Hyderabad: ఇంప్లాంట్స్‌ క్రేజ్‌.. నగరంలో సర్జరీల సంఖ్య రెట్టింపు | Breast Implant, Plastic Surgeries Increase in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: ఇంప్లాంట్స్‌ క్రేజ్‌.. నగరంలో సర్జరీల సంఖ్య రెట్టింపు

Published Wed, Nov 9 2022 12:54 PM | Last Updated on Wed, Nov 9 2022 12:55 PM

Breast Implant, Plastic Surgeries Increase in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోపం పెద్దదైనా సరే.. చిన్నదైనా సరే.. దాన్ని తొలగించుకోవాలని వీలైనంత బాగా కనపడాలనే ఆరాటం అంతకంతకూ పెరుగుతోంది. అందులో భాగంగానే అందాన్ని పెంచే రొమ్ము ఇంప్లాంటేషన్‌ సర్జరీలకూ సిటీ యువతులు సై అంటున్నారు. నెలకు గరిష్టంగా 25 నుంచి 30 వరకు ఈ రకమైన ఇంప్లాటేషన్‌ సర్జరీలు సిటీలో జరుగుతున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.  

ఆత్మన్యూనతకు కారణమయే శారీరక లోపాల్ని పంటిబిగువున భరించే కంటే వ్యయ ప్రయాసలకోర్చి అయినా తొలగించుకోవడమే మేలనే ఆలోచనా ధోరణి ఆధునికుల్లో కనపడుతోంది. ఆర్ధిక స్వాతంత్య్రం మహిళలకు కల్పించిన వెసులుబాటు కూడా దీనికి తోడవుతోంది. అందంతో పాటు ఇది ఆత్మవిశ్వాసంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మానసిక సమస్యలకు ఈ సర్జరీ ఒక పరిష్కారంగా చెబుతున్నారు. 

సంఖ్య రెట్టింపు... 
నగరంలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సంధ్యా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ పదేళ్ల క్రితం హైదరాబాద్‌లో నెలకు గరిష్ఠంగా 10–15 బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌ శస్త్రచికిత్సలు జరుగుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 25–30కి పెరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం, ఇంటర్నెట్‌ ద్వారా అవగాహన పెరుగుతుండడం వల్ల రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగవచ్చునన్నారు.  

అవసరాన్ని బట్టే... 
శరీరాకృతి ఒక తీరును సంతరించుకునే టీనేజ్‌లో ఈ తరహా సర్జరీలకు దూరంగా ఉండడం మేలు. కనీసం 20 ఏళ్లు దాటిన తర్వాతే అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. అదే విధంగా  50ఏళ్లు దాటిన వారు కూడా దూరంగా ఉండడమే మేలు.  అందం ఒకటే కాకుండా శారీరక సమస్యలకు, ఇక కేన్సర్‌ చికిత్సలో భాగంగా రొమ్ము కోల్పోయిన వారికి కూడా ఈ ఇంప్లాంట్స్‌ ప్రయోజనకరం కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ శస్త్ర చికిత్సల గురించిన పలు అంశాలను గుర్తుంచుకోవాలని వైద్యులంటున్నారు. 

కొన్ని సూచనలు... 
► రొమ్ములకు అమర్చే ఈ ఇంప్లాంట్స్‌కి 10 నుంచి 15 ఏళ్ల వరకూ వారంటీ ఉంటుంది. అయితే రెండేళ్లకు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా ఇంప్లాంట్‌ స్థితిగతులను పరీక్ష చేయించుకోవాలి.
 
► చాలా సహజమైన రీతిలో అమరిపోయే ఈ ఇంప్లాంట్‌ అత్యంత అరుదుగా మాత్రం అమర్చిన కొంత కాలానికి కొందరిలో చాలా గట్టిగా మారుతుంది. దీన్ని బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌ ఇల్‌నెస్‌ అంటారు. ఇలాంటి అలర్జీక్‌ రియాక్షన్‌ పరిస్థితిలో అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించుకోవడమే పరిష్కారం. అయితే  ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది.
 
► ఈ ఇంప్లాంట్స్‌ అన్నీ యూరోపియన్‌ దేశాల నుంచీ దిగుమతయ్యే అమెరికన్‌ బ్రాండ్స్‌. 

► స్వల్ప వ్యవధిలోనే పూర్తయే ఈ శస్త్రచికిత్సకు దాదాపుగా రూ.2 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. సర్జరీ పూర్తయిన 2 గంటల్లోనే ఆసుపత్రి నుంచీ డిశ్చార్జ్‌ అయిపోవచ్చు. (క్లిక్: కళ్లలో ఎరుపు చార, కన్నులో బూడిద రంగు వలయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!)


అందుబాటులోకి అత్యాధునిక సర్జరీలు.. 

నగరంలో బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌ సర్జరీల కోసం సగటున రోజుకు ఒకరైనా సంప్రదిస్తున్నారు. దానికి తగ్గట్టే సర్జరీల్లో కూడా మరింత మెరుగైన విధానాలు వస్తున్నాయి. తాజాగా ఛాతీ పరిమాణం పెరగాలని సంప్రదించిన 27 సంవత్సరాల సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగినికి ఎటువంటి గాయం మచ్చ లేకుండా ట్రాన్స్‌ యాక్సిలరీ ఎండోస్కోపిక్‌  విధానంలో ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సను నిర్వహించాం.  
–డా.సంధ్యారాణి, కన్సల్టెంట్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement