కథ చెబుతాం.. ఊ కొడతారా..! | Future Benefits With The Art Of Storytelling Turned Professional Course | Sakshi
Sakshi News home page

కథ చెబుతాం.. ఊ కొడతారా..!

Published Wed, Aug 14 2024 8:55 AM | Last Updated on Wed, Aug 14 2024 8:55 AM

Future Benefits With The Art Of Storytelling Turned Professional Course

స్టోరీ టెల్లింగ్‌ ఆర్ట్‌ నేర్చుకోవడానికి నగరవాసుల ఆరాటం..

పిల్లలకు చెప్పడం దగ్గర్నుంచి కార్పొరేట్‌ పాఠాల వరకూ..

కథ చెప్పడం అనేది కళగా స్థిరపడిన వైనం..

అవ్వాతాతలు సైతం ఆన్‌లైన్‌ ట్యూషన్స్‌కి రెడీ..

‘అనగనగా ఓ మహారాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురూ వేటకువెళ్లి ఏడు చేపలు తెచ్చారు...’ ఇలా పిల్లలకు పాత కథలు మాత్రమే తప్ప కొత్త కథలు, కొత్తగా చెప్పడం రాని ఆధునిక తల్లిదండ్రులు.. కథలు నేర్పే స్టోరీ టెల్లర్స్‌ దగ్గర బారులు తీరుతున్నారు. వీరు మాత్రమే కాదు పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ల నుంచి కార్పొరేట్‌ ఉద్యోగులకు పాఠాలు చెప్పే కౌన్సిలర్స్‌ వరకూ అందరూ కథా  కళ..లో నైపుణ్యం కోసం క్యూ కడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

ప్రధానంగా నగరంలో ఈ కళకు డిమాండ్‌ తీసుకురావడంతో తల్లిదండ్రులే మహారాజు పోషకులుగా కనిపిస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం మానసిక వికాసానికి మార్గమని సైకాలజిస్ట్‌లు సూచిస్తుండడం ఈ పోకడకు ఆజ్యం పోస్తోంది. పిల్లలకు కథలు చెప్పడం కేవలం వినోదం కాదని, ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో ఇది తప్పనిసరి అని చెబుతున్నారు స్టోరీ టెల్లర్‌ దీపాకిరణ్‌. కథలు చెప్పడం వల్ల పెద్దలు, పిల్లల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అన్నారామె.

ప్రయోజనాలెన్నో...
సంభాషించడానికి మాత్రమే కాదు నేర్చుకోవడానికీ.. ఆలోచనల్లో పరిణితికీ  భాష అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్నారుల్లో భాషా పరిజ్ఞానం సంతరించుకోవడం ఆలస్యం కావడం సహజంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను ఆకట్టుకునేలా కథలు చెప్పడం నేర్చుకున్న పెద్దలు ఆ నైపుణ్యాన్ని పిల్లలకు అందిస్తారు. కథల ద్వారా సంస్కృతి గురించి నేర్పవచ్చు. అలాగే ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు అంటున్నారు నిపుణులు.

మనవడికి కథలు చెబుతున్నా...
కొన్ని రోజుల క్రితం నా పదేళ్ల మనవడు అమ్మమ్మా కథ చెప్పమని నన్ను అడగడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్‌ కాలంలో కూడా పెద్దల నోటి ద్వారా కథలు వినడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది.  స్టోరీ టెల్లింగ్‌ వర్క్‌షాప్‌కి అటెండ్‌ అయ్యి కొత్త కొత్త కథలు, ఆకట్టుకునేలా చెప్పగలడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మనవడు/మనవరాళ్లతో అనుబంధం మరింత బలోపేతం చేసింది. – భారతి రామినేని

మెళకువలు నేర్చుకుంటే మేలెంతో..
స్టోరీ టెల్లింగ్‌ సెషన్స్‌కి హాజరవడం వల్ల కథకు సంగీతాన్ని జత చేయడం, ముఖ కవళికలు, గొంతు పలికే తీరులో మార్పుచేర్పులు చూపడం.. వంటివి నేర్చుకుని నా మూడేళ్ల కొడుకుకి మంచి కథలు చెప్పగలుగుతున్నా. తనతో అనుబంధాన్ని మరింతగా ఆనందిస్తున్నా.  – దాసన్న

కళ అబ్బింది.. కథ వచ్చింది.. 
కథలు చెప్పడమే కదా ఎంత సేపు అనుకుంటాం కానీ.. ఈ ఆర్ట్‌ను నేర్చుకుంటే.. జీవితంలో ప్రతీ సందర్భాన్ని ఒక కథగా మలిచే సామర్థ్యం వస్తుంది. సంగీతాన్ని కలుపుతూ మా అబ్బాయికి కథ చెప్పడం, కథలోని క్యారెక్టర్స్‌ ఆవాహన చేసుకుని చెప్పడం వంటివి తనకి బాగా కనెక్ట్‌ అవుతోంది. తన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరగడానికి బాగా ఉపకరిస్తోంది. విశేషం ఏమిటంటే తనే కథలు అల్లేసి నాకు చెబుతున్నాడు.  – సుధారాణి

ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ప్రజెంటేషన్స్‌కూ..
ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నాకు వృత్తి జీవితంలో స్టోరీ టెల్లింగ్‌ సామర్థ్యం ఉపకరించింది. ముఖ్యంగా పలు అంశాలపై ప్రజెంటేషన్స్‌ ఇవ్వడానికి సహకరించాయి. నిజానికి నా సోదరి కూతుర్ని పెంచాల్సిన బాధ్యత వల్ల స్టోరీటెల్లింగ్‌ నేర్చుకోవాల్సి వచి్చంది. అలా నేర్చుకుని తనకు చెప్పిన కొన్ని కథలు తనని క్లాస్‌లో టాపర్‌గా మార్చాయి. మంచి హాబీస్‌ను అలవర్చాయి. తను ఎప్పుడైనా ఏడుపు ముఖం పెట్టిందంటే నేను అనగనగా అనగానే ముఖ కవళికలు మార్చేసి ఆసక్తిగా చూస్తుంది. కథలు చెప్పడం వల్ల నా కూతురికి కూడా చాలా మానసిక వికాసం వచ్చేలా చేయగలిగాను. చాలా ఇళ్లలో పిల్లల వల్ల ఎదురయ్యే అల్లరి చిల్లరి ఇబ్బందులెప్పుడూ నాకు ఎదురు కాలేదు. దానికి కారణం కథలే అని చెప్పగలను. అందరు పిల్లలూ వీడియోగేమ్స్‌లో బిజీగా ఉండే సమయంలో మా పిల్లలు నన్ను కథ చెప్పవా అని అడుగుతారు. – వసుధ

కథలతో అనుబంధాలు బలోపేతం..
స్టోరీటెల్లింగ్‌ అనే కళలో నైపుణ్యం సాధించే విషయంలో టీచర్లతో పాటు అవ్వా, తాతలకు, తల్లిదండ్రులకు బాగా ఆసక్తి పెరిగి మా స్టోరీ సూత్ర సంస్థను సంప్రదిస్తున్నారు. కథలు చెప్పే కళలో నైపుణ్యం సాధించిన వారు ఇలా పిల్లలతో తమ మధ్య అనుబంధం బలపడిందని, అంతిమంగా అది తమ ఆరోగ్యానికి, ఆనందానికి సైతం ఉపకరిస్తోందని చెబుతున్నారు. – దీపాకిరణ్, స్టోరీ టెల్లర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement