విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అధునాతన 104,108 వాహనాలు
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన సీఎం జగన్ ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108, 104 సర్వీసులను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయగా, ఇప్పుడు సీఎం జగన్ వాటికి అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
108 సర్వీసుల్లో మార్పులు
► అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు.
► కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్‌ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్‌ఎస్)గా తీర్చిదిద్దారు.
► మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు.
ఎన్నో సదుపాయాలు
► బీఎల్‌ఎస్ అంబులెన్స్‌లలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్‌ఎస్ అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నేటల్ అంబులెన్స్‌లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు.
జనాభా–అంబులెన్స్‌ల నిష్పత్తి
► గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండనుంది.
► గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు.
విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణలో 104,108 వాహనాలు
ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు
► ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేస్తారు.
► ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఉంటుంది.
► ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయడం సులువు అవుతుంది.
వేగంగా సేవలు
► పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు.
► ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది.
► ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఎంఎంయూల్లో 20 రకాల సేవలు
► మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ మొత్తం 20 రకాల సేవలందించేలా 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది.
► అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1,088 వాహనాలను సీఎం జగన్ బుధవారం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేసింది. కొత్త, పాత అంబులెన్స్‌లతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ.318.93 కోట్లు ఖర్చు కానుంది.
104 సర్వీసుల్లో మార్పులు.. కొత్తగా 676 వాహనాలు
► మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక 104 సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 676 సర్వీసులను సిద్ధం చేశారు.
గతానికి ఇప్పటికీ మార్పు
► రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్స్‌లు 440కి గాను ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ సేవలందించనున్నాయి.
► మండలానికి ఒకటి చొప్పున ఉండే 104 వాహనాలు నెలలో ఒక రోజు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులను ఇవ్వనున్నాయి.
► రోజుకు ఒక గ్రామ సచివాలయాన్ని సందర్శించడంతో పాటు రోజంతా ఆ గ్రామంలో డాక్టర్లు ఉంటారు. గ్రామంలోని ఇళ్లను, అంగన్‌వాడీ కేంద్రాలను, పాఠశాలలను కూడా సందర్శించి వైద్య సేవలు అందిస్తారు.
► గ్రామీణ ప్రాంతాల్లో ఒకే డాక్టర్ ద్వారా వైద్య సేవలు కల్పించడం ద్వారా విదేశాల తరహాలో ఫ్యామిలీ డాక్టర్‌గా మంచి సేవలు అందించడానికి వీలుంటుంది.
► గతంలో 104 అంబులెన్స్‌లు (ఎంఎంయూ) 292 మాత్రమే (మూడు మండలాలకు ఒకటి) ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలతో పాటు 74 రకాల ఔషధాలు అందుబాటులో ఉంటాయి. గతంలో 52 ఔషధాలు మాత్రమే ఉండేవి.
► ఇప్పుడు హైపర్ టెన్షన్ (బీపీ), మధుమేహం (సుగర్), సాధారణ అవుట్ పేషంట్లకు చికిత్స అందించడంతో పాటు మలేరియా, టీబీ, లెప్రసీ, మాతా శిశు సంరక్షణ, తదితర 20 రకాల వైద్య సేవలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి.
► సీజనల్ వ్యాధులతో సహా 29 పరికరాలతో అంటువ్యాధులు, ఇతర వ్యాధుల స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. గతంలో ఈ అంబులెన్స్‌లలో కేవలం వైద్యులు మాత్రమే అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు.
► ప్రస్తుతం 104 సర్వీసుల్లో మొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. వీటిని డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా వైద్య సేవలు అందనున్నాయి.
► గతంలో 292 వాహనాలతో రోజుకు కేవలం 20 వేల మంది రోగులకు సేవలందించగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 676 సర్వీసుల ద్వారా రోజూ 40,560 మందికి సేవలందుతాయి.
నేడు సువర్ణ అధ్యాయానికి నాంది
ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని
రాష్ట్ర ప్రజారోగ్య రంగంలో ఒక సువర్ణ అధ్యాయానికి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలుకుతున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1088 కొత్త 108, 104 వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం 9 గంటల సమయంలో సీఎం ప్రారంభించనున్నారని వెల్లడించారు. దివంగత వైఎస్సార్ ప్రారంభించిన ఈ సేవలను చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రతకు 108 సర్వీస్ లింక్
► 108 అంబులెన్స్ సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు.
► రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వ్యయం వరకు వైద్య సేవలందిస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment