implantation
-
Hyderabad: ఇంప్లాంట్స్ క్రేజ్.. నగరంలో సర్జరీల సంఖ్య రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: లోపం పెద్దదైనా సరే.. చిన్నదైనా సరే.. దాన్ని తొలగించుకోవాలని వీలైనంత బాగా కనపడాలనే ఆరాటం అంతకంతకూ పెరుగుతోంది. అందులో భాగంగానే అందాన్ని పెంచే రొమ్ము ఇంప్లాంటేషన్ సర్జరీలకూ సిటీ యువతులు సై అంటున్నారు. నెలకు గరిష్టంగా 25 నుంచి 30 వరకు ఈ రకమైన ఇంప్లాటేషన్ సర్జరీలు సిటీలో జరుగుతున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మన్యూనతకు కారణమయే శారీరక లోపాల్ని పంటిబిగువున భరించే కంటే వ్యయ ప్రయాసలకోర్చి అయినా తొలగించుకోవడమే మేలనే ఆలోచనా ధోరణి ఆధునికుల్లో కనపడుతోంది. ఆర్ధిక స్వాతంత్య్రం మహిళలకు కల్పించిన వెసులుబాటు కూడా దీనికి తోడవుతోంది. అందంతో పాటు ఇది ఆత్మవిశ్వాసంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మానసిక సమస్యలకు ఈ సర్జరీ ఒక పరిష్కారంగా చెబుతున్నారు. సంఖ్య రెట్టింపు... నగరంలోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంధ్యా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ పదేళ్ల క్రితం హైదరాబాద్‌లో నెలకు గరిష్ఠంగా 10–15 బ్రెస్ట్ ఇంప్లాంట్స్ శస్త్రచికిత్సలు జరుగుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 25–30కి పెరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం, ఇంటర్నెట్ ద్వారా అవగాహన పెరుగుతుండడం వల్ల రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగవచ్చునన్నారు. అవసరాన్ని బట్టే... శరీరాకృతి ఒక తీరును సంతరించుకునే టీనేజ్‌లో ఈ తరహా సర్జరీలకు దూరంగా ఉండడం మేలు. కనీసం 20 ఏళ్లు దాటిన తర్వాతే అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. అదే విధంగా 50ఏళ్లు దాటిన వారు కూడా దూరంగా ఉండడమే మేలు. అందం ఒకటే కాకుండా శారీరక సమస్యలకు, ఇక కేన్సర్ చికిత్సలో భాగంగా రొమ్ము కోల్పోయిన వారికి కూడా ఈ ఇంప్లాంట్స్ ప్రయోజనకరం కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ శస్త్ర చికిత్సల గురించిన పలు అంశాలను గుర్తుంచుకోవాలని వైద్యులంటున్నారు. కొన్ని సూచనలు... ► రొమ్ములకు అమర్చే ఈ ఇంప్లాంట్స్‌కి 10 నుంచి 15 ఏళ్ల వరకూ వారంటీ ఉంటుంది. అయితే రెండేళ్లకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఇంప్లాంట్ స్థితిగతులను పరీక్ష చేయించుకోవాలి. ► చాలా సహజమైన రీతిలో అమరిపోయే ఈ ఇంప్లాంట్ అత్యంత అరుదుగా మాత్రం అమర్చిన కొంత కాలానికి కొందరిలో చాలా గట్టిగా మారుతుంది. దీన్ని బ్రెస్ట్ ఇంప్లాంట్ ఇల్నెస్ అంటారు. ఇలాంటి అలర్జీక్ రియాక్షన్ పరిస్థితిలో అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించుకోవడమే పరిష్కారం. అయితే ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. ► ఈ ఇంప్లాంట్స్ అన్నీ యూరోపియన్ దేశాల నుంచీ దిగుమతయ్యే అమెరికన్ బ్రాండ్స్. ► స్వల్ప వ్యవధిలోనే పూర్తయే ఈ శస్త్రచికిత్సకు దాదాపుగా రూ.2 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. సర్జరీ పూర్తయిన 2 గంటల్లోనే ఆసుపత్రి నుంచీ డిశ్చార్జ్ అయిపోవచ్చు. (క్లిక్: కళ్లలో ఎరుపు చార, కన్నులో బూడిద రంగు వలయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!) అందుబాటులోకి అత్యాధునిక సర్జరీలు.. నగరంలో బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీల కోసం సగటున రోజుకు ఒకరైనా సంప్రదిస్తున్నారు. దానికి తగ్గట్టే సర్జరీల్లో కూడా మరింత మెరుగైన విధానాలు వస్తున్నాయి. తాజాగా ఛాతీ పరిమాణం పెరగాలని సంప్రదించిన 27 సంవత్సరాల సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి ఎటువంటి గాయం మచ్చ లేకుండా ట్రాన్స్ యాక్సిలరీ ఎండోస్కోపిక్ విధానంలో ఇంప్లాంట్ శస్త్రచికిత్సను నిర్వహించాం. –డా.సంధ్యారాణి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ -
చిన్నారి రెండు చెవులకూ ఇంప్లాంటేషన్
ఆరిలోవ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోనే మొదటిసారిగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో ఓ చిన్నారి రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో చిన్న పిల్లలకు ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసేవారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రెండు చెవులకూ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడానికి అవకాశం కల్పించారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద మొదటిసారిగా ఈ తరహా ఆపరేషన్‌ను విమ్స్‌లో రెండున్నరేళ్ల ఓ చిన్నారికి విజయవంతంగా నిర్వహించారు. చిన్నారిని సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా మక్కువ గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి భువనేశ్వరి పుట్టుకతో చెవిటి, మూగతనంతో బాధపడుతోంది. ఆమె తండ్రి శంకరరావు ఇటీవల విమ్స్‌లో ఈఎన్టీ వైద్యుడు బి.అన్నపూర్ణారావును కలిశారు. ఆయన పరీక్షలు నిర్వహించి, బాలికకు 100 శాతం వినికిడి సమస్య ఉన్నట్లు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించి, వారి అనుమతితో బాలిక రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి రూ.12 లక్షలు వరకు ఖర్చు అవుతుందని విమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఇంత ఖరీదైన ఆపరేషన్‌ను పేద పిల్లలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారన్నారు. ఇంతవరకు విమ్స్‌లో 10 మంది పిల్లలకు ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఈత మొక్కలతో గీత కార్మికులకు ఉపాధి
గీత కార్మికులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు ఖాళీ ప్రదేశాల్లో, పొలాల గెట్లపై ఈత మొక్కలు నాటుకోవాలి, బిచ్కుంద : ఈత మొక్కలతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తోందని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. శుక్రవారం బిచ్కుంద సౌదర్ చెరువు కట్టపై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు ఖాళీ ప్రదేశాల్లో, పొలాల గెట్లపై ఈత మొక్కలు నాటుకోవాలని, అందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవడానికి సిద్ధంగా ఉందన్నారు. గీత కార్మికులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని వారి అభివృద్ధికి కృషి చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకుటే స్వఛమైన గాలితో అందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. చాలా మంది చెట్లను నరుకుతున్నారు కానీ మొక్కలు నాటకపోవడంతో పచ్చదనం తగ్గి వర్షాలు పడడంలేదన్నారు. కనీసం ఒక వ్యక్తి ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సాయిరాం, రాజుల్లా సర్పంచ్ అశోక్ పటేల్, ఎక్సైజ్ సీఐ సాయన్న, ఎంపీడీవో సాయిబాబా, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రావు, బాబాగౌడ్, బొమ్మల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.