తండ్రి స్వప్నాన్ని నిజం చేసిన తనయుడు | Sakshi Guest Column On YSR Aarogya Sri | Sakshi
Sakshi News home page

తండ్రి స్వప్నాన్ని నిజం చేసిన తనయుడు

Published Wed, Dec 20 2023 5:33 AM | Last Updated on Wed, Dec 20 2023 5:34 AM

Sakshi Guest Column On YSR Aarogya Sri

వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ఒక బృహత్తరమైన కలకంటూ అది పూర్తిగా నెరవేరక ముందే అర్ధంతరంగా నిష్క్రమించారు. దాన్ని ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి నెరవేర్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సామాన్య ప్రజలకోసం ‘ఆరోగ్య శ్రీ’ పేరుతో ఒక బృహత్తర కార్యక్రమానికి రూప కల్పన చేశారు.  సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న కార్పో రేట్‌ స్థాయి వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చిన పథకమే ఆరోగ్య శ్రీ. అందులో భాగంగానే అత్యవసర సమయాల్లో, పిలుపు అందగానే రయ్యిమని వచ్చి ప్రమాదాల్లో చిక్కు కున్నవారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలు కాపాడడానికి ఉద్దేశించిన ‘108 అంబులెన్స్‌ సర్వీసు’, ప్రజల వద్దకే వెళ్లి రోగనిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన మందులు అక్కడికక్కడే ఉచితంగా ఇచ్చే ‘104 సర్వీసు’లు.

వీటిని వైఎస్‌ చాలా ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ... ఈ పథకాల ద్వారా ఎలాంటి పరిపూర్ణ ఫలితాలు రాబట్టాలని కల కన్నారో, ఆ స్వప్నం సాకారం కాకుండానే హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్ను మూశారు. ఆయన కన్న కలను నిజం చేసే మహత్తర అవకాశం, వైఎస్‌ మరణించిన పదేళ్ల తర్వాత 2019లో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డికి లభించింది. 

ముందు వైఎస్‌ కన్న కల ఎలాంటిదో చెప్పుకుందాం. రోడ్లు విశాలంగా ఆధునికంగా తయారవుతున్నప్పుడు వాటిపై ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదా లకు గురయి కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతూ, అమృత ఘడియల్లో (వైద్య పరిభాషలో గోల్డెన్‌ అవర్స్‌) అవసరమైన  వైద్యసాయానికి నోచుకోకుండా ఏటా వందల వేల సంఖ్యలో, కలిగినవారు లేనివారు అనే తేడాలేకుండా మృత్యువాత పడు తున్నారు. ఇలాంటి వారికి ప్రాణభిక్ష పెట్టేదే 108 అంబులెన్స్‌ సర్వీసు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు మైళ్ళదూరంలో నివసించే పేదవారికి కార్పొరేట్‌ వైద్యం సంగతి సరే, సాధారణ వైద్యం కూడా అందని మావే. షుగర్, బీపీ వంటి రోగాలు వారి శరీరంలో దూరిన సంగతి కూడా వారికి తెలి యదు. ఎందుకంటే వారు తమ జీవితంలో ఎన్నడూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఎరుగరు కాబట్టి. అవి ముదిరి పక్ష వాతం, గుండెజబ్బులకు దారితీసినప్పుడు కానీ పరిస్థితి తమ చేయిదాటి పోయిందనే ఎరుక వారికి కలగదు. ఈ నేపథ్యంలో కలిగిన ఆలోచన 104 సర్వీసు.

జబ్బులు, రోగాలు చెప్పిరావు. వచ్చిపడిన తరువాత తల తాకట్టు పెట్టయినా వైద్యం చేయించాల్సిన పరిస్థితి. చాలీ చాలని ఆదాయాలతో రోజులు గడిపేవారికి ఆసుపత్రులు, ఖరీ దైన  వైద్యం అంటే మాటలు కాదు. అందుకే వైఎస్, ఆరోగ్య శ్రీ అనే పథకానికి రూపకల్పన చేసి అమల్లో పెట్టారు. గుండె జబ్బుల వంటి పెద్ద జబ్బులకు కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోగలిగే అద్భుత అవకాశం పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇంతటితో సరిపోలేదని వైఎస్‌ మరిన్ని ఆలోచనలను జత చేస్తూ ఆరోగ్యశ్రీని మరింత  మెరుగుపరచి, విస్తరించాలని తలపోశారు.

104 వాహనం ప్రతినెలా ఒక నిర్దిష్టమైన రోజు ప్రతి గ్రామానికీ వెళ్లి బాలింతలు, చూలింతలు, వృద్ధులు, బాల బాలికలకు వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఇస్తుంది. వారి ఆరోగ్య రికార్డులను కంప్యూటర్లలో భద్రపరచి, ఇతర ప్రదేశా లకు వెళ్ళినప్పుడు కూడా ఆ రికార్డుల ద్వారా వైద్య సాయం, చికిత్స పొందడానికి వీలైన ఏర్పాట్లు ఈ పథకంలో పొందుపరచారు.

గర్భిణులకు  క్రమబద్ధంగా పరీక్షలు చేసి, గర్భస్థ శిశువు పెరుగుదల గమనించి, తదనుగుణంగా వారికి  పోషకా హారం అందించడమే కాకుండా, పురుడు వచ్చే రోజును నిర్ధా రించి, 108 అంబులెన్స్‌కు కబురుచేసి, వారికి సకాలంలో ఆసుపత్రులలో పురుడుపోసుకునే వీలు కల్పించాలని అను కున్నారు. అలాగే ప్రసవానంతరం ఆ తల్లీ బిడ్డలను క్షేమంగా ప్రభుత్వ  అంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చాలనేది కూడా వైఎస్‌ తలంపు.

వైఎస్‌ కన్న కలలో పూర్తికాని, అమలుకు నోచుకోని ఆయన ఆలోచనలకు వైఎస్‌ జగన్‌ తన హయాంలో పూర్తి స్వరూపం కల్పించారని ఆరోగ్య శ్రీ గురించి ఆయన మొన్న చేసిన ప్రకటన చెప్పకనే చెబుతోంది. వైఎస్‌ స్వప్నం నేరవేర్చ డానికి ఆయన ప్రస్తుతం లభ్యం అవుతున్న అధునాతన కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం హర్షణీయం. విశాలమైన రహదారులూ, రమ్య హర్మ్యాలూ అభివృద్ధికి కొలమానాలు కావచ్చు. అయితే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం  కూడా కళ్ళకు కనిపించని పురోగతే.    
             
తోక టపా:
సీనియర్‌ జర్నలిస్ట్‌ దారా గోపి తన అనుభవం గురించి ఓసారి చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే:       
‘రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టారు. చాలామంది డబ్బున్నోళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుని వైద్యం చేయించుకుంటున్నారు. అప్పుడు ఓ సారి ఆయన విజయవాడ వచ్చినప్పుడు నేను ఇదే ప్రస్తావించాను. ఆయన నాకు రెండు ఉదాహరణలు చెప్పారు. 

1. వరద వచ్చినప్పుడు ముందుగా చెత్తా చెదారం వస్తుంది. మంచినీళ్ళు ఆ తర్వాతే వస్తాయి. ఈ స్కీం ఇప్పుడే పెట్టాం కాబట్టి చెత్తా చెదారం ఉంటుంది.
2. నేను పేదలకు అన్నదానం అని ప్రకటించా. ఓ పెద్దాయన ప్లేట్‌ పట్టుకుని వరసలో నుంచుంటే, ఆ ప్లేట్‌లో అన్నం పెట్టకుండా ఎలా ఉంటాను!?’

భండారు శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement