వ్యాయామం చేయకపోవడంతో ఊబకాయులుగా మారుతున్నారు. దీనికి మధుమేహం తోడవుతోంది. కాలేయంలో చక్కెర నిల్వలు పెరిగి ఫ్యాటీ లివర్‌కు కారణమవుతోంది. కాలేయం పనితీరు దెబ్బతినకుండా ఉండాలంటే మద్యం, మాంసాహారాలు మితంగా తీసుకోవాలి. శరీరానికి కనీస వ్యాయామం ఉండాలి.      – డాక్టర్‌ రమేశ్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి

చిన్న పిల్లల్లోనూ... 
సాధారణంగా మద్యం, మాంసం, ఆయిల్‌ ఫుడ్‌ అతిగా తీసుకునేవారే ఎక్కువగా కాలేయ జబ్బుల బారినపడుతుంటారు. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే కనీస/తక్కువ బరువుతో ఉన్నవారు... ఎలాంటి దురలవాట్లు లేనివారు సైతం ప్రస్తుతం ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఇలా ప్రతి 10 మందిలో ఐదారుగురు ఈ సమస్యతో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పెద్దవారిలో బయటపడే ఈ సమస్య... ప్రస్తుతం చిన్నపిల్లల్లోనూ ఎక్కువగా నమోదవుతోంది. జన్యుపరమైన కారణాలతో పాటు రకరకాల ఇన్‌ఫెక్షన్లే ఇందుకు కారణమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.  
    – డాక్టర్‌ మధుసూదన్, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement