కథల ఫ్యాక్టరీ! అక్కడ కథలు డ్యాన్స్‌ చేస్తాయి, చిత్రాలు .. | The Good Talk Factory: Foster Change With Storytelling | Sakshi
Sakshi News home page

కథల ఫ్యాక్టరీ! అక్కడ కథలు డ్యాన్స్‌ చేస్తాయి, చిత్రాలు..

Published Fri, Nov 29 2024 9:37 AM | Last Updated on Fri, Nov 29 2024 10:26 AM

The Good Talk Factory: Foster Change With Storytelling

ఆ ఫ్యాక్టరీలో కథలు డ్యాన్స్‌ చేస్తాయి. చిత్రాలు గీస్తాయి. సంగీత పరికరాలతో ఆటలు ఆడిస్తాయి. ఆ ఫ్యాక్టరీలో కథలు ఎంతో సహజాతిసహజంగా తయారవుతాయి. చిన్నా పెద్ద అందరినీ నవ్వులలో ముంచెత్తుతాయి. పేరు ‘ది గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ.’  ఫౌండర్‌ రఘుదత్‌. హైదరాబాద్‌ వాసి అయిన రఘు ఆరేళ్లుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ‘నా స్టోరీ మీకు స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’ అంటూ సృజనాత్మక ఆలోచనలనూ, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు... 

‘‘ఇటీవల వృద్ధాశ్రమంలో ఒక ప్రోగ్రామ్‌ చేశాం. అక్కడ ఒక పెద్దావిడ తన చిన్ననాటి స్టోరీ ఒకటి అందరి ముందు పంచుకుంది. చిన్నప్పుడు స్కూల్లో వేదికపైన మాట్లాడాలన్నా, పాట ΄పాడాలన్నా చాలా సిగ్గుపడేవారంట. ఇప్పుడు నలుగురిలో పాడటానికి సిగ్గుపడుతూ అప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ తన చిన్ననాటి కథను పంచుకున్నారు. 

తాత వయసున్న ఒకతను ముందుకు వచ్చి డ్యాన్స్‌ చేస్తూ తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ నాటి కథను షేర్‌ చేశారు. అవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అక్కడ ఉండి వారి కథల్లో మనమూ గెంతులు వేయాల్సిందే. కొందరు పెయింట్‌ ద్వారా, మరికొందరు మ్యూజిక్‌ ద్వారా తమ కథలను పరిచయం చేస్తుంటారు. ఈ విధానం వల్ల అంతర్లీనంగా వారిలో ఉన్న కళ, ఆనందం తమ చుట్టూ ఉన్నవారికి పంచుతారు. 

‘ది గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ’ ఉద్దేశ్యం కూడా అదే. అందరూ కథ ద్వారా బోలెడంత ఆనందాన్ని పొందాలి. అందరిలోనూ ఒక ఇన్నర్‌ చైల్డ్‌ ఉంటుంది. నెలకు ఒకసారైనా మనలో ఉన్న ఆ చైల్డ్‌ను బయటకు తీసుకువచ్చి, ఎంజాయ్‌ చేయిస్తే ఇన్నర్‌లైఫ్‌ అంతా హ్యాపీగా మారి΄ోతుంది. అందుకే ‘ది గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ కింద ‘లివ్‌ యా స్టోరీ’ అని ఉంటుంది.  

రిజెక్ట్‌ చేశారనే... 
పదేళ్లుగా విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సెలర్‌గా ట్రెయినింగ్‌ ఇస్తున్నాను. స్పోర్ట్స్‌ సైకాలజీలో కోర్సు చేశాను. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌ చేశాను. క్రికెట్‌ అసోసియేషన్స్, క్రికెట్‌ పర్సన్స్‌కి కౌన్సెలర్‌గా చేశాను. నా స్టూడెంట్స్‌ కొందరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారు. 

ఒక స్టోరీ టెల్లింగ్‌‍ ఫ్లాట్‌ఫామ్‌ వాళ్లు నేను డిజేబుల్డ్‌ అని, సోషల్‌ మీడియాలో ఎక్కడా లేనని నన్ను రిజెక్ట్‌ చేశారని తెలిసి బాదనిపించింది. దీంతో నేనే ఓ కొత్త ఫ్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేయాలనుకున్నాను. అప్పటికే, పేరెంట్స్‌ని లేని ఒక అమ్మాయిని దత్తతు తీసుకొని చదివిస్తున్నాను. ఆ అమ్మాయి పేరు ఆఫియా. 

