వెన్నెల రాత్రిలో అమ్మమ్మ కథ మొదలు పెడుతుంది....
‘‘అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆరాజుకు ఏడుగురు కుమారులు...’’
పిల్లలు ఆరు బయట కూర్చున్నట్లే కనిపిస్తున్నారుగానీ, వారు రాకుమారులతో పాటు వేటకు వెళ్లారు. వస్తూ వస్తూ చేపలు తెచ్చారు. ‘‘చేప... చేప ఎందుకు ఎండలేదు?’’ అని అడిగారు. చేప సమాధానాలు సావధానంగా విన్నారు...
‘చేప...చేప ఎందుకు ఎండలేదు?’ అని అడిగితే ఆ చేప ఎన్ని కారణాలు చెప్పిందో ‘కథ...కథ...ఎందుకు వినిపించడం లేదు?’ అని అడిగితే కథ కూడా ఎన్నో కారణాలు చెప్పింది.
ఇంట్లో పెద్దవాళ్లందరూ బిజీగా ఉన్నారని, పిల్లలు చదువుల్లో అంతకంటే బిజీ బిజీగా ఉన్నారని.
ఇక కథ మాత్రం ఏం చేస్తుంది పాపం... కంచికి పోకుండా!!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! మళ్లీ మంచి కాలం వస్తోంది. ఇది ఆశాభావం కాదు...అక్షరాలా నిజం! పిల్లలు కథలు వినడాన్ని కాలహరణంగా భావించే తలిదండ్రులు మారిపోతున్నారు. పిల్లలను ప్రేమగా దగ్గరకు పిలిచి కథలు చెబుతున్నారు. తమకు వీలు కాకపోతే కథల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు.
ఎందుకీ మార్పు?: బోలెడు చానళ్ల పుణ్యమా అని పిల్లల వినోదానికి కొదవ లేదు. అయితే టీవీ వినోదం పిల్లల మానసిక ఎదుగుదల మీద మితిమీరి ప్రభావం చూపుతోంది. మితిమీరి టీవి చూడడం వల్ల ఆలోచన, విశ్లేషణా సామర్థ్యానికి పిల్లలు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కథలు వినడానికి ప్రాముఖ్యం పెరిగింది.
ఉపయోగం ఏమిటి?: కథ వినే క్రమంలో పిల్లలలో రకరకాల సందేహాలు వస్తుంటాయి. అవి వారి మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. కథ వినే క్రమంలో రకరకాల దృశ్యాలను ఊహించుకుంటారు. ఇది వారి సృజనను శక్తిమంతం చేస్తుంది. విన్న కథను తిరిగి చెప్పే క్రమంలో పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
కథ మొత్తం చెప్పకుండా సగం వరకు చెప్పి... ‘ఆ తరువాత ఏమైందో చెప్పండి?’ అని అడిగితే పిల్లలు అప్పటికప్పుడు కథను అల్లుతూ పోతారు. ఇది ఒక రకంగా సృజనను పెంపొందించే విధానం. కథను పూరించే క్రమంలో ఆశావాద దృక్పథానికి ప్రాధాన్యం ఇస్తారు. సమస్యకు పరిష్కారం ఆలోచించడాన్ని పెంపొందించుకుంటారు. మానవసంబంధాలు, నైతిక విలువల్లోని గొప్పదనాన్ని గుర్తిస్తారు. కొత్త ప్రదేశాలు, పాత ఆచారాలు, భాషావ్యవహారాలు, పద పరిచయం, సాంస్కృతిక మూలాలు...ఒక్కటనేమిటి సమస్త విషయాలను, విలువలను ‘కథ’ పిల్లలకు పరిచయం చేస్తుంది.
సృజనాత్మక ఆలోచనలకు, ఆలోచన పరిధిని పెంచడానికి కథను మించిన సాధనం లేదనే విషయం ఎన్నో పరిశోధనల్లో తెలిశాక...మెల్లిగా కథలకు ప్రాముఖ్యం పెరగడం మొదలైంది. కొన్ని పాఠశాలల్లో కథ చెప్పడం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. బెంగళూరులోని ‘మహాత్మా స్కూలు’లో ‘కథాలయ’ పేరుతో విరివిగా కథా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ‘మహాత్మా’ బాటలోనే చాలా పాఠశాలలు ‘కథాలయ’లు నిర్వహిస్తున్నాయి.
‘‘కథ అనేది అనేక కళల సమాహారం. కథ చెబుతున్నప్పుడు ఆడతాం, పాడతాం, అనుకరిస్తాం. అందుకే పిల్లలు కథ వినడానికి ఇష్టపడతారు. కథలు చెప్పడం అనేది కాలక్షేపం కోసం కాదు..పిల్లలను చక్కగా తీర్చిదిద్దడానికి’’ అంటున్నారు ‘కథాలయ’ ట్రస్ట్ డెరైక్టర్ గీతా రామానుజన్.
విదేశాల నుంచి కూడా ప్రసిద్ధ కథకులను రప్పించి పిల్లలకు కథలు చెప్పించడం ఈ ‘కథాలయ’ ప్రత్యేకత. ‘ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ నెట్‌వర్క్’తో ‘కథాలయ’ ప్రత్యేక ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్‌వర్క్‌లో 15 దేశాలకు చెందిన 490 మంది సభ్యులు ఉన్నారు. జూన్ 21ని ‘వరల్డ్ సోరీ టెలింగ్ డే’గా ఈ నెట్‌వర్క్ ప్రకటించింది.
‘కథాలయ’ మరో ప్రత్యేకత ఏమిటంటే, పిల్లలను మారుమూల ఆదివాసుల దగ్గరికి తీసుకెళ్లి వారి చేత కథలు వినిపిస్తారు. ఇలా ఎన్నో విలువైన జానపద కథలు వినే అదృష్టం పిల్లలకు కలిగింది. ఈ సమకాలీన పరిణామాల మధ్య మన రాష్ట్రంలోని పాఠశాలల్లోనూ ఇప్పుడిప్పుడే ‘కథ చెప్పడం’ అనేది ఊపందుకుంటుంది. అంటే ‘కథ’కు మళ్ళీ బంగారు కాలం వస్తోందని ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది!
నేను గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ఆరు పాఠశాలలకు ‘స్టోరీ టెల్లర్’గా పనిచేస్తున్నాను. ఈ మధ్యనే ‘స్టోరీ ఆర్ట్స్ ఇండియా’ పేరుతో హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాల్లో పిల్లల్ని సమీకరించి కథలు చెబుతున్నాను. కథలంటే చందమామ కథలు మాత్రమే కాదు, వయసుని బట్టి వారికి కావాల్సిన భాష, విజ్ఞానం కూడా అందులో ఉండేలా కథలను తయారుచేసుకుంటున్నాను. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కోరిక మేరకు హరికథల రూపంలో కూడా కథలు చెబుతున్నాను.
చిన్నపిల్లల విషయానికొస్తే కథ సృజనాత్మకతను పెంచుతుంది కాబట్టి వారి మెదడులో పూర్తిస్థాయి ఊహాచిత్రం వచ్చే విధంగా వివరించి చెబుతాను. అలాగే మన శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో చెప్పే కథలను కూడా తయారుచేసుకున్నాను. అరటి పండు తింటే అది ఎలా జీర్ణమవుతుందో చెప్పడానికి...అరటి పండు మాట్లాడుతున్నట్లు కథ అల్లి చెప్పాలి. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాలు, జాతులు, భాషలు, మతాలు అన్నింటిపై కనీస అవగాహనను పెంచే కథలను ఏ రోజుకారోజు తయారుచేసుకుంటాను. ‘కథ’కున్న శక్తి గురించి ఇంకా చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియదు. అన్ని పాఠశాలలో కథలు చెప్పే తరగతి ఉండాల్సిన అవసరం చాలా ఉంది.
- దీపాకిరణ్
స్టోరీ ఆర్ట్స్ ఇండియా వ్యవస్థాపకురాలు
కథ కంచి నుంచి తిరిగొస్తుంది...
Published Thu, Mar 13 2014 9:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
Advertisement
Advertisement