Story Arts
-
కథల ఫ్యాక్టరీ! అక్కడ కథలు డ్యాన్స్ చేస్తాయి, చిత్రాలు ..
ఆ ఫ్యాక్టరీలో కథలు డ్యాన్స్ చేస్తాయి. చిత్రాలు గీస్తాయి. సంగీత పరికరాలతో ఆటలు ఆడిస్తాయి. ఆ ఫ్యాక్టరీలో కథలు ఎంతో సహజాతిసహజంగా తయారవుతాయి. చిన్నా పెద్ద అందరినీ నవ్వులలో ముంచెత్తుతాయి. పేరు ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ.’ ఫౌండర్ రఘుదత్. హైదరాబాద్ వాసి అయిన రఘు ఆరేళ్లుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ‘నా స్టోరీ మీకు స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’ అంటూ సృజనాత్మక ఆలోచనలనూ, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు... ‘‘ఇటీవల వృద్ధాశ్రమంలో ఒక ప్రోగ్రామ్ చేశాం. అక్కడ ఒక పెద్దావిడ తన చిన్ననాటి స్టోరీ ఒకటి అందరి ముందు పంచుకుంది. చిన్నప్పుడు స్కూల్లో వేదికపైన మాట్లాడాలన్నా, పాట ΄పాడాలన్నా చాలా సిగ్గుపడేవారంట. ఇప్పుడు నలుగురిలో పాడటానికి సిగ్గుపడుతూ అప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ తన చిన్ననాటి కథను పంచుకున్నారు. తాత వయసున్న ఒకతను ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తూ తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ నాటి కథను షేర్ చేశారు. అవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అక్కడ ఉండి వారి కథల్లో మనమూ గెంతులు వేయాల్సిందే. కొందరు పెయింట్ ద్వారా, మరికొందరు మ్యూజిక్ ద్వారా తమ కథలను పరిచయం చేస్తుంటారు. ఈ విధానం వల్ల అంతర్లీనంగా వారిలో ఉన్న కళ, ఆనందం తమ చుట్టూ ఉన్నవారికి పంచుతారు. ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ’ ఉద్దేశ్యం కూడా అదే. అందరూ కథ ద్వారా బోలెడంత ఆనందాన్ని పొందాలి. అందరిలోనూ ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. నెలకు ఒకసారైనా మనలో ఉన్న ఆ చైల్డ్‌ను బయటకు తీసుకువచ్చి, ఎంజాయ్ చేయిస్తే ఇన్నర్లైఫ్ అంతా హ్యాపీగా మారి΄ోతుంది. అందుకే ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ కింద ‘లివ్ యా స్టోరీ’ అని ఉంటుంది. రిజెక్ట్ చేశారనే... పదేళ్లుగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కౌన్సెలర్‌గా ట్రెయినింగ్ ఇస్తున్నాను. స్పోర్ట్స్ సైకాలజీలో కోర్సు చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశాను. క్రికెట్ అసోసియేషన్స్, క్రికెట్ పర్సన్స్‌కి కౌన్సెలర్‌గా చేశాను. నా స్టూడెంట్స్ కొందరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఒక స్టోరీ టెల్లింగ్ ఫ్లాట్‌ఫామ్ వాళ్లు నేను డిజేబుల్డ్ అని, సోషల్ మీడియాలో ఎక్కడా లేనని నన్ను రిజెక్ట్ చేశారని తెలిసి బాదనిపించింది. దీంతో నేనే ఓ కొత్త ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పటికే, పేరెంట్స్‌ని లేని ఒక అమ్మాయిని దత్తతు తీసుకొని చదివిస్తున్నాను. ఆ అమ్మాయి పేరు ఆఫియా. ఇప్పుడు ఇంటీర్మడియెట్ చేస్తుంది. ఆ అమ్మాయి స్టోరీకి మించినదేదీ ఉండదని తనతోనే ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేశాం. అక్కణ్ణుంచి స్కూళ్లు, కాలేజీలు, ఎన్జీవోలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి స్టోరీ ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టాం. 2018లో మొదలు పెట్టిన ఈ ప్రోగ్రామ్‌లో దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు.. ఇలా ఒక వర్గానికి మాత్రమే చెందినవారు ఉండకూడదని, మానవత్వంతో కూడిన కథలే ఉండాలని నియమం పెట్టాం. మా ΄్లాట్‌ఫామ్ పైన ఆటిజమ్ కిడ్స్ కూడా తమ స్కిల్స్‌ను ప్రదర్శించేలా వేదికను సిద్ధం చేశాం. లైఫ్‌స్కిల్స్‌లో శిక్షణ...‘టిజిటిఎఫ్ విద్య’ పేరుతో ఇప్పుడు 20 మంది పేద పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. పాతికమంది వాలంటీర్లు ఉన్నారు. స్కాలర్షిప్స్ ఇవ్వడమే కాకుండా లైఫ్ స్కిల్స్, వాల్యూస్, కమ్యూనికేషన్స్‌పై పిల్లలకు, యూత్‌కి స్కిల్‌డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం.స్వచ్ఛందంగా... ఈ యేడాది గోవాలో ఆరు రోజుల పాటు పర్పుల్ ఫెస్ట్ జరిగింది. ప్రపంచంలో ఉన్న దివ్యాంగులు అందరూ ఒక చోట చేరే సందర్బం. అందులో ‘ది గుడ్ టాక్ ఫాక్టరీ’ ఒక వాలంటీర్‌గా పనిచేసింది. ముందే 1200 స్టూడెంట్స్‌కి ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి ట్రెయినింగ్ ఇచ్చాం. ఆరు రోజుల ఈవెంట్లో 60–70 వేల మంది పాల్గొన్నారు. అందులో టిజిటిఎఫ్ పెద్ద పాత్ర పోషించింది.వైకల్యం ఉన్న వ్యక్తి ఏదైనా సాధిస్తే గొప్పగా చూడరు. వారి బాడీలో లోపాన్ని చూపిస్తూ అదొక స్ఫూర్తిగా పరిచయం చేస్తారు. జాలిగా చూస్తారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. నా స్టోరీ స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’’ అంటున్నారు ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ’ రఘు. కథ ఎన్జీవో అయితే... స్వచ్ఛందంగా ఓ పది మందిమి కలిసి ఆరేళ్లుగా ఈ కథల ఫ్యాక్టరీకి పనిచేస్తున్నాం. దీని ద్వారా కొంత మంది పేద పిల్లలకు చదువు చెప్పిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. మూడేళ్ల క్రితం ‘టిజిటిఎఫ్ విద్య’ పేరుతో ఎన్జీవోగా తీసుకొచ్చాం. ఈ సంస్థ ద్వారా చైల్డ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా 20 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తున్నాం. యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రెయినింగ్స్ ఇస్తున్నాం. ఈ కథల జర్నీలో ఏరుకున్న కథలెన్నో ఉన్నాయి. – రఘు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తీవ్ర కాలుష్యం నడుమ..మెరుగైన వాయునాణ్యతతో కూడిన ఇల్లు..!) -
కథ చెబుతాం.. ఊ కొడతారా..!
‘అనగనగా ఓ మహారాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురూ వేటకువెళ్లి ఏడు చేపలు తెచ్చారు...’ ఇలా పిల్లలకు పాత కథలు మాత్రమే తప్ప కొత్త కథలు, కొత్తగా చెప్పడం రాని ఆధునిక తల్లిదండ్రులు.. కథలు నేర్పే స్టోరీ టెల్లర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. వీరు మాత్రమే కాదు పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ల నుంచి కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు చెప్పే కౌన్సిలర్స్ వరకూ అందరూ కథా కళ..లో నైపుణ్యం కోసం క్యూ కడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రధానంగా నగరంలో ఈ కళకు డిమాండ్ తీసుకురావడంతో తల్లిదండ్రులే మహారాజు పోషకులుగా కనిపిస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం మానసిక వికాసానికి మార్గమని సైకాలజిస్ట్‌లు సూచిస్తుండడం ఈ పోకడకు ఆజ్యం పోస్తోంది. పిల్లలకు కథలు చెప్పడం కేవలం వినోదం కాదని, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇది తప్పనిసరి అని చెబుతున్నారు స్టోరీ టెల్లర్ దీపాకిరణ్. కథలు చెప్పడం వల్ల పెద్దలు, పిల్లల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అన్నారామె.ప్రయోజనాలెన్నో...సంభాషించడానికి మాత్రమే కాదు నేర్చుకోవడానికీ.. ఆలోచనల్లో పరిణితికీ భాష అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్నారుల్లో భాషా పరిజ్ఞానం సంతరించుకోవడం ఆలస్యం కావడం సహజంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను ఆకట్టుకునేలా కథలు చెప్పడం నేర్చుకున్న పెద్దలు ఆ నైపుణ్యాన్ని పిల్లలకు అందిస్తారు. కథల ద్వారా సంస్కృతి గురించి నేర్పవచ్చు. అలాగే ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు అంటున్నారు నిపుణులు.మనవడికి కథలు చెబుతున్నా...కొన్ని రోజుల క్రితం నా పదేళ్ల మనవడు అమ్మమ్మా కథ చెప్పమని నన్ను అడగడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్ కాలంలో కూడా పెద్దల నోటి ద్వారా కథలు వినడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యి కొత్త కొత్త కథలు, ఆకట్టుకునేలా చెప్పగలడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మనవడు/మనవరాళ్లతో అనుబంధం మరింత బలోపేతం చేసింది. – భారతి రామినేనిమెళకువలు నేర్చుకుంటే మేలెంతో..స్టోరీ టెల్లింగ్ సెషన్స్‌కి హాజరవడం వల్ల కథకు సంగీతాన్ని జత చేయడం, ముఖ కవళికలు, గొంతు పలికే తీరులో మార్పుచేర్పులు చూపడం.. వంటివి నేర్చుకుని నా మూడేళ్ల కొడుకుకి మంచి కథలు చెప్పగలుగుతున్నా. తనతో అనుబంధాన్ని మరింతగా ఆనందిస్తున్నా. – దాసన్నకళ అబ్బింది.. కథ వచ్చింది.. కథలు చెప్పడమే కదా ఎంత సేపు అనుకుంటాం కానీ.. ఈ ఆర్ట్‌ను నేర్చుకుంటే.. జీవితంలో ప్రతీ సందర్భాన్ని ఒక కథగా మలిచే సామర్థ్యం వస్తుంది. సంగీతాన్ని కలుపుతూ మా అబ్బాయికి కథ చెప్పడం, కథలోని క్యారెక్టర్స్ ఆవాహన చేసుకుని చెప్పడం వంటివి తనకి బాగా కనెక్ట్ అవుతోంది. తన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి బాగా ఉపకరిస్తోంది. విశేషం ఏమిటంటే తనే కథలు అల్లేసి నాకు చెబుతున్నాడు. – సుధారాణిప్రొఫెషనల్ లైఫ్‌లో ప్రజెంటేషన్స్కూ..ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నాకు వృత్తి జీవితంలో స్టోరీ టెల్లింగ్ సామర్థ్యం ఉపకరించింది. ముఖ్యంగా పలు అంశాలపై ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి సహకరించాయి. నిజానికి నా సోదరి కూతుర్ని పెంచాల్సిన బాధ్యత వల్ల స్టోరీటెల్లింగ్ నేర్చుకోవాల్సి వచి్చంది. అలా నేర్చుకుని తనకు చెప్పిన కొన్ని కథలు తనని క్లాస్‌లో టాపర్‌గా మార్చాయి. మంచి హాబీస్‌ను అలవర్చాయి. తను ఎప్పుడైనా ఏడుపు ముఖం పెట్టిందంటే నేను అనగనగా అనగానే ముఖ కవళికలు మార్చేసి ఆసక్తిగా చూస్తుంది. కథలు చెప్పడం వల్ల నా కూతురికి కూడా చాలా మానసిక వికాసం వచ్చేలా చేయగలిగాను. చాలా ఇళ్లలో పిల్లల వల్ల ఎదురయ్యే అల్లరి చిల్లరి ఇబ్బందులెప్పుడూ నాకు ఎదురు కాలేదు. దానికి కారణం కథలే అని చెప్పగలను. అందరు పిల్లలూ వీడియోగేమ్స్‌లో బిజీగా ఉండే సమయంలో మా పిల్లలు నన్ను కథ చెప్పవా అని అడుగుతారు. – వసుధకథలతో అనుబంధాలు బలోపేతం..స్టోరీటెల్లింగ్ అనే కళలో నైపుణ్యం సాధించే విషయంలో టీచర్లతో పాటు అవ్వా, తాతలకు, తల్లిదండ్రులకు బాగా ఆసక్తి పెరిగి మా స్టోరీ సూత్ర సంస్థను సంప్రదిస్తున్నారు. కథలు చెప్పే కళలో నైపుణ్యం సాధించిన వారు ఇలా పిల్లలతో తమ మధ్య అనుబంధం బలపడిందని, అంతిమంగా అది తమ ఆరోగ్యానికి, ఆనందానికి సైతం ఉపకరిస్తోందని చెబుతున్నారు. – దీపాకిరణ్, స్టోరీ టెల్లర్ -
కథ కంచి నుంచి తిరిగొస్తుంది...
వెన్నెల రాత్రిలో అమ్మమ్మ కథ మొదలు పెడుతుంది.... ‘‘అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆరాజుకు ఏడుగురు కుమారులు...’’ పిల్లలు ఆరు బయట కూర్చున్నట్లే కనిపిస్తున్నారుగానీ, వారు రాకుమారులతో పాటు వేటకు వెళ్లారు. వస్తూ వస్తూ చేపలు తెచ్చారు. ‘‘చేప... చేప ఎందుకు ఎండలేదు?’’ అని అడిగారు. చేప సమాధానాలు సావధానంగా విన్నారు... ‘చేప...చేప ఎందుకు ఎండలేదు?’ అని అడిగితే ఆ చేప ఎన్ని కారణాలు చెప్పిందో ‘కథ...కథ...ఎందుకు వినిపించడం లేదు?’ అని అడిగితే కథ కూడా ఎన్నో కారణాలు చెప్పింది. ఇంట్లో పెద్దవాళ్లందరూ బిజీగా ఉన్నారని, పిల్లలు చదువుల్లో అంతకంటే బిజీ బిజీగా ఉన్నారని. ఇక కథ మాత్రం ఏం చేస్తుంది పాపం... కంచికి పోకుండా!! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! మళ్లీ మంచి కాలం వస్తోంది. ఇది ఆశాభావం కాదు...అక్షరాలా నిజం! పిల్లలు కథలు వినడాన్ని కాలహరణంగా భావించే తలిదండ్రులు మారిపోతున్నారు. పిల్లలను ప్రేమగా దగ్గరకు పిలిచి కథలు చెబుతున్నారు. తమకు వీలు కాకపోతే కథల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. ఎందుకీ మార్పు?: బోలెడు చానళ్ల పుణ్యమా అని పిల్లల వినోదానికి కొదవ లేదు. అయితే టీవీ వినోదం పిల్లల మానసిక ఎదుగుదల మీద మితిమీరి ప్రభావం చూపుతోంది. మితిమీరి టీవి చూడడం వల్ల ఆలోచన, విశ్లేషణా సామర్థ్యానికి పిల్లలు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కథలు వినడానికి ప్రాముఖ్యం పెరిగింది. ఉపయోగం ఏమిటి?: కథ వినే క్రమంలో పిల్లలలో రకరకాల సందేహాలు వస్తుంటాయి. అవి వారి మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. కథ వినే క్రమంలో రకరకాల దృశ్యాలను ఊహించుకుంటారు. ఇది వారి సృజనను శక్తిమంతం చేస్తుంది. విన్న కథను తిరిగి చెప్పే క్రమంలో పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కథ మొత్తం చెప్పకుండా సగం వరకు చెప్పి... ‘ఆ తరువాత ఏమైందో చెప్పండి?’ అని అడిగితే పిల్లలు అప్పటికప్పుడు కథను అల్లుతూ పోతారు. ఇది ఒక రకంగా సృజనను పెంపొందించే విధానం. కథను పూరించే క్రమంలో ఆశావాద దృక్పథానికి ప్రాధాన్యం ఇస్తారు. సమస్యకు పరిష్కారం ఆలోచించడాన్ని పెంపొందించుకుంటారు. మానవసంబంధాలు, నైతిక విలువల్లోని గొప్పదనాన్ని గుర్తిస్తారు. కొత్త ప్రదేశాలు, పాత ఆచారాలు, భాషావ్యవహారాలు, పద పరిచయం, సాంస్కృతిక మూలాలు...ఒక్కటనేమిటి సమస్త విషయాలను, విలువలను ‘కథ’ పిల్లలకు పరిచయం చేస్తుంది. సృజనాత్మక ఆలోచనలకు, ఆలోచన పరిధిని పెంచడానికి కథను మించిన సాధనం లేదనే విషయం ఎన్నో పరిశోధనల్లో తెలిశాక...మెల్లిగా కథలకు ప్రాముఖ్యం పెరగడం మొదలైంది. కొన్ని పాఠశాలల్లో కథ చెప్పడం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. బెంగళూరులోని ‘మహాత్మా స్కూలు’లో ‘కథాలయ’ పేరుతో విరివిగా కథా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ‘మహాత్మా’ బాటలోనే చాలా పాఠశాలలు ‘కథాలయ’లు నిర్వహిస్తున్నాయి. ‘‘కథ అనేది అనేక కళల సమాహారం. కథ చెబుతున్నప్పుడు ఆడతాం, పాడతాం, అనుకరిస్తాం. అందుకే పిల్లలు కథ వినడానికి ఇష్టపడతారు. కథలు చెప్పడం అనేది కాలక్షేపం కోసం కాదు..పిల్లలను చక్కగా తీర్చిదిద్దడానికి’’ అంటున్నారు ‘కథాలయ’ ట్రస్ట్ డెరైక్టర్ గీతా రామానుజన్. విదేశాల నుంచి కూడా ప్రసిద్ధ కథకులను రప్పించి పిల్లలకు కథలు చెప్పించడం ఈ ‘కథాలయ’ ప్రత్యేకత. ‘ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ నెట్వర్క్’తో ‘కథాలయ’ ప్రత్యేక ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్‌వర్క్‌లో 15 దేశాలకు చెందిన 490 మంది సభ్యులు ఉన్నారు. జూన్ 21ని ‘వరల్డ్ సోరీ టెలింగ్ డే’గా ఈ నెట్వర్క్ ప్రకటించింది. ‘కథాలయ’ మరో ప్రత్యేకత ఏమిటంటే, పిల్లలను మారుమూల ఆదివాసుల దగ్గరికి తీసుకెళ్లి వారి చేత కథలు వినిపిస్తారు. ఇలా ఎన్నో విలువైన జానపద కథలు వినే అదృష్టం పిల్లలకు కలిగింది. ఈ సమకాలీన పరిణామాల మధ్య మన రాష్ట్రంలోని పాఠశాలల్లోనూ ఇప్పుడిప్పుడే ‘కథ చెప్పడం’ అనేది ఊపందుకుంటుంది. అంటే ‘కథ’కు మళ్ళీ బంగారు కాలం వస్తోందని ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది! నేను గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ఆరు పాఠశాలలకు ‘స్టోరీ టెల్లర్’గా పనిచేస్తున్నాను. ఈ మధ్యనే ‘స్టోరీ ఆర్ట్స్ ఇండియా’ పేరుతో హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాల్లో పిల్లల్ని సమీకరించి కథలు చెబుతున్నాను. కథలంటే చందమామ కథలు మాత్రమే కాదు, వయసుని బట్టి వారికి కావాల్సిన భాష, విజ్ఞానం కూడా అందులో ఉండేలా కథలను తయారుచేసుకుంటున్నాను. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కోరిక మేరకు హరికథల రూపంలో కూడా కథలు చెబుతున్నాను. చిన్నపిల్లల విషయానికొస్తే కథ సృజనాత్మకతను పెంచుతుంది కాబట్టి వారి మెదడులో పూర్తిస్థాయి ఊహాచిత్రం వచ్చే విధంగా వివరించి చెబుతాను. అలాగే మన శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో చెప్పే కథలను కూడా తయారుచేసుకున్నాను. అరటి పండు తింటే అది ఎలా జీర్ణమవుతుందో చెప్పడానికి...అరటి పండు మాట్లాడుతున్నట్లు కథ అల్లి చెప్పాలి. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాలు, జాతులు, భాషలు, మతాలు అన్నింటిపై కనీస అవగాహనను పెంచే కథలను ఏ రోజుకారోజు తయారుచేసుకుంటాను. ‘కథ’కున్న శక్తి గురించి ఇంకా చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియదు. అన్ని పాఠశాలలో కథలు చెప్పే తరగతి ఉండాల్సిన అవసరం చాలా ఉంది. - దీపాకిరణ్ స్టోరీ ఆర్ట్స్ ఇండియా వ్యవస్థాపకురాలు