ఇప్పుడు ఇంటీర్మడియెట్‌ చేస్తుంది. ఆ అమ్మాయి స్టోరీకి మించినదేదీ ఉండదని తనతోనే ఫస్ట్‌ స్టోరీ స్టార్ట్‌ చేశాం. అక్కణ్ణుంచి స్కూళ్లు, కాలేజీలు, ఎన్జీవోలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి స్టోరీ ఈవెంట్స్‌ చేయడం మొదలుపెట్టాం. 2018లో మొదలు పెట్టిన ఈ ప్రోగ్రామ్‌లో దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు.. ఇలా ఒక వర్గానికి మాత్రమే చెందినవారు ఉండకూడదని, మానవత్వంతో కూడిన కథలే ఉండాలని నియమం పెట్టాం.  మా ΄్లాట్‌ఫామ్‌ పైన ఆటిజమ్‌ కిడ్స్‌ కూడా తమ స్కిల్స్‌ను ప్రదర్శించేలా వేదికను సిద్ధం చేశాం.    
లైఫ్‌స్కిల్స్‌లో శిక్షణ...
‘టిజిటిఎఫ్‌ విద్య’ పేరుతో ఇప్పుడు 20 మంది పేద పిల్లలకు స్కాలర్‌షిప్స్‌ ఇస్తున్నాం. పాతికమంది వాలంటీర్లు ఉన్నారు. స్కాలర్‌షిప్స్‌ ఇవ్వడమే కాకుండా లైఫ్‌ స్కిల్స్, వాల్యూస్, కమ్యూనికేషన్స్‌పై పిల్లలకు, యూత్‌కి స్కిల్‌డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టాం.

స్వచ్ఛందంగా... 
ఈ యేడాది గోవాలో ఆరు రోజుల పాటు పర్పుల్‌ ఫెస్ట్‌ జరిగింది. ప్రపంచంలో ఉన్న దివ్యాంగులు అందరూ ఒక చోట చేరే సందర్బం. అందులో ‘ది గుడ్‌ టాక్‌ ఫాక్టరీ’ ఒక వాలంటీర్‌గా పనిచేసింది. ముందే 1200 స్టూడెంట్స్‌కి ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి ట్రెయినింగ్‌ ఇచ్చాం. ఆరు రోజుల ఈవెంట్‌లో 60–70 వేల మంది పాల్గొన్నారు. అందులో టిజిటిఎఫ్‌ పెద్ద పాత్ర పోషించింది.

వైకల్యం ఉన్న వ్యక్తి ఏదైనా సాధిస్తే గొప్పగా చూడరు. వారి బాడీలో లోపాన్ని చూపిస్తూ అదొక స్ఫూర్తిగా పరిచయం చేస్తారు. జాలిగా చూస్తారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. నా స్టోరీ స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’’ అంటున్నారు ‘ది గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ’ రఘు. 

కథ ఎన్జీవో అయితే... 
స్వచ్ఛందంగా ఓ పది మందిమి కలిసి ఆరేళ్లుగా ఈ కథల ఫ్యాక్టరీకి పనిచేస్తున్నాం. దీని ద్వారా కొంత మంది పేద పిల్లలకు చదువు చెప్పిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. మూడేళ్ల క్రితం ‘టిజిటిఎఫ్‌ విద్య’ పేరుతో ఎన్జీవోగా తీసుకొచ్చాం. ఈ సంస్థ ద్వారా చైల్డ్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా 20 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నాం. యువతకు, మహిళలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ట్రెయినింగ్స్‌ ఇస్తున్నాం. ఈ కథల జర్నీలో ఏరుకున్న కథలెన్నో ఉన్నాయి. 
– రఘు 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

(చదవండి: తీవ్ర కాలుష్యం నడుమ..మెరుగైన వాయునాణ్యతతో కూడిన ఇల్లు..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement