చిన్నారికి సర్జరీ చేస్తున్న విమ్స్ వైద్యులు, (ఇన్‌సెట్‌లో) ఆపరేషన్ జరిగిన తర్వాత చిన్నారి భువనేశ్వరి
ఆరిలోవ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోనే మొదటిసారిగా విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో ఓ చిన్నారి రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో చిన్న పిల్లలకు ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసేవారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రెండు చెవులకూ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడానికి అవకాశం కల్పించారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద మొదటిసారిగా ఈ తరహా ఆపరేషన్‌ను విమ్స్‌లో రెండున్నరేళ్ల ఓ చిన్నారికి విజయవంతంగా నిర్వహించారు. చిన్నారిని సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా మక్కువ గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి భువనేశ్వరి పుట్టుకతో చెవిటి, మూగతనంతో బాధపడుతోంది. ఆమె తండ్రి శంకరరావు ఇటీవల విమ్స్‌లో ఈఎన్‌టీ వైద్యుడు బి.అన్నపూర్ణారావును కలిశారు. ఆయన పరీక్షలు నిర్వహించి, బాలికకు 100 శాతం వినికిడి సమస్య ఉన్నట్లు గుర్తించారు.
బాలిక తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించి, వారి అనుమతితో బాలిక రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి రూ.12 లక్షలు వరకు ఖర్చు అవుతుందని విమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఇంత ఖరీదైన ఆపరేషన్‌ను పేద పిల్లలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారన్నారు. ఇంతవరకు విమ్స్‌లో 10 మంది పిల్లలకు ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment